‘ఉమ్మడి’ ముడి వీడదా?

‘ఉమ్మడి’ ముడి వీడదా?


ఏళ్లుగా పరిష్కారం కాని టీచర్ల ఉమ్మడి రూల్సు సమస్య

నిలిచిన పదోన్నతులు, పోస్టుల భర్తీ

55 డివిజన్లకు ఇన్‌చార్జి డీవైఈవోలే..

555 మండలాల విద్యాధికారులు ఇన్‌చార్జీలే..

చొరవ చూపని ప్రభుత్వం




సాక్షి, విజయవాడ బ్యూరో: ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారం అనేక సంవత్సరాలుగా పాఠశాల విద్యాశాఖను కుంగదీస్తోంది. దీనికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉండడంతో ఈ విషయం గురించి ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ఫలితంగా పదోన్నతులు నిలిచిపోయి కీలకమైన డీవైఈవో, ఎంఈవో పోస్టులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. గతంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ టీచర్ల సర్వీసు నిబంధనలు వేర్వేరుగా ఉండేవి. 1998లో రెండు యాజమాన్యాల్లో పనిచేస్తున్న టీచర్లకు ఒకే సీనియారిటీ జాబితా తయారుచేసి ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమల్లోకి తెచ్చారు.



ఈ నిబంధనల ప్రకారమే ఇద్దరికీ కలిపి పదోన్నతులు ఇచ్చారు. 2005లో దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పంచాయతీరాజ్ టీచర్లు సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు పదోన్నతులపై స్టే ఇచ్చింది. కేసు అక్కడే పెండింగ్‌లో ఉంది. ఈ సమస్య పరిష్కారమైతేగానీ పదోన్నతులు ఇచ్చే అవకాశం ఉండదు. మధ్యలో 2009లో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అనుమతితో తాత్కాలిక పద్ధతిలో టీచర్లకు మాత్రం పదోన్నతులు ఇచ్చింది. ప్రధానోపాధ్యాయులకు పదోన్నతులు లేకపోవడంతో డీవైఈవో, ఎంఈవో పోస్టులు పెద్దసంఖ్యలో ఖాళీగా ఉంటున్నాయి. ఆ తర్వాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు.



ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను రాష్ట్రం విడిపోయిన తర్వాత సులువుగా పరిష్కరించే అవకాశం ఉందని విద్యావేత్తలు చెబుతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రభుత్వ టీచర్లు చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో రెండు యాజమాన్యాల్లోని ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడి కోర్టులో ఉన్న ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు విద్యాశాఖ ఉన్నతాధికారులకు సూచిం చారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడంలేదు. కేసు కోర్టులో ఉంది కాబట్టి తాము ఏమీ చేయలేమని పాఠశాల విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.



10 డివిజన్లు, 107 మండలాలకే పూర్తి స్థాయి విద్యాధికారులు

ఈ సమస్య పరిష్కారమవని కారణంగా అనేక సంవత్సరాల నుంచి డివిజన్, మండల స్థాయిలో విద్యాశాఖాధికారుల పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా స్థాయిలో డీఈవో, డివిజన్ స్థాయిలో డీవైఈవో, మండల స్థాయిలో ఎంఈవో పాఠశాలలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో డీఈవోల నియామకం వరకు చేస్తున్నా ఆ తరువాత స్థాయి నియామకాలు ఏళ్ల తరబడి నిలిచిపోయాయి.



రాష్ట్రంలో డివిజన్ల స్థాయిలో 65 మంది డీవైఈవోలు పనిచేయాల్సి ఉండగా పదిమంది మాత్రమే రెగ్యులర్ డీవైఈవోలు పనిచేస్తున్నారు. మిగిలిన 55 డివిజన్లలో సీనియర్ ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జి డీవైఈవోలుగా వ్యవహరిస్తున్నారు. 662 మండలాలుంటే 107 మండలాలకు మాత్రమే పూర్తిస్థాయి విద్యాశాఖాధికారులున్నారు. 555 మండలాల్లో ప్రధానోపాధ్యాయులే ఇన్‌చార్జి ఎంఈవోలుగా వ్యవహరిస్తున్నారు.



వీరు అటు స్కూల్లో సరిగా పనిచేయలేక, ఇటు మండల స్థాయిలో అన్ని పాఠశాలల్నీ పర్యవేక్షించలేక సతమతమవుతున్నారు. ప్రధానోపాధ్యాయుల పోస్టులు కూడా పెద్దసంఖ్యలో ఖాళీగా ఉండటంతో రెండు, మూడు పాఠశాలల బాధ్యతలు ఒకరికే అప్పగిస్తున్నారు. దీంతో ఏ స్కూలుకూ న్యాయం జరగడంలేదు. ఉమ్మడి సర్వీసు నిబంధనల వ్యవహారంపై ప్రభుత్వం దృష్టిపెడితేగానీ ఈ పోస్టుల్ని పూర్తిస్థాయిలో భర్తీచేసే అవకాశం కనిపించడంలేదు.



ఉమ్మడి రూల్స్‌తోనే న్యాయం

మొత్తం ఉపాధ్యాయుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆరుశాతం మందే ఉన్నారు. 94 శాతం మంది పంచాయతీరాజ్, మున్సిపల్ ఉపాధ్యాయులున్నారు. మెజారిటీగా ఉన్న ఉపాధ్యాయులకు న్యాయం జరగాలంటే ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయాలి. కేసు కోర్టులో ఉన్నా ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే సమస్య పరిష్కారమవుతుంది. ఈ అంశం రాష్ట్ర స్థాయిలో కూడా లేదు. ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేంద్ర హోంమంత్రిత్వ శాఖతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది.

- సి.వి.ఎస్.మణి, పీఆర్‌టీయూ రాష్ట్ర నేత



సుప్రీం మేరకు పదోన్నతులు

ప్రభుత్వం పంచాయతీరాజ్ టీచర్ల సంఘాలకు అనుకూలంగా వ్యవహరిస్తోంది. వ్యవహారం కోర్టులో ఉందనే సాకు చూపుతూ సమస్యను పరిష్కరించడానికి ముందుకురావడంలేదు. సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ప్రభుత్వ ఉపాధ్యాయులతోనే డీవైఈవో, ఎంఈవో పోస్టులను భర్తీచేయాలి.

- ఎం.సూర్యనారాయణమూర్తి, ఏపీ ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం గౌరవాధ్యక్షుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top