ఎఫ్‌సీ జారీ ఇక కఠినతరం

ఎఫ్‌సీ జారీ ఇక కఠినతరం - Sakshi


- అన్నీ సవ్యంగా ఉంటేనే ఆన్‌లైన్‌లో అనుమతి

- పాఠశాలలు ప్రారంభించే లోపు ఎఫ్‌సీ చేయించుకోవాలి

తిరుపతి మంగళం/చిత్తూరు(అర్బన్) :
జిల్లాలో కాలం చెల్లిన వాహనాలు..60 ఏళ్లు దాటిన డ్రైవర్లు..డొక్కు వాహనాలకు ఎఫ్‌సీ ఇచ్చే రోజులు పోయాయి. ముఖ్యంగా విద్యాసంస్థలకు చెందిన వాహనాల సామర్థ్య పత్ర విధానాన్ని మరింత కఠినతరం చేస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో ఈనెల 16 నుంచి విద్యాసంస్థలకు చెందిన వాహనాల ఫిట్‌నెస్ సర్టిఫికెట్(ఎఫ్‌సీ) ప్రారంభం అయింది.



విద్యాసంస్థలు తెరిచే లోపు ఎఫ్‌సీ చేయించుకోవాలని, పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డెక్కితే సీజ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లాలో 5 వేలకు పైగా ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి 1676 బస్సులు ఉన్నాయి. అందులో తిరుపతిలో 498, శ్రీకాళహస్తి 80, పుత్తూరు 212, పలమనేరు 170, చిత్తూరు 368, మదనపల్లి 262, పీలేరు 86  బస్సులు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికీ మే 15 వరకు ఎఫ్‌సీ ఉంటుంది. అటు తర్వాత మళ్లీ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఎఫ్‌సీలు చేయించుకుంది కేవలం 83 మాత్రమే.



ఆన్‌లైన్‌లో పొందుపరచాల్సిన పత్రాలివీ..

విద్యాసంస్థల యాజమాన్యాలు నేరుగా వెబ్‌సైట్‌లో తమ సంస్థల్లో ఎన్ని బస్సులు ఉన్నాయి. వాటి నంబర్లు, సీ బుక్, రవాణా శాఖ పన్నులు తదితర వివరాలు నమోదు చేయాలి. పాఠశాల డెరైక్టర్ పేరు, ఫోన్ నంబర్, విద్యాసంస్థ చిరునామా, విద్యాసంస్థ రిజిస్ట్రేషన్ నంబర్ తదితర వివరాలు నమోదు చేయాలి. 60 ఏళ్ల వయసు దాటితే ఆ డ్రైవర్లను అనుమతించరు. బస్సు క్లీనర్ పూర్తి వివరాలు, ఫోన్ నంబర్, వయసు తదితర వివరాలు నమోదు చేయాలి. 18 ఏళ్ల లోపు వయసు కలిగి ఉంటే వారిని అనుమతించరు.



డ్రైవర్, క్లీనర్ ఫొటోలు సంబంధిత బస్సులో ఉంచాలి. బస్సులో ఎన్ని సీట్లు, ఎంతమంది విద్యార్థులు, ఏ మార్గంలో ప్రయాణిస్తారనే వివరాలు నమోదు చేయాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు అయిన తరువాత సంబంధిత బస్సు డ్రైవర్ ఫొటోతో పాటు నమోదు చేసిన వివరాలన్నింటితో కూడిన పత్రం వస్తుంది. దానిని తీసుకుని ఆర్టీఏ కార్యాలయానికి వెళితే అక్కడ ఎంవీఐ వాహన నంబర్, సామర్థ్యం పరిశీలించి, చలానా కట్టించి ఎఫ్‌సీ మంజూరు చేస్తారు.



నిబంధనలివీ...

పాఠశాల బస్సుకు పసుపు రంగు వేసి విద్యాసంస్థ పేరు, చిరునామా కనిపించే విధంగా చూడాలని, పిల్లల బొమ్మలు, రేడియం స్టిక్కర్లు, చేతులు బయట రాకుండా పక్కన రాడ్లు, లోపల భాగంలో సీట్ల అమరిక, అగ్నిమాపక సిలిండర్, ఆరోగ్య కిట్, అత్యవసర ద్వారం, పిల్లలు నేల మీద నుంచి పైకి ఎక్కేటప్పుడు 325 మిల్లీమీటర్ల కన్నా ఎత్తు ఉండకూడదు. బస్సు కిందకు దిగేటప్పుడు జారి పడకుండా అల్యూమినియం గేటు, మెట్లపైకి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా రాడ్లు, బ్రేక్, స్టీరింగ్, ఇంజన్ సామర్థ్యం, టైర్ల పరిస్థితి చూసి ఎఫ్‌సీ మంజూరు చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top