ఇంకెన్నాళ్లీ అంధకారం

ఇంకెన్నాళ్లీ అంధకారం

  • విద్యుత్ పునర్నిర్మాణ పనుల్లో   తీవ్ర జాప్యం

  •  సిబ్బంది మధ్య సమన్వయం కరువు

  •  ఇంటి కనెక్షన్ల కోసం చేతివాటం

  •  జిల్లాలోని చిన్న పట్టణాలకే  ఇంకా జరగని సరఫరా

  •  కరెంటు గురించి మర్చిపోయిన పల్లెవాసులు

  • చోడవరం: తుఫాన్ వచ్చి 12 రోజులు గడిచిపోయింది. గ్రామీణ జిల్లాలోని చిన్న పట్టణాలకు కూడా ఇంకా విద్యుత్ సరఫరా రాలేదు. ఇక పల్లెల్లో ప్రజలు కరెంటు ఊసే మరిచిపోయారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే వందలాది గ్రామాలు అంధకారంలో మగ్గుతున్నాయ న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ లైన్ల మరమ్మతులు, పుననిర్మాణ  పనుల్లో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.  ఎక్కడి స్తంభాలు అక్కడే ఉన్నాయి.



    ఇతర జిల్లాల నుంచి వచ్చిన సహాయక సిబ్బంది పనులు నిమగ్నమైతే కొందరు స్థానిక సిబ్బంది అలసత్వం ప్రదర్శిస్తున్నారు. వందలాది మంది కూలీలను, సిబ్బందిని లైన్ల పునర్నిర్మాణ పనులకు తరలించారు. స్థానిక సిబ్బందితో కలిసి వీరు పనిని వేగవంతం చేయాలనే ఆదేశాలున్నాయి.  కొందరు నిర్లక్ష్యం వల్ల పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది.  లైన్లు వేసిన చోట్ల గృహ, వ్యాపార కనెక్షన్లు ఎక్కడికక్కడ కలపాల్సి ఉండగా ఇందులోనూ సిబ్బం ది చేతివాటం ప్రద ర్శిస్తున్నారనే ఆరోపణ వెల్లువెత్తుతున్నాయి. చోడవరం పట్టణంలో ఇటువంటి పరిస్థితి పలుచోట్ల కనిపించింది.

     

    స్థానిక శివాలయం వీధిలో లైన్ల పనులు పూర్తికాగా ఇంటి కనెక్షన్లు కొన్ని కలిపి, మరికొన్ని వదిలేయడంతో బాధిత వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యంత్రాలు, సిబ్బంది ఎక్కువగా ఉన్నా కొన్ని చోట్ల స్తంభాలు, ఇతర విద్యుత్ సామగ్రి కొరత ఉండటం వల్ల పనులు మందకొడిగా సాగుతున్నాయి. స్థానిక సిబ్బంది, ఇతర ప్రాంతాల  నుంచి సిబ్బందికి మధ్య సమన్వయం కొరవడంతో ప్రణాళికా బద్ధంగా పనులు సాగడం లేదు. కొన్ని చోట్ల పక్కలైన్లు వేసి ఆ దగ్గరలోనే ఉన్న స్తంభాలను పునరుద్ధరించడం లేదు. కిందపడి ఉన్న స్తంభాలు వైర్లు తొలగింపు పనికూడా జరగలేదు. ఓ పక్క లైన్లు వేస్తున్నప్పటికీ కొన్ని చోట్ల వైర్లపై విరిగిపడిన చెట్ల కొమ్మలను కూడా తొలగించక పోవడం వల్ల పనులు నెమ్మదిగా జరుగుతున్నాయి.

     

    ఏ వీధిలో ఎన్ని స్తంభాలు పడ్డాయో నమోదుచేసిన అధికారులు లారీలపై వచ్చిన స్తంభాలను అవసరమైన చోట్ల దించకుండా ఒకే చోట ఎక్కువ స్తంభాలు దించి అక్కడ నుంచి క్రేన్ల సాయంతో తెస్తున్నారు. దీనివల్ల సమయం వృథా అయి పనుల్లో జాప్యం, శ్రమ చోటుచేసుకుంటున్నాయి. చోడవరం పట్టణంతోపాటు పరిసర గ్రామాలు, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట, మాడుగుల, కె.కోటపాడు, దేవరాపల్లి, చీడికాడ మండలాల్లో కూడా ఎక్కడా పూర్తిగా లైన్లు పునరుద్ధరించిన దాఖలాలు లేవు. ఏఈలు, లైన్‌ఇన్‌స్పెక్టర్ల పనితీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



    ఉన్నతాధికారులు పర్యవేక్షణ కూడా  నామమాత్రంగానే ఉందని, దీనివల్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరగడంలేదని జనం ధ్వజమెత్తుతున్నారు. ఇంకెంతకాలం చీకట్లో ఉండాలని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మరో పక్క జనరేటర్ల ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో దుకాణదారులు, వ్యాపాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top