చిన్నారి గీతిక.. విషాద వీచిక

చిన్నారి గీతిక.. విషాద వీచిక


 లేతప్రాయం.. స్కూలు, ఇల్లు తప్ప ఇంకో లోకం తెలియని అమాయకత్వం. చెంగు చెంగున లేడిపిల్లలా గెంతుతూ.. ఈ లోకమంతా తనదే అన్నట్లు ఆటపాటలతో తల్లిదండ్రులకు మురిపాలు పంచింది ఆ బాలిక..

 ఇది నాలుగు నెలల క్రితంనాటి ముచ్చట.

 మరి ఇప్పుడు..

 ఆ ఇల్లే ఒక శోకనిలయంగా మారింది.

  నాటి కేరింతలు, తుళ్లింతలు లేవు.

 ఆటపాటలతో ఇల్లంతా సందడి చేయాల్సిన వారి పుత్రిక జీవచ్ఛవంలా మారి..

 మంచానికి పరిమితమైంది.

 చిన్నపాటి జ్వరం కొద్దిరోజుల వ్యవధిలోనే పెను ఉపద్రవంగా మారి. ఆ పేద కుటుంబంలో  కల్లోలం రేపింది. విధితోపాటు వైద్యనారాయణులు తమ ముద్దుల

 పాప గీతిక తలరాతను మార్చేశారని

 ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు.

 డబ్బు నీళ్లలా ఖర్చయినా జబ్బు నయంకాకపోగా మరింత విషమించి పాప జీవితాన్ని డోలాయమానంలో పడేసింది.

 

 రాజాం రూరల్: కులవృత్తిపైనే ఆధారపడిన పేదవర్గానికి చెందినవారు సుగంధం సతీష్, కల్యాణి దంపతులు. రాజాం మధవబజార్ వీధిలో నివసిస్తున్న వీరికి ఒక్కగానొక్క కుమార్తె గీతిక. స్థానిక కాన్వెంట్‌లో 4వ తరగతి చదువుతోంది. పేద కుటుంబమైనా ఉన్నంతలో సాఫీగా సాగిపోతున్న ఆ కుటుంబంలో విధి విషం చిమ్మింది. సుమారు నాలుగు నెలల క్రితం చిన్నారి గీతికకు జ్వరం చేసింది. తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడికి చూపించారు. రెండురోజులు మందులు వాడినా ఫలితం కనిపించలేదు. దాంతో రాజాంలోనే స్పెషలిస్ట్ వైద్యుడికి చూపించారు. అతనిచ్చిన మందులు మరో రెండుమూడు రోజులు వాడారు. జ్వరం తగ్గకపోగా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నట్లు గుర్తించిన వైద్యుడి సూచన మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీన విశాఖలోని కళా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ జరిపిన పరీక్షల్లో గీతిక డెంగ్యూ బారిన పడినట్లు నిర్థారించారు. అయితే అక్కడ చిన్నపిల్లల వైద్య నిపుణులు లేకపోవడంతో విశాఖలోని మరో పెద్ద ఆస్పత్రికి సెప్టెంబర్ 3వ తేదీ రాత్రి తరలించారు.

 

 వైద్యం వికటించిందా?

 ఆ ఆస్పత్రిలో జరిపిన పరీక్షల్లోనూ డెంగ్యూగా తేలడంతో  ప్లేట్‌లెట్స్ ఎక్కించారు. ఏమైందో తెలియదు గానీ.. ప్లేట్‌లెట్స్ ఎక్కించినప్పటి నుంచి గీతిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. అప్పటివరకు కొద్దిపాటి ఓపికతో మాట్లాడుతూ, మెల్లగా తిరుగాడిన గీతిక శరీరం రంగు ఒక్కసారిగా మారిపోయింది. గొంతు మూగబోయింది. పక్షవాతం సోకినట్లు కాళ్లూచేతులు వంకర్లుపోయి జీవచ్ఛవంలా తయారైంది. కూర్చోలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైంది. దాంతో వైద్యులు ఆమెను ఐసీయూ నుంచి ఎంఐసీలోకి తరలించారు. ఊపిరి పీల్చడం, ఆహారం తీసుకోవడం కూడా సమస్యగా మారడంతో గొంతుకు అడ్డంగా ఒక పరికరం, ముక్కుకు గొట్టం అమర్చారు. ఇలా రకరకాల చికిత్సలతో సెప్టెంబర్ 19వ తేదీ వరకూ సుమారు రూ.10 లక్షలు ఖర్చు పెట్టించారు. చివరికి పాప పరిస్థితి విషమించిందని చేతులెత్తేసి డిశ్చార్జి చేసేశారు.

 

 అయినా ఆశ చావక..

 దీంతో పూర్తిగా కుంగిపోయిన తల్లిదండ్రులు.. చేతిలో డబ్బులన్నీ అయిపోయి దిక్కుతోచని స్థితిలో పాపను తీసుకొని సొంత ఊరికి తిరిగొచ్చారు. పాపను ఎలాగైనా బతికించుకోవాలన్న ఆశతో రాజాంలోని జీఎంఆర్ కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వారిచ్చిన మందులు వాడుతూనే విశాఖ కేజీహెచ్‌ను ఆశ్రయించారు. అక్కడ పాపను పరీక్షించిన వైద్యులు ఆమెకు అమర్చిన పైపులు, పరికరాలు తీయాలంటే శస్త్రచికిత్స చేయాలని, దాన్ని తట్టుకునే శక్తి పాపకు ప్రస్తుతం లేదని చెప్పారు. కొన్నాళ్లు మందులు వాడాలని, ఆరోగ్యం కొంత మెరుగుపడితే ఆపరేషన్ చేసి తొలగిస్తామన్నారు. అప్పటినుంచి పాపను ఇంటిదగ్గరే 24 గంటలూ కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులకు మళ్లీ శస్త్ర చికిత్స చేయించడానికి అవసరమైన ఆర్థిక స్తోమత లేకపోవడం కుంగదీస్తోంది. ఇప్పటికే శక్తికి మంచి అప్పులు చేసి సుమారు రూ.13 లక్షలు ఖర్చు చేశామని.. ఇంక చేతిలో చిల్లిగవ్వ లేని స్థితిలో ఏం చేయాలో పాలుపోవడంలేదని వాపోతున్నారు. కాగా విశాఖ ఓమ్ని ఆస్పత్రిలో చికిత్స వికటించడం వల్లే తమ కుమార్తె పరిస్థితి ఇలా తయారైందని ఆరోపిస్తున్నారు.

 ఇక భగవంతుడు, దాతలే తమపై దయ చూపాలని వారు అంటున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top