డెరైక్టర్ డౌన్..డౌన్

డెరైక్టర్ డౌన్..డౌన్


వేంపల్లె(ఇడుపులపాయ) : ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. తమను అన్నివిధాలా వేధిస్తున్నారని ఆరోపిస్తూ  ధర్నాకు దిగారు. డెరైక్టర్,  సెక్యూరిటీ  సీఐని  తొలగించాలని నినాదాలు చేశారు.   ఈనెల 16వ తేదీన ఈ-1 క్యాంపస్‌లోని సెకండ్ ఫ్లోర్‌లో కొంతమంది విద్యార్థులు ఐఐటీ ఫ్యాకల్టీ అధ్యాపకురాలిపై  కామెంట్  చేశారు. దీంతో ఆమె డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డికి, సీఐ రసూల్, ఓఎస్డీ ప్రభాకర్‌రెడ్డిలకు ఫిర్యాదు చేశారు.



మీరు పట్టించుకోకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న విద్యార్థులను గుర్తించి ఒక గదిలోకి పిలిపించుకుని కామెంట్ చేసిన వ్యక్తులు ఎవరు అని ఒత్తిడి  తెచ్చారు. ఇద్దరు ముందుకు రావడం.. వారిపై చర్యలు తీసుకోవడమేకాకుండా చితకబాదినటు తెలుస్తోంది. తాము ఐఐటీ అధ్యాపకురాలు అనుకోలేదని.. స్టూడెంటు అనుకుని అలా వ్యవహరించామని విద్యార్థులు తెలియజేసినట్లు సమాచారం .



అదే రోజున ఈ-4 విద్యార్థులు ఓ మెస్‌లో జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడికి వెళ్లి రాత్రి 11గంటలవరకు అక్కడే ఉండటంతో మెస్ నిర్వాహకులు సెక్యూరిటీ సిబ్బందికి తెలియజేశారు. దీంతో అక్కడికి వెళ్లిన సెక్యూరిటీ సిబ్బంది ఇంత సమయం వరకు ఎందుకు ఉన్నారని ప్రశ్నించడంతో వారిపై తిరగబడినట్లు తెలిసింది. దీంతో అక్కడ వారిని కూడా సెక్యూరిటీ సిబ్బంది చితకబాదినట్లు తెలిసింది.



ఈ రెండు సంఘటనలపై విద్యార్థులు దాదాపు 2వేలమంది శుక్రవారం సాయంత్రం రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. అనవసరపు సాకులు చెప్పి తమపై నిందలు వేస్తున్నారని.. విద్యార్థులంటేనే గౌరవం లేదని ఆరోపించారు.  ఈ రెండు సంఘటనలు ఏకకాలంలో జరిగాయి.  



శుక్రవారం వరకు పరీక్షలు ఉండటంతో అంతవరకు ఓపిక పట్టి.. అదే రోజు సాయంత్రం విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలు తీర్చకపోతే ధర్నాను కొనసాగిస్తామని విద్యార్థులు తెగేసి చెప్పారు. డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థులతో పొద్దుపోయేదాకా మాట్లాడారు. కానీ చర్చలు కొలిక్కి రాలేదు.



 డెరైక్టర్ ఏమంటున్నారంటే.. :

 ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలన్నదే తన తపన అని.. అందులో భాగంగా విద్యార్థులు క్రమశిక్షణ తప్పినప్పుడు కొన్ని చర్యలు తీసుకోక తప్పదని ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులను చితకబాదిన మాట అవాస్తవమని తెలిపారు.  రెండు సంఘటనలు జరిగాయని తమ దృష్టికి రావడంతో సంబంధిత విద్యార్థులను కార్యాలయంలోకి పిలిపించి గట్టిగా మందలించామన్నారు.



సీఐ క్షమాపణతో సమసిన వివాదం   

విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు ట్రిపుల్ ఐటీ అధికారులు దిగి వచ్చారు. విద్యార్థుల సమస్యలను డెరైక్టర్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు చర్చించారు.  తిరునాథ్ అనే విద్యార్థిని కొట్టినందుకు సెక్యూరిటీ ఇన్‌ఛార్జి, సీఐ రసూల్ క్షమాపణ చెప్పారు.  విద్యార్థినిలను అనుచితంగా మాట్లాడిన హెచ్‌ఆర్‌టీ చిన్నారెడ్డి, మహిళా సెక్యూరిటీ గార్డులు ఉమా, ఫాతిమాలను  సస్పెండ్  చేస్తున్నట్లు ట్రిపుల్ ఐటీ ఇన్‌ఛార్జి డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి విద్యార్థుల ముందు ప్రకటించారు.



అలాగే పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని హామీఇచ్చారు.  క్యాంపస్‌లో లైట్లు, ఇతర సమస్యలన్నింటినీ  త్వరలో పరిష్కరిస్తామన్నారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకుని వేంపల్లె ఎస్‌ఐ హాసం, ఆర్‌కే వ్యాలీ ఎస్‌ఐ ప్రదీప్‌నాయుడు, పోలీసులు అక్కడికి చేరుకుని  బందోబస్తు నిర్వహించారు.



 మాట మార్చిన డెరైక్టర్ :

 ట్రిపుల్ ఐటీ డైర్టర్ వ్యవహార శైలిపై  విద్యార్థులు అసంతృప్తిగా ఉన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలేదని.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగడంతో మొదట తమ తప్పేమి లేదని.. విద్యార్థుల బాగు కోసమే మందలించామని చెప్పుకొచ్చిన డెరైక్టర్.. ఏ ఒక్క విద్యార్థిని కొట్టలేదని మీడియాకు తెలిపారు.



తర్వాత అర్ధగంటకే విద్యార్థుల ముందు బహిరంగంగా తప్పు జరిగినందుకు హెచ్‌ఆర్‌టీ, మహిళా సెక్యూరిటీ గార్డులను సస్పెండ్ చేశామని ఇన్‌ఛార్జి సెక్యూరిటీ అధికారితో క్షమాపణ  చెప్పిస్తామని చెప్పడం  గమనార్హం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top