పచ్చ సంతర్పణకు ఉత్తర్వులు

పచ్చ సంతర్పణకు ఉత్తర్వులు - Sakshi

  • ఆదర్శ రైతు వ్యవస్థ రద్దుకు జీవో

  •  ఎంపీఈవోల నియామకానికి నిర్ణయం

  •  టీడీపీ నేతల సిఫారసులకే ప్రాధాన్యం?

  •  అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఆదర్శరైతులు

  • పచ్చ చొక్కాలకు ఉపాధి కేంద్రంగా టీడీపీ సర్కారును మార్చేపనిలో మరో ముందడుగు పడింది. ఏడేళ్లపాటు వ్యవసాయాభివృద్ధికి కృషిచేసిన ఆదర్శరైతులను ఇంటికి పంపేసి, ఎంపీఈవోల పేరిట తెలుగు తమ్ముళ్లకు నచ్చిన వారిని ఆ స్థానంలోకి తెచ్చేందుకు ఏకంగా జీఓ జారీఅయింది.

     

    విశాఖ రూరల్ : ఇంటికో ఉద్యోగమంటూ ఎన్నికల ముందు ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఉన్న వారికి ఉపాధిని దూరం చేస్తున్నారు. రైతు సంక్షేమ పార్టీ అని చెప్పుకుంటూ వారి పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడేళ్ల పాటు వ్యవసాయాభివృద్ధికి దోహదపడిన ఆదర్శ రైతు వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం జీవో 43ను జారీచేశారు. ఫలితంగా జిల్లాలో 1958 మంది ఆదర్శ రైతులు గౌరవం కోల్పోనున్నారు. అన్నదాతలకు అండగా ఉంటూ, ఆధునిక సాగు పద్దతులను రైతులకు చేరవేసే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి 2007లో ఆదర్శ రైతు పథకాన్ని ప్రవేశపెట్టారు.



    దీని ప్రకారం జిల్లాలో 1958 మందిని ఆదర్శ రైతులుగా నియమించారు. వీరికి ఒక్కొక్కరికీ నెలకు రూ.వెయ్యి చొప్పున గౌరవ భృతి ఇస్తూ వచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలో వ్యవసాయం మరింత బలోపేతమైంది. అయితే వైఎస్ మరణం తరువాత ఆదర్శ రైతు వ్యవస్థ గాడి తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతులను కనీసం పట్టించుకోలేదు. వీరికి ఇవ్వాల్సిన గౌరవ వేతనాలను గత ఏడాదిన్నరగా చెల్లించడం లేదు. అయినప్పటికీ ఆదర్శ రైతులు వ్యవసాయాభివృద్ధికి తమ వంతు కృషినందిస్తున్నారు.

     

    అధికారంలోకి రాగానే నిర్ణయం : తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆదర్శ రైతులను తొలగించాలని నిర్ణయించింది. ఎన్నికల్లో ఆదర్శ రైతులు టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారన్న కారణంతో ఆ వ్యవస్థనే రద్దు చేయాలనుకుంది. జిల్లాలో జరిగిన తొలి కేబినెట్ సమావేశంలోనే ఇందుకు సంబంధించిన ప్రతిపాదన కూడా చేశారు. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. తాజాగా ఆదర్శ రైతులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

     

    ఎంపీఈఓ పేరుతో కొత్త వ్యవస్థ



    ఆదర్శ రైతుల వ్యవస్థ స్థానంలో ఎంపీఈఓ (మల్టీపర్పస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) పేరుతో మరో వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీడీపీ నేతలు సిఫారసు చేసిన వారిని ఆ స్థానంలో తీసుకోవాలని భావిస్తున్నారు. దీనిపై ఆదర్శ రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వ్యవస్థనే రద్దు చేయడం సరికాదని హితవు పలుకున్నారు. ఆదర్శ రైతుల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టే వ్యవస్థలో  తొలి ప్రాధాన్యం ఉద్యోగాలు కోల్పోయిన వారికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top