అమానుషం


ఏలూరు (వన్ టౌన్) : సభ్యసమాజం తలదించుకునేలా ఏలూరు నగరంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. చట్టాన్ని పరిరక్షించాల్సిన ఓ కానిస్టేబుల్ 6 నెలల గర్భిణిపై మంగళవారం రాత్రి అమానవీయంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే ఎదురు కేసు పెడతానని బెదిరించాడు. బాధితురాలిపై కరుణ చూపడం మాట దేవుడెరుగు.. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాల్సిన మిగిలిన పోలీ సులు సైతం నిందితుడైన కానిస్టేబుల్‌ను కాపాడేందుకు ప్రయత్నించారు. విషయం మీడియా దృష్టికి రావడంతో బుధవారం సాయంత్రం ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు.



కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి, అతడిపై సస్పెన్షన్ వేటు వేశారు. సంచలనం కలి గించిన ఈ కేసుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పత్తేబాద ప్రాంతంలో ఓ మహిళ వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి ఆ ఇంట్లో వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహిం చారు. వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలిని, మరో మహిళను, ఓ విటుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. తనిఖీల సమయంలో వ్యభిచార కేంద్రం నిర్వాహకురాలికి వరుసకు కూతురైన 6 నెలల గర్భిణి ఆ ఇంట్లోనే వేరే గదిలో ఉంది.



సోదాలకు వెళ్లిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం కానిస్టేబుల్ గరికిముక్కుల రవి తన కోరిక తీర్చాలని గర్భిణిని కోరాడు. ఇందుకు ఆమె ససేమిరా అంది. తాను గర్భిణిననే విషయం చెప్పింది. అయినప్పటికీ సదరు కానిస్టేబుల్ ఆమెపై రెండు గంటలపాటు లైంగిక దాడి జరిపాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు ప్రమాదం జరుగుతుందని, కాళ్లు పట్టుకుంటానని, తనను వదిలేయాలని ఆ గర్భిణి వేడుకున్నా కసాయి కానిస్టేబుల్ కరుణించలేదు. ఆ తరువాత తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు చెప్పుకునేందుకు టూటౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన గర్భిణిని బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకోకుండా టూటౌన్ పోలీసులు నిందితుడైన కానిస్టేబుల్‌ను కాపాడే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులను సైతం పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారు.



మీడియా ద్వారా విషయం బయటకు పొక్కడంతో డీఎస్పీ కేజీవీ సరిత రంగంలోకి దిగి సాయంత్రం 5 గంటల సమయంలో కేసు నమోదు చేయించారు. అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ బాధితురాలి నుంచి వాంగ్మూ లం నమోదు చేశామని చెప్పారు. నేరం చేసిన వ్యక్తితోపాటు దానిని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినవారు కూడా నేరస్తులు అవుతారని పేర్కొన్నారు. పోలీ సులు ఆ కానిస్టేబుల్‌ను కాపాడే ప్రయత్నం చేశారని రుజువైతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు నిర్వహించాల్సిందిగా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి ఆదేశించారని, ఆయన ఆదేశాల మేరకు దర్యాప్తు ముమ్మరం చేశామని చెప్పారు.

 

కానిస్టేబుల్ సస్పెన్షన్

గర్భిణిపై లైంగిక దాడికి పాల్పడిన కానిస్టేబుల్ గరికిముక్కుల రవిపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. తదుపరి విచారణ నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిందిగా ఆదేశించామన్నారు.  పోలీసులు కానిస్టేబుల్‌ను కాపాడాలని చూశారన్న ఆరోపణలు నిజమైతే వారిపైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలావుం డగా బుధవారం రాత్రి 10 గంటల సమ యంలో కానిస్టేబుల్ లొంగిపోయాడు. సీఐ యు. బంగారురాజు అతడిని అరెస్ట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top