సర్కార్‌ సొంత పెత్తనం..!


► ఎస్‌డీఎఫ్‌ నిధుల విడుదలలో వివక్ష

► అధికార పార్టీ ఎమ్మెల్యేలకే నిధుల కేటాయింపు

► ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జికి నిధుల మంజూరు

► ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ


ఒంగోలు టూటౌన్‌: జిల్లాలోని నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించే ఎస్‌డీఎఫ్‌ నిధుల విడుదలలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అవమానపరుస్తోంది. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గంలో టీడీపీ ఇన్‌చార్జిలను నియమించి వారికి  ఎస్‌డీఎఫ్‌ నిధులు కేటాయించింది.


ప్రజలు ఎన్నుకున్న శాసన సభ్యులను పక్కనపెట్టి ఓడిపోయిన తమ పార్టీ వారికి ప్రాధాన్యం ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిధులు మంజూరు చేయడమే కాకుండా చేసిన పనిని సమర్థించుకుంటూ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతోంది. ఎస్‌డీఎఫ్‌ నిధులకు దరఖాస్తు చేసుకున్న వారికే నిధులు కేటాయించినట్లు సర్కార్‌ చెప్పడం పలు విమర్శలకు తావిస్తోంది.


నియోజకవర్గానికి రూ.4 కోట్లు...

ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటితో పాటు జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేస్తూ మరో రూ.2 కోట్లు జత చేసింది. దీంతో ఒక్కొక్క నియోజకవర్గానికి రూ.4 కోట్లు మంజూరయ్యాయి. 2015–16 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉన్న వై.పాలెం, ఎస్‌ఎన్‌ పాడు, మార్కాపురం, పర్చూరు, కనిగిరి, ఒంగోలు, కొండపి, కందుకూరు, గిద్దలూరు, చీరాల, దర్శి, అద్దంకి నియోజకవర్గాలకు ప్రభుత్వం ఎస్‌డీఎఫ్‌ (స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌) నిధులు మంజూరు చేసింది.


2016–17 ఆర్థిక సంవత్సరంలో గిద్దలూరు, అద్దంకి, పర్చూరు, ఎస్‌ఎన్‌ పాడు, కొండపి నియోజకవర్గాలకు నిధులు మంజూరయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.2 కోట్లతో కలుపుకుని మొత్తం రూ.54 కోట్లు మంజూరయ్యాయి.


జిల్లాపై పగబట్టిన సీఎం...

అసలే అభివృద్ధిలో వెనుకబడిన ప్రకాశం జిల్లాపై సీఎం చంద్రబాబు పగబట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామాయపట్నం పోర్టుని అడ్డుకోవడం, యూనివర్సిటీ ఏర్పాటు, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమైన వాటిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జిల్లా ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్నారు. చివరకు ఎస్‌డీఎఫ్‌ నిధుల కేటాయింపులోనూ సొంతపెత్తనం చేస్తున్నారు.


దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నిధులు కాజేసేందుకు సిద్ధమవుతున్నారు. అభివృద్ధి పనులను వాటాల రూపంలో దక్కించుకుంటున్న నేతలు.. నిధులు కాజేసి అరకొరగా పనులు చేసి మమ అనిపిస్తున్నారు. సీఎం తీరుతో జిల్లాకు అన్యాయం జరుగుతోందని ప్రజలు విమర్శిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top