ఉద్యోగం చేసే అమ్మాయిలకు డిమాండ్

ఉద్యోగం చేసే అమ్మాయిలకు డిమాండ్ - Sakshi


కెరీర్ ఫస్ట్..మ్యారేజి నెక్ట్స్



నిన్నటి తరం వరకు భార్య గ్రాడ్యుయేట్ అయ్యుండాలన్నది అబ్బాయిల కండిషన్. ప్రస్తుతం అమ్మాయిలు కూడా ఉన్నత విద్య అభ్యసిస్తుండడంతో ట్రెండ్ మారింది. మంచి చదువుతో చక్కని ఉద్యోగం చేస్తున్న భార్య తోడుంటే జీవితంలో త్వరగా సెటిలైపోవచ్చని నేటి తరం యువకులు ఆలోచిస్తున్నారు. అందుకే అలాంటి అమ్మాయిల కోసం వెదుకుతున్నారు. జాబ్ చేస్తున్న యువతులకు త్వరగా సంబంధాలు సెటిలైపోతున్నాయి.

 

ట్రెండ్ మారింది. ఇప్పుడు కలలన్నీ కెరీర్‌పైనే. పరుగు ప్రపంచంలో ఒక్క అడుగు వెనుకబడినా బతుకంతా తడబాటే. అందుకే పెద్ద పెద్ద అంగలతో మెట్లు చకచకా ఎక్కేయాలని తాపత్రయపడుతున్నారు నేటి యువత. మూడు ముళ్ల గురించి మూడు పదులు దాటే వరకు ఆలోచించడమే లేదు. ఉన్నత చదువులు... ఉద్యోగమే కాక జాతకాలు... తగిన ఈడు జోడు.. ఇలా అనేక అంశాలు పెళ్లిళ్ల జాప్యానికి కారణాలవుతున్నాయి.

 

ఉన్నత విద్యనభ్యసించాలి... మంచి ఉద్యోగం సంపాదించాలి... ఆర్థికంగా నిలదొక్కుకోవాలి... ఆ తరువాతే పెళ్లి అంటున్నారు నేటి యువతీ యువకులు. విద్యార్థి దశలోనే గమ్యాలను నిర్దేశించుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేసి లక్ష్యం చేరుకున్నాకే దాదాపుగా ప్రతి ఒక్కరూ జీవిత భాగస్వామి వెతుకులాటలో పడుతున్నారు. ఈ ప్రయత్నాల్లో అనేకమందికి మూడు పదుల వయస్సు దాటిపోతోంది. జీవిత లక్ష్యం ముందు పెరుగుతున్న వయస్సును ఎవరూ పెద్దగా లెక్క చేయడం లేదు. దాంతో కాస్త ఆలస్యంగా ముప్ఫైలలో పెళ్లిళ్లు చేసుకునే అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. అయితే భాగస్వామి విషయంలో అభిరుచులు కూడా మారిపోయాయి.



కాబోయే భార్య కూడా తమకు తగ్గట్టు చదువుకొని ఉద్యోగం చేస్తుండాలని కోరుకుంటున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. జీవితంలో స్థిరపడ్డాక భాగస్వాములను హైటెక్ పద్ధతిన వెతుక్కుంటున్నారు. ఈ బాధ్యతలను మ్యారేజ్ బ్యూరోలకు అప్పగిస్తున్నారు. ఫలితంగా కుటుంబ సభ్యులు తీసుకువచ్చిన సంబంధాల కంటే ఆన్‌లైన్‌లో కుదుర్చుకుంటున్న సంబంధాల సంఖ్యే అధికంగా ఉన్నాయి.



ప్రస్తుతం దేశంలో సుమారు 100 మిలియన్ల యువతీ, యువకుల ప్రొఫైల్స్ భాగస్వాముల కోసం ఆన్‌లైన్‌లో ఉన్నట్టు మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. కొన్ని మ్యారేజ్ బ్యూరోలు చేసిన సర్వే ప్రకారం.. ప్రస్తుతం పెళ్లిళ్లకు సిద్ధమవుతున్న వారిలో 18 నుంచి 25 ఏళ్లలోపు వారు 31 శాతం మంది ఉండగా, 26 నుంచి 35 ఏళ్లలోపు వారు 49 శాతం, 36 నుంచి 45 ఏళ్లలోపు 11 శాతం, 46 నుంచి 60 ఏళ్లలోపు వారు 9 శాతం మంది ఉన్నారు.

