రైతు గుండెకు గండి


చెరువులను విస్మరించిన వైనం

మరమ్మతుల జాడ లేదు

‘నీరు-చెట్టు’లో అత్యవసర పనులకు లభించని ప్రాధాన్యత

మట్టి పనులకే పరిమితం

ఫలితంగా భారీ వర్షం నీరంతా వృథా


 

తిరుపతి: మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలకు భారీగా చెరువులకు నీరు చేరింది. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. వచ్చిన వెంటనే వృథాగా పోయింది. చెరువులపై పర్యవేక్షణ కొరవడటం,అధికారుల నిర్లక్ష్యం వెరసి రైతుల పాలిట శాపంగా మారింది. తూములు,మరవలు,కట్టలతో పాటు పలు గ్రామాల్లో  చెరువులకు మరమ్మతులు చేయకపోవడంతో వచ్చిన నీరు అంతా వృధాగా పోయింది. పలుచోట్ల చెరువులు తెగి, గ్రామాల్లోకి నీరు చేరడంతో పాటు, పంట పొలాలు కోతకు గురై అన్నదాతలకు ఆవేదనను మిగిల్చాయి. కుప్పం, తంబళ్లపల్లె ప్రాంతంలో 50 శాతంకు పైగా చెరువులు నిండలేదు. వరుస కరువులతో తల్లడిల్లిన జిల్లా వాసులకు వర్షాలు ఉపశమనం ఇస్తాయనుకున్నా పాలకుల నిర్లక్ష్యంతో ఆశించిన స్థాయిలో మేలు జరగలేదు. దాదాపు 200 చెరువులకు గండ్లు పడినీరు నిరుపయోగంగా పోయింది. కాళంగి రిజర్వాయర్ గేట్లు విరిగి పోవడంతో భారీగా వరద నీరు వచ్చినా ఫలితం దక్కలేదు.



జిల్లాలోని ప్రాజెక్టుల్లో 30టీఎంసీల నీటినినిల్వ చేసుకొనే సామర్థ్యం ఉన్నా ప్రస్తుతం 25 టీఎంసీల నీరు మాత్రమే ఉండటం గమనార్హం. కాళంగి రిజర్వాయర్ సామర్థ్యం 241 ఎంసీఎఫ్‌టీ కాగా ప్రస్తుతం అక్కడ కేవలం 18 ఎంసీఎఫ్‌టీ అడుగుల నీరు మాత్రమే పరిమితమైంది. పెద్దెరు నీటి నిల్వసామర్థ్యం 590 ఎంసీఎఫ్‌టీలుకాగా డ్యాంలో 443 ఎంసీఎఫ్‌టీల నీరు చేరింది.పీలేరు నియోజక వర్గంలో మేడికుర్తి ప్రాజెక్టుకు గండి పడటంతో డ్యాంలో నీరు కొద్ది మేర మ్రామే ఉన్నాయి.

 

నీరు-చెట్టు పనులు సక్రమంగా చేసి ఉంటే...


జిల్లాలో రూ.136 కోట్ల మేర 3079 నీరు-చెట్టు పనులకు అధికారులు అనుమతులిచ్చారు. ఇందులో 2670 పనులు పూర్తి కాగా రూ. 88 కోట్లు ఖర్చు చేశారు. ఈ నిధులను అత్యవసర పనులకు వినియోగించి ఉంటే పలు చెరువుల్లోకి భారీగా నీరు చేరేది. రైతులకు లబ్ధి చేకూరేది. పలుచోట్ల చెరువు తూములు,మరువలు, సిమెంట్ కాంక్రీట్ పనులు చేయక పోవడం వల్లే నీరు వృథాగా పోయిందనిరైతులు ఆవేదన చెందుతున్నారు. నీరు-చెట్టు నిధులను కేవలం మట్టి పనులకు ఉవయోగించి అధికార పార్టీ నేతలకు లబ్ధి కలిగించారని ఆరోపిస్తున్నారు. వాటిని సక్రమంగా ఉవయోగించి ఉంటే సత్ఫలితాలు వచ్చేవని పలువురు రైతులు భావిస్తున్నారు. కొన్ని చోట్ల చెరువులకు నీరు వచ్చే కాలువలు, పంటకాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాటిని పట్టించుకున్న దాఖలా లేదు. ఫలితంగా భారీ వర్షాలు వచ్చినా ఒక్క భూగర్భ జలాల విషయంలోనే మేలు జరిగిందనేది వ్యవసాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top