ఊరికి ఉరి!


వంశధార నిర్వాసితులతో ఆటలాడుకుంటున్న చంద్రబాబు సర్కార్‌ మరోసారి బలప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తరతరాలుగా ఉంటున్న గ్రామాల నుంచి నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు వ్యూహం రచిస్తోంది. ఇప్పటికే  ఉపాధి పనులతో పాటు అభివృద్ధి పనులను నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్న సర్కార్‌.. ఇప్పుడు సంక్షేమ పథకాలతోపాటు విద్యార్థులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరు కూడా నిలిపివేసి బలవంతంగా సొంత గ్రామాల నుంచి తరిమేయడానికి పన్నాగం పన్నుతోంది.



హిరమండలం:  వంశధార నిర్వాసితులను ఏదో ఒకలా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేçస్తూనే∙ఉంది. అర్హులైన వారికి నష్టపరిహారం ఇవ్వకుండా..అనర్హులకు ఇచ్చి తన వైఖరి ఏమిటో చెప్పిన చంద్రబాబు సర్కార్‌..యూత్‌ ప్యాకేజీ విషయంలోనూ అదే తీరును అనుచరించింది. తాజాగా గ్రామాలను ఖాళీ చేయించే కుయుక్తిలో భాగంగా నిర్వాసితులకు సంక్షేమ పథకాలకు దూరం చేయాలని చూస్తోంది. ఈ మేరకు ఉన్నతధికారుల నుంచి మండలస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. దీంతో వాటిని తక్షణమే అమలు చేసేందుకు స్థానిక అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ విషయం తెలిసి నిర్వాసితుల్లో ఆందోళన ప్రారంభమైంది. ప్రభుత్వతీరుపై ఆగ్రహవ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే  మరో పోరాటం తప్పదని అధికారులను హెచ్చరిస్తున్నారు.



రేషన్‌ సరుకులు ఇవ్వకండి

ప్రభుత్వ ఆదేశాలను కిందిస్థాయి అధికారులు బుధవారం నుంచే అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మోహన్‌బాబు హిరమండలం తహసీల్దార్‌ కార్యాలయలంలో నిర్వాసిత గ్రామాలకు చెందిన రేషన్‌డిపో డీలర్లతో ఉదయం సమావేశం నిర్వహించారు. నిర్వాసిత గ్రామాల్లో సరుకులు పంపిణీ చేయరాదని తేల్చిచెప్పారు. వానికి కేటాయించిన పునరావాస కాలనీలోనే సరుకులు పంపిణీ చేయాలని లేదా మండల కేంద్రంలో పంపిణీ చేయాలంటూ డీలర్లను ఆదేశించారు. దీంతో డీలర్లు కంగుతిన్నారు. సుభలయ పునరావాస కాలనీలోని సామాజిక భవనాన్ని వేరేచోటుకు మార్చేందుకు కూడా జిల్లా పౌరసరఫరాల అధికారి జి.మోహన్‌బాబు పరిశీలన జరిపారు.



కార్యదర్శులతో సమావేశం..

సాయంత్రం మండల ప్రత్యేక అధికారి జి.రాజారావు మండలపరిషత్‌ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులు, పంచాయితీ, రెవెన్యూ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నిర్వాసిత గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టరాదని, సంక్షేమపథకాలు పంపిణీ చేయరాదని స్పష్టం చేశారు. వీటన్నింటిని పునరావాస కాలనీల్లో ఉన్నవారికి మాత్రమే పంపిణీ చేయాలని ఆదేశించారు. రికార్డులు కూడా మండల కేంద్ర కార్యాలయాల్లో ఉంచాలే తప్ప నిర్వాసిత గ్రామాల్లో ఉంచరాదన్నారు. అలాగే నిర్వాసిత గ్రామాల్లో తిరిగి వారి పనుల్లో సహకారం అందిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



ఎస్పీ పరిశీలన

వంశధార రిజర్వాయర్‌ను ఇటీవల ఎస్పీ సీఎం త్రివిక్రవర్మ పరిశీలించారు. ఈయన తొలుత నిర్వాసితులు ఆందోళన చేసిన స్థలాలను పరిశీలించారు. దీంతో పాటు గార్లపాడు రహదారి, తులగాం గెడ్డను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఇంతలోనే బుధవారం అధికారులు వేర్వేరుగా సమావేశలు నిర్వహించి నిర్వాసితులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయవద్దని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. వీరిపై ఉక్కుపాదం మోపేందుకు పావులు కదుపుతున్నారనే విషయం తేలతెల్లమవుతోందని ప్రజలు భావిస్తున్నారు.



నిర్వాసిత గ్రామాల్లో సేవలు నిలుపుదల చేయాలి

హిరమండలం: వంశధార నిర్వాసిత గ్రామాల్లో ప్రభుత్వపరంగా అందే సేవలను తక్షణమే నిలుపుదల చేయాలని  మండలప్రత్యేక అధికారి జి.రాజారావు అన్నారు. ఇకనుంచి వారికి కేటాయించిన పునరావాస కాలనీల్లో  అందుబాటులో ఉండి అన్ని సేవలతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసిత గ్రామాల్లో జరుగుతున్న సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలని ఆదేశించారు. నిర్వాసిత గ్రామాల్లో ఎవరైన అధికారులు కార్యక్రమాలు చేపట్టిన, ఇతర పనులు చేసినా వారిపై ప్రత్యేక చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. అలాగే నిర్వాసిత గ్రామాల్లో అధికారులు ఎలాంటి రికార్డులు, ఇతర పరికరాలు ఉంచవద్దని ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్టు చెప్పారు. ఆగస్టు నెల నుంచి పింఛన్లను వారికి కేటాయించిన పునరావాస కాలనీల్లో పంపిణీ చేయాలని కూడా ఆదేశాలు అందాయన్నారు. అనంతరం అన్నిశాఖల అధికారులతో వారి శాఖల పనితీరుపై సమీక్ష జరిపారు.గ్రామాల్లో అందుబాటులో ఉండి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎంపీడీవో జి.కాశీవిశ్వనాథరావు, తహసీల్డార్‌ ఎం.కాళీప్రసాద్, ఈఓపీఆర్‌డీ కె.విజయలక్ష్మి, ఏఓ ఎస్‌.గాయత్రి, ఏపిఓ శ్రీదేవి, ఏఈ అప్పన్న పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top