మళ్లీ మొదటికి!






 విజయనగరం కంటోన్మెంట్: రేషన్ సరుకుల పంపిణీకి నిర్ణీత గడువు విధించినా క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రతి నెలా పదో తేదీనాటికి సరుకుల పంపిణీ పూర్తి చేయాలని జిల్లా స్థాయిలో ఆదేశాలున్నాయి. అయితే సాంకేతిక సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీ దాదాపు 40 శాతం నిలిచిపోయింది. కొత్త సర్వర్ ఏర్పాటు, మెషీన్ల మరమ్మతులు, నెట్‌వర్క్ అందుబాటులో లేకపోవడం, ఇంటర్‌నెట్ పనిచేయకపోవడం తదితర కారణాలతో పంపిణీలో జాప్యం చోటుచేసుకుంటోంది.

 

 జిల్లా వ్యాప్తంగా దాదాపు ఏడు లక్షల తెల్ల కార్డులున్నాయి. మొత్తం 1,388 రేషన్ డిపోలకు 15 ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా రేషన్ సరుకులను ఈవెయింగ్ ద్వారా అందజేస్తున్నారు. అక్కడి నుంచి ఈ-పాస్ మెషీన్ల ద్వారా గ్రామాలు, వార్డుల్లోని రేషన్ షాపుల నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఈ నెల నుంచి ఎన్‌ఐసీకి సంబంధించిన నెట్‌వర్క్‌లో సర్వర్‌ను అనుసంధానం చేశారు. సరుకుల పంపిణీకి గడువు విధించిన అధికారులు.. అవాంతరాలను ఎలా ఎదుర్కోవాలో స్పష్టంగా చెప్పలేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

 

 కొత్త సర్వర్‌కు ఇంకా అలవాటు పడని మెషీన్లతో సమస్యలు ఏర్పడుతున్నాయి. అన్ని రేషన్ షాపుల్లో ఈ నెల 10 నాటికి రేషన్ సరుకులు పంపిణీని పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. మరో పక్క ఈ నెల 15తో సర్వర్‌ను కూడా నిలిపివేసేందుకు సివిల్‌సప్లయ్ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈలోగా జిల్లాలో పూర్తిస్థాయిలో రేషన్ సరుకులు వినియోగదారులకు అందే పరిస్థితి లేనట్టుగా కనిపిస్తోంది.

 

 ఉన్నతాధికారులతో చర్చించాలిగా..

 జిల్లా అధికారులకు లక్ష్యాలిచ్చి  వదిలేయడంతో ఈ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనపడుతోంది. కలెక్టర్, జేసీ స్థాయిలోని వారే సంబంధిత కమిషన ర్ తదితరులతో మాట్లాడి మెషీన్ల మరమ్మతులు, నెట్‌వర్క్ సమస్యలను పరిష్కరిస్తే ఇబ్బందులు తొలగే పరిస్థితి ఉంది.  లేకుంటే ఎన్నాళ్లయినా ఈ-పాస్‌తో సమస్యలు తప్పేలా లేవు. శనివారం ఉదయం డీఎస్‌ఓ నాగేశ్వరరావు, ఏఎస్‌ఓ శంకరపట్నాయక్ తదితరులు.. పాత, కొత్త ఏజెన్సీల సాంకేతిక సిబ్బందితో సహా ఏయే రేషన్ షాపుల్లో పంపిణీ నిలిచిపోయిందో వారికి అదనపు మెషీన్లు ఇవ్వడం, మరమ్మతులు చేయించడం, లాగిన్ అయ్యాయా లేదానన్న విషయాలపై సమీక్షించారు. కానీ ఈ పరిస్థితిలో పెద్దగా మార్పు లేదు. మళ్లీ సర్వర్ నిలిచిపోయేనాటికి ఇవ్వాల్సిన సరుకులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లోకి వెళ్లిపోవడం ఖాయం! ఇకనయినా ఉన్నతాధికారులు చొరవ చూపిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం కలిగే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top