 

జాతకాలు కీలకం..

బీటెక్‌లు, మెడిసిన్‌లు, సాఫ్ట్‌వేర్ ఇలా ఎంత ఉన్నత చదువు చదివినా పెళ్లి విషయంలో కొన్ని పాత ఆచారాలను ఇంకా చాలామంది ఆచరిస్తూనే ఉన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయిన ఈ రోజుల్లో ఆన్‌లైన్‌లో భాగస్వాములను వెతుక్కుంటున్నా.. జాతకాలకు ప్రాధాన్యం తగ్గలేదు. మిగతా విషయాల్లో వీటికి అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోయినా పెళ్లి విషయంలో మాత్రం జాతకం కుదరనిదే అనేకమంది తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.



ఆస్తి, చదువులు, ఉద్యోగం ఇలా అన్నీ కుదిరినా జాతకం సరిపోని కారణంగా పెళ్లిళ్లు చేసుకునేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో చాలామంది 30 నుంచి 35 ఏళ్ల వయస్సు వరకు నిరీక్షించాల్సివస్తోంది. వయస్సు పెరిగేకొద్దీ సంబంధాలు కుదరడం కష్టమవుతుందని మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి సందర్భాల్లో కొంతమంది కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొంటున్నారు.

 

పేరయ్యల స్థానంలోమ్యారేజ్ బ్యూరోలు

దశాబ్దం వెనక్కు వెళితే పెళ్లి సంబంధాలు కుదిర్చేందుకు పెళ్లిళ్ల పేరయ్యలుండేవారు. వారే అందరి ఇళ్లకూ వెళ్లి యువతీ యువకుల వ్యక్తిగత విషయాలు, జాతకాలు తీసుకొని సంబంధాలు కుదిర్చేవారు. పేరయ్యలు ఇచ్చిన సమాచారం, సలహాలతో కుటుంబ పెద్దలు అమ్మాయి లేదా అబ్బాయిలను చూసి ఓ నిర్ణయానికి వచ్చేవారు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు వ చ్చింది. పేరయ్యల స్థానంలో మ్యారేజ్ బ్యూరోలు వచ్చాయి.



మనకు కావాల్సిన వధూవరులు ఎలా ఉండాలో వీరికి తెలియజేస్తే చాలు ఆ అర్హతలు ఉన్న చిట్టాను క్షణాల్లో చూపిస్తారు. అందులో నచ్చకపోతే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేస్తారు. ఇందుకు మ్యారేజ్ బ్యూరోలు రూ.2500 నుంచి రూ.5000 వరకు తీసుకుంటున్నారు. వ్యక్తిగత వివరాలు, అభిరుచులు ఆన్‌లైన్‌లోనే పొందుపరుస్తారు. ఆన్‌లైన్‌లో భాగస్వాములను వెతుక్కోడానికి అనేక వెబ్‌సైట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. భాగస్వాముల ప్రొఫైల్ ఓకే అనుకుంటే బ్యూరోను సంప్రదిస్తే మిగతా తతంగం అంతా పూర్తి చేస్తారు. ఇలాంటి సేవలు అందిస్తున్న సంస్థలు ప్రస్తుతం విశాఖలో దాదాపుగా 50 వరకు ఉన్నాయి.

 

90 శాతం పెళ్లిళ్లు మా చేతుల మీదుగానే...

ప్రస్తుత కాలంలో పెళ్లి సంబంధాల కోసం 90 శాతం మంది మ్యారేజ్ బ్యూరోలనే ఆశ్రయిస్తున్నారు. వీరిలో పురుషులే 70 శాతంమంది వరకు ఉంటున్నారు. ఉద్యోగస్తులు, గ్రాడ్యుయేషన్, ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన అమ్మాయిలు కావాలని కోరుతున్నారు. నూటికి 80 శాతం దాకా ఇలాంటి దరఖాస్తులే ఉంటున్నాయి. ప్రస్తుతం పెద్ద కుటుంబాల సంఖ్య తగ్గిపోవడంతో బిజీ లైఫ్‌లో భాగస్వాముల వెతుకులాట కొంత కష్టమవుతోంది. అలాంటి వారు మ్యారేజ్ బ్యూరోలతోపాటు వివాహ పరిచయ వేదికలపై ఆసక్తి చూపిస్తున్నారు.



-ఎస్.బాబిరెడ్డి,భావన మ్యారేజ్ బ్యూరో, రామ్‌నగర్

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top