శ్రీకనకదుర్గ లేఅవుట్ కథ క్లైమాక్స్‌కు..

శ్రీకనకదుర్గ లేఅవుట్ కథ క్లైమాక్స్‌కు.. - Sakshi


రేపు కౌన్సిల్‌లో చర్చ

 నేడు కార్పొరేటర్లకు స్పెషల్ ‘క్లాస్’

 టీడీపీలో రగులుతున్న అసమ్మతి సెగలు

 వ్యూహ ప్రతివ్యూహాలతో వేడెక్కుతున్న రాజకీయం

 


 విజయవాడ సెంట్రల్ : వివాదాస్పద శ్రీకనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ లేఅవుట్ కథ క్లైమాక్స్‌కు చేరింది. బుధవారం జరిగే నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మే 7వ తేదీన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాన్ని ఆమోదించడం, అధికార పార్టీ కార్పొరేటర్లే మేయర్‌పై తిరుగుబాటు బావుట ఎగరేయడం తెలిసిందే. గత కౌన్సిల్‌లో ఆమోదమైన ఈ లేఅవుట్ తీర్మానాన్ని ధ్రువీకరించాలా, లేక తిరస్కరించాలా.. అనే దానిపై టీడీపీ కార్పొరేటర్ల మధ్య రసవత్తర చర్చ నడుస్తోంది. అప్పుడు తప్పుబట్టి ఇప్పుడు ‘పచ్చ’జెండా ఊపితే జనంలో పరువు           పోతుందనే అభిప్రాయాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నారు.

 

నేడు శిక్షణా తరగతులు

 శ్రీకనకదుర్గ లేఅవుట్ వ్యవహారంలో జరిగిన రాద్ధాంతంతో టీడీపీ ప్రతిష్ట ఇప్పటికే దెబ్బతింది. సీఎం పేషీ నుంచి దీనిపై ఆరా తీశారు. ఈ క్రమంలో కౌన్సిల్‌లో వ్యవహరించాల్సిన తీరుపై మంగళవారం ఆ పార్టీ కార్పొరేటర్లకు శిక్షణా తరగతులు ఏర్పాటుచేశారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు దిశానిర్దేశం ఏర్పాటుచేసే విధంగా పకడ్బందీ ప్రణాళిక రూపొందించారు. అత్యధికశాతం కార్పొరేటర్లు లేఅవుట్ తీర్మానాన్ని తిరస్కరిద్దామనే ఆలోచనలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

 వివాదం నడుస్తున్న సమయంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తీర్మానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. నెల రోజుల కిందట టీడీపీ కార్పొరేటర్ల బృందం లేఅవుట్‌ను పరిశీలించినప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ క్రమంలో తాజాగా జరగనున్న భేటీలో తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుదామనే ధోరణిలో కార్పొరేటర్లు ఉన్నట్టు భోగట్టా. కార్పొరేటర్ల స్పీడ్‌కు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో బ్రేకులు వేయిద్దామనే ధోరణిలో మేయర్ కోనేరు శ్రీధర్ ఉన్నారన్న గుసగుసలూ వినిపిస్తున్నాయి.



 ఏకాభిప్రాయం సాధ్యమేనా..

 సొంత పార్టీ కార్పొరేటర్లతో డీల్ ఓకే అయితే కౌన్సిల్‌లో చెలరేగిపోవచ్చనే యోచనలో మేయర్   కోనేరు శ్రీధర్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ సీపీ-19, సీపీఎం, బీజేపీకి చెరొక కార్పొరేటర్ ఉన్నారు. టీడీపీ కార్పొరేటర్లను ఏకతాటిపైకి తీసుకు           రాగలిగితే ఓటింగ్‌లో నెగ్గవచ్చనే ఎత్తుగడలో పార్టీ పెద్దలు ఉన్నట్టు సమాచారం. టీడీపీ కార్పొరేటర్లలో ఏకాభిప్రాయం సాధ్యమవుతుందా, లేదా అనే విషయం తేలాలంటే            ‘స్పెషల్’ క్లాస్ పూర్తయ్యే వరకూ ఆగాల్సిందే.  

 

 వివాదం ఇదీ..

 కనకదుర్గ కో-ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్‌కు చెందిన 12.96 ఎకరాల భూమిని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుని లేఅవుట్ రిలీజ్ చేయాల్సిందిగా సొసైటీ సభ్యులు కోరారు. 1994 నుంచి ఈ ఫైల్ ఉడాలో పెండింగ్  ఉంది. నాటి నిబంధనల ప్రకారం 12.5344 (పది శాతం) లేఅవుట్ వదలాల్సి ఉండగా, 1,088 సెంట్లు (8.68 శాతం) మాత్రమే వదిలారు. లే అవుట్ స్థలం తక్కువ వదలడంతో ఉడా ఫైల్ పెండింగ్ పెట్టింది.  ఉడా సీఆర్‌డీఏగా రూపాంతరం చెందడంతో ఫైల్ కార్పొరేషన్‌కు చేరింది. 8.68 శాతం మాత్రమే స్థలం ఉన్నప్పటికీ లేఅవుట్ రిలీజ్‌కు కౌన్సిల్ ఆమోదముద్ర వేయడం వివాదాస్పదంగా మారింది. 14 శాతం లేఅవుట్ ఓపెన్ స్పేస్‌కు గాను 8.68 శాతం మాత్రమే సొసైటీ వదలింది. మిగిలిన స్థలం మార్కెట్ వాల్యూ ప్రకారం రూ.15కోట్లు ఉంటుందని అంచనా. ఇంత భారీ మొత్తం మినహాయింపు ఇవ్వడం వెనుక అమ్యామ్యాల కథ నడిచిందని టీడీపీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top