కోట్ల కట్టల‘పాము’

కోట్ల కట్టల‘పాము’ - Sakshi

రూ.500 కోట్లు.. ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ అక్రమ సంపాదన 


 


సాక్షి, అమరావతి/విశాఖపట్నం/తాడేపల్లి: రాష్ట్ర ప్రజారోగ్య శాఖలో ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌(ఈఎన్‌సీ)గా పనిచేస్తున్న ఉన్నతాధికారికి అక్రమ సంపాదన అనే అనారోగ్యం పట్టుకుంది. ఏకంగా రూ.500 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడు. పలు నగరాలు, పట్టణాల్లో భారీ భవనాలు, ఇళ్ల స్థలాలు,  వాహనాలు, విలువైన గృహోపకరణాలు, బంగారం, వెండి ఆభరణాలు, వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు, బ్యాంకు ఖాతాల్లో నగదు.. ఇలా అన్ని రూపాల్లో దాచిపెట్టాడు. తన మిత్రుడితో కలిసి విశాఖపట్నంలో రూ.100 కోట్ల విలువైన కార్పొరేట్‌ ఆసుపత్రి నిర్మిస్తున్నాడంటే అతడి అక్రమార్జన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరకు పాపం పండి అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలలో చిక్కాడు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద అవినీతి కేసు అని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అతడి మిత్రుడిని కూడా అధికారులు అరెస్టు చేశారు. 

 


ఎక్కడ చూసినా ఆస్తులే ఆస్తులు  


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ ఈఎన్‌సీ డాక్టర్‌ పాము పాండురంగారావు, అతడి వ్యాపార భాగస్వామి, విశాఖపట్నం ఆంధ్రా వైద్య కళాశాల ప్రొఫెసర్, కేజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నల్లి బాబూ విజయ్‌కుమార్‌ ఇళ్లు, వారి బంధువులు, స్నేహితుల నివాసాలపై శుక్రవారం ఏసీబీ  దాడులు చేపట్టింది. గుంటూరు జిల్లా తాడేపల్లి, విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలతోపాటు హైద రాబాద్‌లో పాండురం గారావు నివాసాలు, ఆస్తులపై దాడులు చేశారు.  విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌ నగరాల్లో నివాస స్థలాలు, హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన ఎకరం ఖాళీ స్థలం ఉన్నట్లు గుర్తించారు. ఇద్దరు కుమారులు, భార్య పేర్లపై ఉన్న పలు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో పాండురంగారావుకు రూ.500 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పాండురం గారావు నివాసంలో దాదాపుగా 100 ఆస్తి పత్రాలతోపాటు కీలకమైన సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. మొత్తం 42 నివాస ప్లాట్ల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోగా, అందులో 22 ప్లాట్లు విశాఖపట్నంలోని ఖరీదైన ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. తాడేపల్లిలో పాండురంగారావును ఏసీబీ అధికారులు విచారించారు. 

 


కుమారులకు కంపెనీలో వాటాలు 


విశాఖపట్నంలో పాండురంగారావు, ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన మిత్రుడు ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్, బావమరిది, జీసీసీ రిటైర్డ్‌ జనరల్‌ మేనేజర్‌ పి.కృష్ణారావు, సమీప బంధువు, జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాజేంద్రకుమార్‌ల ఇళ్లల్లోనూ సోదాలు చేశారు. ఏకకాలంలో ఎనిమిది చోట్ల దాడులు జరిగాయి. మాధవధారలోని విజయ్‌కుమార్‌ నివాసం, కేజీహెచ్‌లోని కార్యాలయం, కలెక్టరేట్‌ డౌన్‌లోని క్లినిక్, వుడా పార్కు వద్ద ఉంటున్న ఆయన కుమార్తె ఇళ్లలోనూ సోదాలు చేపట్టారు. పాండురంగారావు బావమరిది ఉంటున్న కొమ్మాదిలోని రెండంతస్తుల భవనంలో కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. పాండురంగారావు కుమారుల కు ఆరిలోవలోని సెల్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వాటాలు ఉన్నట్లు కనుగొన్నారు. పాండురంగారావు పేరుతో నాలుగు ప్రాంతాల్లో 6.50 ఎకరాల భూములు, మూడు చోట్ల ఇళ్లు, ఏడు ప్రాంతాల్లో స్థలాలు ఉన్నాయి. ఆయన భార్య పేరుతో 35 ప్రాంతాల్లో స్థలాలు(ఫ్లాట్స్‌) ఉన్నాయి. ఆయన కుమారుల పేరుతో ప్రైవేట్‌ సంస్థల్లో రూ.66 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. 

 


విజయ్‌కుమార్‌కు రూ.3.58 కోట్ల ఆస్తులు 


పాండురంగారావు వ్యాపార భాగస్వామి, ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌ ఆస్తులపై కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. విశాఖపట్నం, నర్సాపురంలో జరిగిన సోదాల్లో రూ.3.58 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు గుర్తించారు.  


 


కేసులు నమోదు: ఏసీబీ డీజీ 


తిరుపతి క్రైం: రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయానికి మించి ఆస్తులు కూడపెట్టిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, వారి ఆస్తులపై దాడులు చేశామని ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. ఆయన శుక్రవారం తిరుపతి ఏసీబీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. విజయవాడలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగంలో ఇంజనీర్‌ అండ్‌ చీఫ్‌గా పనిచేస్తున్న పాము పాండరంగారావు(58), అతడి కుటుంబ సభ్యుల పేరిట రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పాండురంగారావుకు 7 ప్లాట్లు, 3 ఇళ్లు, అతని భార్య  రాజ్యలక్ష్మి కి 35 ప్లాట్లు, 21 వ్యవసాయ భూములు, 2 ఇళ్లు, వారి కుమారుడు  సునీల్‌ పేరిట 3 కంపెనీలు, 2 ఫార్మా సంస్థలు, నగదు, బ్యాంక్‌ బ్యాలెన్స్, వెండి, బంగారు నగలు, వాహనాలను  గుర్తించామన్నారు. పాండురంగారావును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. ఆంధ్రా మెడికల్‌ కళాశాల ప్రొఫెసర్‌  నల్లి బాబూ విజయ్‌కుమార్‌ ను అరెస్ట్‌ చేసి, విశాఖ ఏసీబీ కోర్టుకు తరలించామన్నారు. 


 


గతంలోనూ ఫిర్యాదులు 


కృష్ణా జిల్లా కలిదిండి మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన పాము పాండురంగారావు 1987లో డీఈఈగా ప్రభుత్వ సర్వీసులో చేరారు. అసిస్టెంట్‌ ఇంజనీర్‌ నుంచి చీఫ్‌ ఇంజనీర్‌ వరకు పదోన్నతులు పొందుతూ గ్రేటర్‌ విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ)లోనే కొనసాగారు. ఇక్కడే అంతులేని సంపాదనకు శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌తో మిత్రబం ధం ఏర్పరచుకున్నారు. వీరిద్దరూ కలిసి విశాఖపట్నం ఆరిలోవ హెల్త్‌సిటీలో రూ.100 కోట్లతో మల్టీపర్పస్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తున్నట్లు తెలిసింది. పాండురంగారావుపై ఏసీబీకి గతంలోనూ ఫిర్యాదులు అందాయి.  


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top