దివిసీమను వణికిస్తున్న డెంగీ

దివిసీమను వణికిస్తున్న డెంగీ


చల్లపల్లి : దివిసీమను ప్రజలను డెంగీ జ్వరాలు వణికిస్తున్నాయి. మూడు నెలల క్రితం చల్లపల్లి మండలం కొత్తమాజేరులో బయట పడిన ఈ జ్వరాలు, ఇటీవల మోపిదేవి, నాగాయలంక మండలం గణపేశ్వరానికి విస్తరించాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ డెంగీ కేసులు లేవని చెప్పడంతో ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్న వైద్య, ఆరోగ్యశాఖాధికారులు వీటిని  డెంగీ కేసులుగా గుర్తించడం లేదు.



 వణకుతున్న ప్రజలు

 చల్లపల్లి మండలం కొత్తమాజేరులో మూడు నెలల క్రితం డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ గ్రామంలో సుమారు 50 మందికి డెంగీ జ్వరాలు వ్యాపించాయి. డెంగీ, విషజ్వరాల వల్ల మొత్తం 20 మంది చనిపోయారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ కొత్తమాజేరు పర్యటన, మచిలీపట్నంలో ధర్నాతో  కంగుతిన్న రాష్ట్ర  మంత్రులు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని చెప్పుకొచ్చారు. డెంగీ, విషజ్వరాలు లేనపుడు  రెండు నెలల నుంచి ఈగ్రామంలో వైద్యశిబిరం ఎందుకు నిర్వహిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు, గ్రామస్తుల ప్రశ్నలకు ఎవరిదగ్గరా సమాధానం లేదు. ఇప్పటికీ ఈ గ్రామంలో విషజ్వరాల కేసులు నమోదవుతూనే ఉన్నాయి.



 దాసేస్తున్నారు

 స్వయంగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని దివిసీమలో  డెంగీ జ్వరాలు వల్ల ఎవరూ చనిపోలేదని ప్రకటించడంతో వైద్య, ఆరోగ్యశాఖాధికారులు డెంగీ కేసులను దాసేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వేరే గ్రామాలకు చెందిన కొంతమంది విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు వైద్యశాలల్లో డెంగీ జ్వరాలతో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, మంత్రులు స్పందించి బేషజాలకు పోకుండా డెంగీ  జ్వరాలు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

 విస్తరిస్తున్న డెంగీ

 నాలుగు రోజుల క్రితం మోపిదేవి పంచాయతీ పరిధిలోని వికలాంగుల కాలనీలో నడకుదిటి కృష్ణకుమారి (45) మరణించిన విషయం విదితమే. తాజాగా నాగాయలంక మండలం గణపేశ్వరానికి డెంగీ జ్వరాలు విస్తరించాయి.  గ్రామంలో సర్పంచ్ దాసి జీవరత్నం, మరో విద్యార్థిని దాసి మంజూషతోపాటు కూతాటి రంగారావు, చాట్రగడ్డ దానియేల్‌కు డెంగీ జ్వరాలు ఉన్నట్టు వైద్యపరీక్షలో తేలింది. దీంతో గ్రామస్తులు మరింత భయాందోళనలకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది దివిసీమలో డెంగీ జ్వరాలు విస్తరిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తి పోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top