గుంటూరుకు రాజయోగం

గుంటూరుకు రాజయోగం - Sakshi


హైదరాబాద్ తరహాలో ఫ్లైవోవర్లపై ప్లాంటర్స్ ఏర్పాటు

నగరంలోని 14 ఫౌంటెన్లకు అదనపు హంగులు

డివైడర్లపై పచ్చదనం  పెంచేందుకు చర్యలు

ప్రతిపాదనలు సిద్ధంచేసిన  జీఎంసీ


 

నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిగా తుళ్లూరు ప్రాంతాన్ని నిర్ణయించడంతో జిల్లా కేంద్రమైన గుంటూరుకు రాజయోగం పట్టనుంది. హైదరాబాద్ తరహాలో ఈ నగరాన్ని సుందరీకరించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇందు కోసం నగర పాలక సంస్థ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధంచేసింది.

 

గుంటూరు : తుళ్లూరును రాష్ట్ర రాజధానిగా నిర్ణయించడంతో గుంటూరుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా గ్రేటర్ గుంటూరు ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. అదే సమయంలో హైదరాబాద్ తరహాలోనే ఈ నగరాన్నీ సుందరీకరించాలని ఆదేశాలు జారీచేసింది. దీంతో నగరానికి నూతన హంగులు తీసుకొచ్చేందుకు జీఎంసీ చర్యలు వేగవంతం చేసింది. ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సిహెచ్.శ్రీధర్ నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ అధికారులు, పట్టణ ప్రణాళికాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాలని సూచించారు. దీంతో సూపరింటెండెంట్ ఇంజినీర్ డి.మరియన్న, ఇతర అధికారులు ఈ దిశగా ప్రణాళికలను సిద్ధం చేశారు.



తొలుత విజయవాడ నుంచి గుంటూరుకు చేరుకునే మార్గంలో ముఖ ద్వారంగా ఉన్న ఆటోనగర్ ప్రాంతం నుంచి సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. అక్కడ డివైడర్లకు రంగులు వేయడంతో పాటు రోడ్డుకు ఇరువైపులా ఆకర్షనీయమైన పూల మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని నిర్ణయించారు. రోడ్డుపై క్యాట్‌ఐస్ స్టిక్కర్లను ఏర్పాటు చేయడం ద్వారా రాత్రి సమయాల్లో ఆ ప్రాంతంలో వెలుగులు నిండేలా చర్యలు తీసుకుంటున్నారు.



నగరంలోని మణిపురం, కంకరగుంట, అరండల్‌పేట ఫ్లైఓవర్లపై హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు తరహాలో ప్లాంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రధానంగా ఫ్లైఓవర్లకు రెండువైపులా పెద్దపెద్ద ఆకర్షణీయమైన కుండీలను ఏర్పాటు చేసి వాటిల్లో మొక్కలను పెంచనున్నారు. ఓవర్‌బ్రిడ్జి సెంట్రల్ డి వైడర్లకు రంగులు వేయడం ప్లాస్టిక్ పూలతో సుందరీకరించాలని నిర్ణయించారు. ఇందు కోసం రాజస్థాన్ నుంచి వచ్చిన కొంత మంది కళాకారులతో కుండీల నిర్మాణం, డిజైన్లను రూపొందిస్తున్నారు.



నగరంలోని 14 ఫౌంటెన్లను అభివృద్ధి చే యనున్నారు. వివిధ రంగుల విద్యుత్ వెలుగులతో ఫౌంటెన్లును తీర్చిదిద్దనున్నారు. లాడ్జిసెంటర్, నాజ్‌సెంటర్, జిన్నాటవర్ సెంటర్, ఆర్టీసీ బస్‌స్టాండ్, రింగ్ రోడ్డు తదితర ప్రాంతాల్లోని ఫౌంటెన్లకు మహర్దశ పట్టనుంది.  నగరంలోని 11 ప్రధాన కూడళ్లను అభివృద్ధి చేయడంతో పాటు అక్కడ సైతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగర పాలకసంస్థ పరిధిలోని పార్కుల్లో మౌలిక వసతులు కల్పిస్తారు.

 

ఎనిమిది వారాల్లో నగర రూపురేఖలు మారతాయి



 గుంటూరు నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ సిహెచ్.శ్రీధర్ ఆదేశాలతో సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధంచేశాం. ఎనిమిది వారాల్లో నగర రూపురేఖలను మారుస్తాం. సెంట్రల్ డివైడర్లు, ఫౌంటెన్లు, కూడళ్లును అభివృద్ధి చేస్తాం. నగరంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తాం. రాజస్థాన్ కళాకారులతో కొన్ని ప్లాంటర్స్ డిజైన్ చేయిస్తున్నాం.

 - డి.మరియన్న, సూపరింటెండెంట్ ఇంజినీరు

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top