‘సుప్రీం తీర్పుతో నిరాశ


ప్రొద్దుటూరు:

 రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతి ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించడంతో విద్యార్థులతో పాటు యాజమాన్యాల ఆశలు అడియాశలయ్యాయి. జిల్లాలోని 20 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలన్నింటికీ కలిపి 9,500 వరకు సీట్లు ఉండగా ఇందులో 2,500  కూడా తొలి విడతలో భర్తీ కాలేదు. రెండోమారు కౌన్సెలింగ్ జరిగితే పరిస్థితి మెరుగు పడుతుందని పలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు ఎంతో ఆశతో ఎదురుచూశాయి. అయితే ఉన్నట్లుండి సుప్రీంకోర్టు రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో అటు కళాశాలల యాజమాన్యాలతోపాటు ఇటు విద్యార్థులు కూడా నష్టపోతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సిలింగ్ ఆలస్యంగా జరగడంతో అడ్మిషన్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో మన ప్రాంతం విద్యార్థులు హైదరాబాద్‌లో చేరే పరిస్థితి ఉండదని, దీని వల్ల మంచి రోజులు వచ్చినట్లేనని ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు ఆశించాయి. అయితే కౌన్సెలింగ్ నిర్వహణలో జాప్యం ఏర్పడటంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. తొలుత ఏదో ఒక కళాశాలలో చేరాలనే లక్ష్యంతో కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు రెండో విడతలో ఇష్టమైన కళాశాలను ఎంపిక చేసుకోవాలని భావించారు. వారికి ఆ అవకాశం లేకుండా పోయింది. జిల్లాలోని 20 ఇంజనీరింగ్ కళాశాలలకు సంబంధించి 15 కళాశాలల్లో అడ్మిషన్లు రెండంకెలకు మించని పరిస్థితి నెలకొంది. వారిని బ్రాంచిల వారిగా విభజిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కళాశాలలకు సంబంధించి అడ్మిషన్ల దృష్ట్యా తరగతులు నిర్వహిస్తారా లేదా అని విద్యార్థుల తల్లిదండ్రుల్లో అనుమానాలు నెలకొన్నాయి.

 ఇప్పటికే పలువురు తల్లిదండ్రులు కళాశాలల వద్దకు వెళ్లి తమ అనుమానాలు నివృత్తి చేసుకుంటున్నారు.  ఇప్పటి వరకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చవిచూడలేదని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top