పోలీసుల భక్తి

పోలీసుల భక్తి - Sakshi


కర్నూలు : పోలీసులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్ చైర్మన్ రాంపుల్లయ్య యాదవ్‌ను అవిశ్వాస తీర్మా నం ద్వారా తప్పించేందుకు టీడీపీ నేతలు అధికార దర్పాన్ని వినియోగించారు. అందు కు తగిన బలం లేకపోవడం.. తీర్మానం వాయిదా పడటంతో పోలీసులను రంగంలోకి దింపడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. శుక్రవారం రాత్రి గంట పాటు రాంపుల్లయ్య ఇంట్లో సోదాలు నిర్వహించారు.



జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం యూనియన్‌లో 12 మంది డెరైక్టర్లు ఉండగా.. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన రాంపుల్లయ్య యాదవ్‌ను చైర్మన్ పోలీసుల భక్తి పదవి నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు కుట్ర పన్నారు. ఇందులో భాగంగా 8 మంది డెరైక్టర్లను మభ్యపెట్టి అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేయించారు. అయితే తమను తప్పుదోవ పట్టించారని ఇరువురు డెరైక్టర్లు తమ్మన్న, పెద్దారెడ్డిలు అవిశ్వాసానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.



షాక్ తిన్న టీడీపీ నేతలు రాంపుల్లయ్య యాదవ్‌ను భయభ్రాంతులకు గురిచేసేందుకు పోలీసులను ఉసిగొలిపారు. సీఐలు ప్రవీణ్‌కుమార్, నాగరాజరావు నేతృత్వంలో నగరంలోని కొత్తపేటలో నివాసం ఉంటున్న రాంపుల్లయ్య ఇంట్లో గంట పాటు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో లక్కీటూ బ్రదర్స్ రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్ ఇంట్లో లేరు.



తమ కుటుంబం రాజకీయంగా ఓ హోదాలో ఉందని.. సమాచారం లేకుండా ఎలా సోదాలు నిర్వహిస్తారంటూ మహిళలు నిలదీసినా పోలీసులు లెక్కచేయక ఇంట్లోకి ప్రవేశించి ‘దేశం’ భక్తిని చాటుకున్నారు. రాత్రి వేళ పెద్ద ఎత్తున పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఏమి జరిగిందోనని కాలనీ ప్రజలు భారీగా గుమికూడారు. ప్రతిపక్ష పార్టీ నేతలను లొంగదీసుకునేందుకు టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని పాత కేసులను తిరగదోడే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి ముక్కున వేలేసుకున్నారు.



మూడో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలో భూవివాదం కేసు పెండింగ్‌లో ఉందంటూ పోలీసులు మహిళలతో వాదనకు దిగారు. కేసులు ఏవైనా ఉంటే స్టేషన్‌కు పిలిపించుకొని మాట్లాడాలే కానీ.. ఇలా మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో ఎలా వస్తారంటూ రాంపుల్లయ్య కుటుంబ సభ్యులు నిలదీశారు. చేసేది లేక వారితో ఓ విజ్ఞాపన పత్రం రాయించుకుని పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top