మేమైతే బతికాం గానీ..

Devipatnam Boat accident escaped people Frame of mind - Sakshi

మా వాళ్ల ఆచూకీ తెలియలేదు..

అసలు బతికున్నారో లేదో.. 

ప్రాణాలతో రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం..

బోటు ప్రమాదం నుంచి బయటపడ్డవారి మనోగతం

సాక్షి, కాకినాడ: పాపికొండల యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. గోదావరి అందాలను ఆనందంగా తిలకిస్తున్నాం. అంతలో ఏమైందో తెలీదు.. ఒక్కసారిగా పడవ కుదుపునకు గురైంది. బోటు పైభాగంలో ఉన్న 70 మంది ఒక్కసారిగా మాపై పడ్డారు. ఆ బరువుకు బోటు ఓ వైపునకు ఒరిగింది. ఇక బతకడం కష్టమనుకున్నాం. దేవుడా.. నువ్వే దిక్కని కళ్లు మూసుకున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదుగానీ.. కచ్చులూరు గ్రామస్తులు దేవుడిరూపంలో వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు.. మా ప్రాణాలు నిలిపారు.. అంటూ బోటు ప్రమాద బాధితులు ఉద్వేగంతో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఆదివారం లాంచీ ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు బాధితులు.. ప్రమాదం జరిగిన క్షణాలను తలచుకుని వణికిపోతున్నారు. 

శవాసనమే.. శ్వాస నిలిపింది.. 
పైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఉక్కపోతగా ఉందని పలువురు లైఫ్‌ జాకెట్లు తీసేశారు. భోజన ఏర్పాట్లు కూడా జరుగుతుండటంతో లైఫ్‌ జాకెట్లను వేసుకోలేదు. మరికొద్దిసేపట్లో పాపికొండలొస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ‘ఇది డేంజర్‌ జోన్‌.. బోటు అటూఇటూ ఊగుతుంది.. భయపడొద్దు’ అని చెప్పారు. అలా చెబుతుండగానే బోటు ఊగడం మొదలైంది.. పైన ప్లాస్టిక్‌ కుర్చీలన్నీ కుడివైపునకు జరిగాయి.. ఆ బరువుకు బోటు కుడివైపునకు ఒరిగిపోయింది.. ముందు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. వెంటనే తేరుకుని నేను నేర్చుకున్న ‘శవాసనం’ వేశాను. కాసేపు అలాగే ఉండి ఈదుకుంటా వస్తున్నా. అంతలో ఒడ్డున ఉన్న గ్రామస్తులు తలోచెయ్యివేసి కాపాడారు. మా కుటుంబ సభ్యులం ఐదుగురం వస్తే.. నేనొక్కడినే మిగిలా.. నా భార్య, బావ, బావ భార్య, బావ కుమారుడు ఎక్కడున్నారో.. ఏమయ్యారో తెలియదు.. 
 – జానకిరామయ్య, ఉప్పల్, హైదరాబాద్‌ 

14 మందిలో ఐదుగురం మిగిలాం..
గోదావరి ఒడిలో కాసేపు సేదదీరుదామని చిన్నాన్న, పెదనాన్న కుటుంబ సభ్యులం కలిసి 14 మంది వచ్చాం. ఒక్కసారిగా బోటు నీళ్లలోకి వెళ్లిపోయింది. అంతే గుండె ఆగినంత పనైంది. దేవుడిపై భారం వేశా. అంతలో గ్రామస్తులొచ్చి గట్టుకు చేర్చారు. చివరికి మేం ఐదుగురిమే మిగిలాం. మా వాళ్లు ఏమయ్యారో.. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో.. 
– బసికె దశరథం, కడిపికొండ, వరంగల్‌ జిల్లా  

ఆ తొమ్మిది మంది ఏమయ్యారో.. 
గోదావరి అందాలు తిలకిద్దామని మా అన్నదమ్ముల కుటుంబాలు 14 మంది నెల ముందే ప్లాన్‌ చేసుకున్నాం. ఎంతో ఆనందంగా లాంచీ ఎక్కాం. అప్పటి వరకు విహారయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. అంతలోనే సుడిలో బోటు కూరుకుపోతూ వచ్చింది. ఎలాగైనా గండం నుంచి గట్టెక్కించు దేవుడా అని ప్రార్థించాం. లైఫ్‌ జాకెట్లు ఉన్నవాళ్లు కొందరు ఈదుకుంటూ వెళ్లిపోయారు. మొత్తం ఐదుగురిమే బయటపడ్డాం. మిగతా తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు..
 – గొర్రె ప్రభాకర్, కడిపికొండ, వరంగల్‌ జిల్లా  

ఆ రోజే యాత్రను రద్దు చేసుకోనుంటే.. వాళ్లు బతికేవాళ్లే.. 
అన్నదమ్ముల కుటుంబ సభ్యులం గత నెలలో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకున్నాం. కానీ వరద ప్రభావం ఎక్కువగా ఉందని టీవీ, పేపర్లలో చూసి ప్రయాణాన్ని రద్దు చేసుకుందామని బోటు తాలూకు ఆన్‌లైన్‌లో నంబర్‌కు ఫోన్‌ చేశాం. ఏం కాదులే వచ్చేయండని వారు చెప్పడంతో వచ్చి లాంచీ ఎక్కాం. 14 మంది వస్తే.. చివరికి ఐదుగురం మిగిలాం. మిగిలిన వారు ఏమయ్యారో తెలీడం లేదు. ఆ రోజు యాత్ర రద్దు చేసుకున్నా బాగుండేది.. 
– సురేష్, కడిపికొండ, వరంగల్‌ జిల్లా  

నలుగురిలో ఇద్దరం మిగిలాం..
సరదాగా గడుపుదామని నలుగురు స్నేహితులం వచ్చాం. మేం ప్రాణ స్నేహితులం.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించనే లేదు. చివరికి ఇద్దరం మిగిలాం. మా స్నేహితులు భరణికుమార్, విశాల్‌ ఆచూకీ తెలియలేదు.. వారు బతికి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం..
– అర్జున్‌ కోదండ, హైదరాబాద్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top