ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్


చిలకలపూడి (మచిలీపట్నం) :  అన్నం పెట్టే రైతులను పాలకులు విస్మరిస్తే పతనం తప్పదని, చేసిన వాగ్ధానాలను వెంటనే అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర నాయకులు సూర్యదేవర నాగేశ్వరరావు సూచించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం రైతు సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష  చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు అన్ని రకాల రైతు రుణాలను మాఫీ చేస్తామని వాగ్ధానం చేసి అధికారంలోకి వచ్చిన తరువాత రుణాల రద్దుకు షరతులు విధిస్తున్నారన్నారు.

 

ఎటువంటి షరతులు లేకుండా రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా రుణాలను వెంటనే రద్దు చేయాలని, వారికి కొత్త రుణాలను మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.   సీపీఐ జిల్లా కార్యదర్శి చలసాని వెంకటరామారావు మాట్లాడుతూ దేశంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆంధ్ర రాష్ట్రంలో రైతులు నేటికీ ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు.  జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కె.నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు మోదుగుమూడి రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గొరిపర్తి రామారావు, వక్కలగడ్డ పీఏసీఎస్ అధ్యక్షుడు అనుమానుల సురేంద్రనాధ్‌బెనర్జీ, జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మల్నాడి యలమందారావు, దేవభక్తుని నిర్మల, గుర్రం వెంకటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు....

సర్వశిక్షా అభియాన్ ద్వారా జిల్లాలో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. పాఠశాల విద్యాకమిటీ ప్రధానోపాధ్యాయుల ద్వారా ఎంపికై ఆర్ట్, ఫిజికల్, వర్క్ ఎడ్యుకేషన్‌లో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఇంత వరకు నియామక పత్రాలు ఇవ్వలేదని, వేతనాలు చెల్లించడం లేదని చెప్పారు.  కలెక్టర్ రఘునందన్‌రావుకు వినతిపత్రం అందజేశారు.  ఎండీ సయ్యద్‌బాజీ, సి.అశోక్, ఎ.శేషుబాబు, జి. సుభాష్‌చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు.

 

వీడియో గ్రాఫర్లు...

సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా ఎన్నికల ప్రక్రియను చిత్రీకరించేందుకు వీడియోగ్రాఫర్లుగా పనిచేసిన తమకు అన్యాయం జరుగుతోందని సోమవారం కలెక్టరేట్ వద్ద  వారు ధర్నా నిర్వహించారు. వీడియో చిత్రీకరణ కోసం ఎన్నికల్లో రోజుకు రూ. 1500 చెల్లిస్తామని చెప్పిన అధికారులు రూ. 1100 మాత్రమే చెల్లించారన్నారు.  వీడియోగ్రాఫర్లు ఎ.సాయి,      ఎం.పవన్, ఎస్‌కె.గౌస్, సీహెచ్.రవి తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top