భయం...భయంగా సేద్యం

భయం...భయంగా  సేద్యం - Sakshi


రాత్రి కరెంట్‌తో అన్నదాత కష్టాలు

చలి, మంచు, విషపురుగులతో ఇబ్బందులు

తాగునీటికీ తిప్పలు పడుతున్న ప్రజలు


 

జిల్లాలో రాత్రిపూట కరెంట్ రైతుకు శాపంగా మారింది. భార్యాబిడ్డల్ని వదిలి.. విషపురుగులకు ఎదురొడ్డి.. పంటకు నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్యుత్ సమస్యలు ఎదురైనా.. ఎగ్ ఫీజులు పోయినా.. స్టార్లర్లు.. మోటార్లు మొరాయించినా చీకట్లోనే తడబడుతూ సరిచేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక భయం..భయంగా బతుకుబండిని లాక్కురావాల్సి వస్తోంది. గ్రామీణులు కాళరాత్రిలో ఖాళీ బిందెలు చేతబట్టి బోర్లు.. బావుల వద్ద కళ్లుకాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తోంది. రాత్రిపూట కరెంట్‌తో ఎదురవుతున్న ఇబ్బందులపై ‘సాక్షి’ విజిట్.

 

తిరుపతి: కర్షకుడి బతుకు చీకటిమయమైంది. మొన్నటివరకు వర్షాభావంతో అష్టకష్టాలుపడ్డ అన్నదాత నేడు రాత్రి పూట కరెంట్‌తో కంటిమీద కునుకులేకుండా జాగారం చేయాల్సి వస్తోంది. వ్యవసాయానికి నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని చంకలుగుద్దుకుంటున్న పాలకులు క్షేత్రస్థాయిలో రైతులు పడే కష్టాన్ని గుర్తించలేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాత్రిపూట కరెంట్‌తో ఎదురవుతున్న ఇబ్బందులపై గురువారం రాత్రి ‘సాక్షి’ బృందం ప్రత్యేకంగా పరిశీలించింది.



జిల్లా వ్యాప్తంగా దాదాపు 2.36 లక్షల విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. వీటిని ఏ, బీ, సీ గ్రూపులుగా విభజించి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మూడు గ్రూపులకు సంబంధించి విద్యుత్ సరఫరాలో పగలు నాలుగు గంటలు, రాత్రి వేళ 3 గంటలు విద్యు త్ సరఫరా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సుమారు 80వేల మంది రైతు లు రాత్రిపూట జాగారం చేయాల్సి వస్తోంది. లోఓల్టేజీతో ఫీజు పోయి నా.. స్టార్టర్లు పనిచేయకపోయినా.. మోటార్లు మొరాయించినా చీకట్లోనే రిపేర్లు చేసుకోవాల్సి వస్తోంది. అయితే జిల్లాలోని 11 మండలాల్లో మాత్రం మూడు షిప్టులు ఏకదాటిగా కరెంట్ సరఫరా చేస్తున్నారు.



భయం..భయంగా

రాత్రి వేళ్లలో పొలాలకు నీరు పెట్టాలంటే అన్నదాతలు హడలిపోతున్నారు. చీకటి కావడంతో పాములు, విష కీటకాల బారిన ఎక్కడ పడాల్సి వస్తుందోనని వణికిపోతున్నారు. ఏక ధాటిగా నిద్రమాని 7గంటల పాటు నీరు పెట్టాలంటే అల్లాడిపోతున్నారు. దీనికితోడు మూడు ఫేజ్‌ల కరెంటు రాత్రి వేళలోనే వస్తుండటంతో తాగునీటికి సైతం తిప్పలు ఎదురవుతున్నాయ. బోర్లు, బావుల వద్ద ఖాళీ బిందెలతో కాపలా కాయాల్సి వస్తోంది.

 

రైతులకు అనుగుణంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం..

ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో రైతుల అభ్యర్థన మేరకు పాత పద్ధతిలోనే విద్యుత్ సరఫరా చేస్తున్నాం. మిగిలిన మండలాల్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నాం.                                        

 - హరినాథరావు, సూపరింటెండెంటింగ్ ఇంజినీరు, తిరుపతి సర్కిల్

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top