బీ(ధీ)మా పాయే..!

బీ(ధీ)మా పాయే..! - Sakshi


- ముగిసిన బీమా పథకం ప్రీమియం గడువు

- పభుత్వం దోబూచులాటతో నష్టపోయిన రైతులు

- బాధితులు అక్షరాలా 7.5 లక్షల మంది


సాక్షి, ఒంగోలు : రైతుకు కలిసొచ్చే కాలం కరిగిపోతోంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితుల్లో పంటనష్టపోయినప్పుడు ఆదుకునే వాతావరణ బీమా పథకం ఈ ‘సారీ’ చేజారిపోయినట్టే. జాతీయ వ్యవసాయ బీమా పథకం కింద రైతు రిజిస్ట్రేషన్ గడువు గురువారంతో ముగిసింది. వాస్తవానికి బ్యాంకు నుంచి రైతు రుణం తీసుకునే సమయంలోనే బీమా పథకం ప్రీమియాన్ని మినహాయిస్తారు. అలాంటిది ప్రస్తుతం బ్యాంకర్ల నుంచి రైతులు రుణాలు పొందకపోవడంతో బీమా రిజిస్ట్రేషన్‌లు అవకాశం కలగలేదు. పంటరుణాల మాఫీ, రుణాల రీషెడ్యూల్ అమలుపై చంద్రబాబు ప్రభుత్వం రోజుకో తీరుగా ప్రకటనలు చేస్తూ రైతుల జీవితాలతో దోబూచులాటడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార టీడీపీ ఆదిలోనే రైతుల్ని అన్ని విధాలా దగా చేయడంపై విపక్షాలతోపాటు ప్రజాసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



రైతుకు కన్నీరే..

అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న జిల్లా రైతులకు ఈ ఖరీఫ్ కన్నీళ్లే మిగల్చనుంది. జిల్లా నలువైపులా పంటల సాగు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. వర్షాధారం, నీటి ఆధారం, వాతావరణ పరిస్థితులపై నడిచే సాగు ఈ జిల్లాల్లోనే ఉండటం గమనార్హం. అలాంటి దుర్భిక్ష జిల్లాలో రైతులు వివిధ కారణాలతో ఏటా పంటనష్టాన్ని చవిచూసినప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లేకుండా గత ప్రభుత్వాలు బృహత్తర బీమా పథకాన్ని అమలు చేశాయి. ప్రధాన పంటలైన వరి, సజ్జ, మొక్కజొన్న, కంది, ఆముదం, మిరప (నీటి ఆధారం), మిరప (వర్షాధారం), పత్తి (వాతావరణ ఆధారితం) వంటి వాటికి బీమా పథకాన్ని వర్తింపజేశాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పంటల బీమా పథకంలో మార్పులు తెచ్చారు.



అప్పట్లో మండలం యూనిట్‌గా అమలయ్యే పథకాన్ని మార్పుచేసి.. గ్రామం యూనిట్‌గా వర్తింపజేస్తేనే రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆలోచనకు ఆయన శ్రీకారం చుట్టారు. ఖరీఫ్‌లో సాగయ్యే పంట విస్తీర్ణం 2.89 లక్షల హెక్టార్లుకాగా, ఇందులో పత్తి 3,096 హెక్టార్లు, వేరుశనగ 2,091 హెక్టార్లు, కంది 6,963 హెక్టార్లు సాగు చేస్తున్నారు. వర్షాభావంతో వేరుశనగ పంట అప్పుడే ఎండిపోయే దశకొచ్చింది. ఎండిపోతున్న పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించి ఉంటే నష్టపరిహారమన్నా వచ్చేదన్న భావన రైతుల్లో ఉంది.  

 

కలగా మారిన ‘మాఫీ’

ఒక్కో రైతు కుటుంబానికి రూ.1.50 లక్షల వంతున రుణ మాఫీ చేస్తామని ఈ నెల 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త రుణాలు కూడా ఇప్పిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అధికార పార్టీ ఆర్భాటంగా ప్రచారం చేయడంతో తమకు కొత్త రుణాలొస్తాయని.. పంటల బీమా పథకం కింద ప్రీమియం చెల్లించవచ్చనే ఆశతో రైతులు ఇంతకాలం ఎదురు చూశారు. కానీ పంట రుణాల మాఫీ, కొత్త రుణాల రీషెడ్యూల్‌పై ప్రభుత్వం స్పష్టతనివ్వకపోవడంతో రైతుల ఆశలన్నీ ఆవిరయ్యాయి. బ్యాంకర్లు 2013-14లో కరువు ప్రభావిత 45 మండలాల్లో 2 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను రీ షెడ్యూల్ చేయలేదు.



ఇక మిగిలిన 4 లక్షల మంది రైతులు పంట రుణాలుగా తీసుకున్న రూ.6,900 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధనరూపంలో అందిస్తే ఆ రుణాల్ని మాఫీ చేయగలమని బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు బ్యాంకర్లు నోటీసులు జారీ చేస్తున్నారు. కొన్నిచోట్ల రైతు ఖాతాల్లోని డిపాజిట్లను జప్తు చేస్తున్నారు. ఈ ఏడాది పంట రుణాలుగా రూ.3 వేల కోట్లు పంపిణీ చేయాలని బ్యాంకర్లు అంచనా వేయగా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదంటే అతిశయోక్తి కాదు. బీమాప్రీమియం చెల్లింపునకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31 (గురువారం) గడువు విధించింది. ఈ ఏడాది పంట రుణమే ఇవ్వనప్పుడు బ్యాంకర్లు ప్రీమియం మినహాయించే అవకాశం లేకపోవడంతో జిల్లా రైతులంతా బీమాపథకం వర్తింపును కోల్పోయారు. వ్యవసాయంపై మమకారం లేని ప్రభుత్వ విధానాలపై ఉద్యమించక తప్పదని ప్రధాన ప్రతిపక్షంతో పాటు రైతు సంఘాల నేతలు సన్నద్ధమవుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top