డీలర్లపై అధికారాస్త్రం


రేషన్ డీలర్లను తొలగించేందుకు అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు అధికారులకు తలనొప్పిగా మారిన వైనం గతంలో ఎన్నడూ లేనివిధంగా పలువురికి ఉద్వాసన

 

 ఉదయగిరి : అనర్హుల పేరుతో రేషన్‌కార్డుల తొలగింపుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టగా అధికారపార్టీ నాయకులు రేషన్‌షాపుల డీలర్ల మెడ పై కత్తి పెట్టారు. తమకు ఇష్టం లేదనో, టీడీపీ కార్యకర్తలను నియమించుకునేందుకో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారినప్పటికీ బలవంతంగా వారిని ఒప్పించి డీలర్లను తొలగించే పనిలో ఉన్నారు. ఎందుకు తొలగిస్తున్నారో అర్ధంకాక ప్రశ్నించిన డీలర్లకు దయచేసి అవన్నీ అడగద్దు, మీఅంతట మీరే తప్పకోండి అంటూ తహశీల్దార్లు బతిమాలుకునే పరిస్థితి ఏర్పడింది. మూకుమ్మడిగా తొలగించకుండా ఒక్కొక్కరిపై వేటుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జిల్లా అంతటా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో రేషన్ డీలర్లకు భారీగా ఉద్వాసన పలికేందుకు స్థానిక ఎమ్మెల్యే అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. టీడీపీ నేతల చర్యలను ఎదుర్కోలేని డీలర్లు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. మొత్తానికి ముందు తమకు గిట్టని రేషన్‌కార్డుదారులను నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్న దేశం నేతలు ఇప్పుడు రేషన్‌డీలర్లను లక్ష్యంగా ఎంచుకున్నారు.  



జిల్లాలో డీలర్లపై అధికార వేటు ప్రారంభమైంది. పెద్ద సంఖ్యలో డీలర్లకు ఉద్వాసన పలికేందుకు అధికార పార్టీ నేతలు కసరత్తు చేసి జాబితా రూపొందించి అధికారుల ముందు ఉంచుతున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఉదయగిరి, వెంకటగిరి, కోవూరు, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాలలో పలువురు డీలర్లను తొలగించారు. మరికొంతమందికి రేపోమాపో ఉద్వాసన చెప్పేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయగిరి నియోజకవర్గ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 150 మందికి పైగా డీలర్లను తొలగించేందుకు అధికార పార్టీ నేతలు మండలాల వారీగా జాబితా రూపొందించి ఆయా మండలాల తహశీల్దార్లకు ఇచ్చినట్లు సమాచారం. దీంతో డీలర్లలో కలవరం మొదలైంది.



     జిల్లాలో 1850కి పైగా చౌకదుకాణాలున్నాయి. వీటిద్వారా 29 లక్షల మంది వినియోగదారులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు అందచేస్తున్నారు. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో తమకు అనుకూలమైన వారిని డీలర్లుగా నియమించుకునేందుకు పన్నాగం పన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లపై స్థానిక నేతలు ఒత్తిడి తెచ్చి జాబితాను అందజేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 50 మంది డీలర్లను తొలగించినట్లు సమాచారం. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలలో 350 మందికి పైగా చౌకదుకాణాలున్నాయి. వీటిలో చాలామంది గత పది పదిహేనేళ్ల నుంచి డీలర్లుగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో 150 మందికిపైగా డీలర్లను తొలగించేందుకు రంగం సిద్ధమైంది.



గత పదేళ్లలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పటకీ రాజకీయ కక్షలతో డీలర్లను తొలగించిన సంఘటనలు లేవు. ఏ పార్టీ అధికారంలోకొచ్చినా డీలర్లను ఇంత పెద్ద స్థాయిలో టార్గెట్ పెట్టుకొని తొలగించే ప్రయత్నం ఎప్పుడూ జరగలేదని డీలర్లతో పాటు గ్రామస్థాయి నేతలు కూడా అంగీకరిస్తున్నారు.  నియోజకవర్గంలో ఇప్పటికే మొదటి దఫాగా 20 మంది డీలర్లపై వేటుపడింది. రెండో దఫాగా మరో 60 మందికిపై వేటు వేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. వచ్చే రెండు నెలల్లో సుమారు 150 మంది డీలర్లను తొలగించేందుకు అధికార పార్టీ నేతలు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో టీ డీపీకి అనుకూలంగా వ్యవహరించని డీలర్లపై వేటు వేయాలని పలువురు గ్రామస్థాయి నేతలు ఇప్పటికే ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు జాబితా ఇచ్చినట్లు సమాచారం.



ఆయన గతంలో పనిచేసిన ఆర్డీఓ వెంకటరమణారెడ్డి వద్ద ఈ విషయం ప్రస్తావించినప్పటికీ ఇంత పెద్ద సంఖ్యలో ఒకేసారి డీలర్లను తొలగించేందుకు అంగీకరించకపోవడంతో  బదిలీ చేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఆర్డీవో ద్వారా తమ పని సజావుగా జరిపించుకునేందుకు అధికార పార్టీనేతలు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. వరికుంటపాడు మండలంలో వచ్చే నెల సరుకులకు సంబంధించి ఇంతవరకు డీడీలు కట్టించలేదు. సరుకుల పంపిణీకి మరో వారం సమయం కూడా లేదు. అధికారపార్టీ నేతల ఒత్తిడితోనే డీడీలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.  

 

 న్యాయస్థానాన్ని ఆశ్రయించే దిశలో డీలర్లు:

 జిల్లాలోని పలు గ్రామాల చౌకదుకాణ డీలర్లను కారణం లేకుండా తొలగిస్తున్న నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే పలువురు డీలర్లు సమావేశమై అక్రమంగా తొలగిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు విజయం సాధించిన కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాలలోని డీలర్లను అధిక మొత్తంలో తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గాలకు చెందిన పలువురు డీలర్లు ఈ సమస్యను అధిగమించేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తొలగించిన చౌకదుకాణాల డీలర్ల స్థానంలో కొత్తవారిని నియమించే విషయంలో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాడుకుంటున్నారు. దీంతో కొన్నిచోట్ల తొలగింపుల ప్రక్రియలో ఆలస్యం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు చోటా నాయకులు డీలర్‌డిప్ ఇప్పిస్తామంటూ వసూళ్ల పర్వానికి తెరతీసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

 





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top