ట్రాలీ టై్..


 జాతీయ రహదారిపై బియ్యం బస్తాలు, కొందరు ప్రయాణికులతో ఒక ఆటో వెళుతోంది. ఒక బస్తా ఆటో నుంచి జారీ పడిపోయింది. దాన్ని తీసేందుకు డ్రైవర్ ఆటో ను ఆపాడు. వెనుక నుంచి వస్తున్న ట్రాలీ లారీ డ్రైవర్ చివ రి క్షణంలో గమనించి ఆటో తప్పించేందుకు ప్రయత్నించాడు. అంతే లారీ అదుపు తప్పి ఆటోతోపాటు ముం దు వెళుతున్న రెండు బైకులను, రోడ్డు పక్కనున్న మరో బైకును నుజ్జునుజ్జు చేసి.. రోడ్డు పక్క పొదల్లోకి దూసుకుపోయింది. దాంతో జాతీయ రహదారిపై భయానక వాతావరణం చోటుచేసుకుంది. బైకులపై వెళుతున్న ఇద్దరు అక్కడికక్కడే దర్మరణం చెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నరసన్నపేట-శ్రీరాంపురం మధ్య ఈ దుర్ఘటన జరిగింది.

 

 నరసన్నపేట: నరసన్నపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ రూపంలో మృత్యువు కమ్ముకొచ్చి ఇద్దరిని బలికొంది. ఆరుగురిని గాయాలపాల్జేసింది. బరువుతో వస్తున్న లారీ అదుపు తప్పి దూసుకుపోవడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయిపోయాయి. సంఘటనా స్థలానికి వచ్చినవారు ఈ ఘోరాన్ని చూడలేనంత దారుణం చోటుచేసుకుంది.  

 

 ప్రమాదం ఎలా జరిగిందంటే..

 సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ ట్రాలీ లారీ టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపు వెళుతోంది. నరసన్నపేట-శ్రీరాంపురంల మధ్య గల పెట్రోల్ బంకు వద్ద ముందు వెళుతున్న ఆటోలో నుంచి బియ్యం బస్తా రోడ్డుపై పడిపోవడంతో దానిని తీసుకొనేందుకు ఆటో ఆపారు. ఇది గమనించని వెనుక వస్తున్న ట్రాలీ లారీ డ్రైవర్ సడన్‌గా ఆటోను తప్పించబోయాడు. దీంతో ఆటో ముందున్న రెండు మోటారు సైకిళ్లను బలంగా ఢీకొన్నాడు. ఈ ఘటనలో మోటారు సైక్లిస్టులు... సంతబొమ్మాళి మండలం నగిరి పెంటకు చెందిన దుప్పట్ల కృష్ణమూర్తి (58), జలుమూరు మండలం కరవంజ సమీపంలోని మట్టవానిపేటకు చెందిన అదపాక రఘు వరణ్ (23)లు అక్కడక్కడే మృతి చెందారు. మృతదేహాలు తునాతునకలై రోడ్డు మీద పడిఉన్నాయి. మోటారు సైకిళ్లు రెండూ నుజ్జునుజ్జైపోయాయి. అలాగే రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన మరో మోటారు సైకిల్ కూడా ఈ ప్రమాదంలో దెబ్బతింది. ప్రమాదానికి కారణం అయిన ట్రాలీ పొలాల్లోకి దూసుకుపోయింది. పర్లాంగు మేర ఎటు చూసినా రక్తం ముద్దలే కన్పించాయి. ఈ ప్రమాదంలో శిర్ల అప్పన్న, శశివరణం, ధర్మవరపు పెంటయ్య, దీర్గాశి రాములుతో పాటు ఇద్దరు లారీ సిబ్బంది గాయపడ్డారు.   

 

 స్తంభించిన ట్రాఫిక్: రోడ్డు ప్రమాదం వల్ల టెక్కలి నుంచి శ్రీకాకుళం వైపుకు వెళుతున్న వాహనాల రాకపోకలు సుమారు రెండు గంటల పాటు ఆగిపోయాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ చిన్నంనాయుడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

 

 పెళ్లి చూపులకు వచ్చి మృత్యువాత

 మట్టవానిపేటకు చెందిన రఘువరన్ హైదరాబాద్‌లో పొక్లెయిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి నాగేశ్వరరావు కోరిక మేరకు పెళ్లి కుమార్తెను చూసేందుకు మూడు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. రెండు రోజుల్లో తిరిగి హైదరాబాద్ వెళ్లిపోతాడనగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో రఘువరన్ బంధువులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. సంఘటనా స్థలంలో బోరుమని విలపిస్తున్నారు. రఘువరన్ చిన్న తనం నుంచి కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడని తండ్రి నాగేశ్వరరావు విలపిస్తూ చెప్పారు.

 

 కృష్ణమూర్తి.. ఇరిగేషన్ శాఖలో అటెండర్

 ఈ ప్రమాదంలో మరణించిన మరో వ్యక్తి దుప్పట్ల కృష్ణమూర్తి శ్రీకాకుళంలో ఇరిగేషన్ శాఖలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. స్వగ్రామం వెళ్లి తిరిగి శ్రీకాకుళం వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఇతన మృతదేహం పూర్తిగా నుజ్జయిపోయింది. మృతుడి జేబులో ఉన్న సెల్ ఫోను ఆధారంగా వివరాలు సేకరించారు. ఇతని భార్యాబిడ్డలు విశాఖపట్నంలోని కూర్మన్నపాలెంలో ఉంటున్నారు. ఒక కుమారుడు ఆర్మీలో పని చేస్తున్నాడు. మృతదేహాలు తరలింపు: ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను రాత్రి 7 గంటల సమయంలో నరసన్నపేట ఆస్పత్రిలోని పీఎం షెడ్డుకు తరలించారు. ఈ ప్రమాదంపై లారీ సిబ్బంది నుంచి ఎస్‌ఐ  పూర్తి వివరాలు సేకరించారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top