మింగేసిన ఎండలు


వడదెబ్బతో 20 మంది మృతి

 

 జిల్లాలో ఎండలు విపరీతంగా పెరిగాయి.. చివరకు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి.. వివిధ ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బకు గురై 20 మంది మృతి చెందారు.. వారిలో వృద్ధులు ఎక్కువగా ఉన్నారు.. పొలం పనులు, పశువులను మేపడానికి వెళ్లి మృత్యువాత పడ్డారు.

     - నెట్‌వర్క్

 

 మెలవరం(జమ్మలమడుగు) : మైలవరం మండలంలోని వేపరాలకు చెందిన చౌడం రంగమ్మ వడదెబ్బకు గురై (70) మృతి చెందింది. చేనేత కుటుంబానికి చెందిన ఆమె కొత్తకొట్టాలలో నివాసం ఉండేంది. పని నిమిత్తం గ్రామంలోకి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి కళ్లు తిగుతున్నాయని పడిపోయిందని భర్త బాలకొండయ్య పేర్కొన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లటానికి ప్రయత్నించినా, అప్పటికే ప్రాణం పోయినట్లు తెలిపారు.



 కాశినాయన : వరికుంట్ల గ్రామానికి చెందిన గోడినరసమ్మ (64) వడదెబ్బతో మృతి చెందింది. ఆమె ఉదయం గేదెలను తోలుకుని ఊరిబయట మేపుతుండగా అస్వస్థతకు గురై మరణించినట్లు బంధువులు తెలిపారు.



 అట్లూరు :  కమలకూరు గ్రామానికి చెందిన బొజ్జా ఓబులేసు(65) వడదెబ్బ గురై మృత్యువాత పడ్డాడు. వారం రోజులుగా పెరిగిన ఎండలకు శనివారం వడదెబ్బకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బద్వేలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించ గా ఆరోగ్యం మరింత క్షీణించి ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బంధువులు తెలిపారు.



 దాహం..దాహం అంటూ..

 సిద్దవటం : నేకనాపురం గ్రామానికి చెందిన సంచా మంగమ్మ (82) వడదెబ్బతో మృతి చెందింది. వృద్ధురాలైనప్పటికి ఆమె అటు ఇటుగా కాలినడకతో తిరిగే వారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం దాహం..దాహం అంటూ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమెకు వైద్య సేవలందించేందుకు తరలించే ప్రయత్నం చేయగా.. ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 చాపాడు : చియ్యపాడు గ్రామంలో షేక్ నూరుల్లాగారి ముబుచాన్(45) అనే మహిళ మృతి చెందింది. ఆమె ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పశువులను మేపుకుంటూ వడదెబ్బకు గురై ఒంటి గంట సమయంలో ఇంటికి వచ్చింది. ఇంట్లో మంచినీరు తాగుతూ మంచంపై కుప్పకూలి పడిపోయి మృతి చెందింది.



 ఉపాధి పనులకు వెళ్లి

 వేముల : సిద్ధంరెడ్డిపల్లెకు చెందిన సింగారెడ్డి రామలక్షుమ్మ(47) వడదెబ్బకు గురై మృతి చెందింది. ఆమె ఉపాధి హామీ పనులకు వెళ్లగా ఈ సంఘటన చోటుచేసుకుంది.



  ముద్దనూరు మండలంలోని బొందలకుంట గ్రామంలో రసూల్‌బీ(49 వడడెబ్బకు గురై ఆదివారం మృతి చెందింది.ఉదయం మేకలను మేపడానికి వెళ్లి ఇంటికి రాకపోవడంతో భర్త, బంధువులు వెళ్లి చూడగా అపస్మారక స్థితిలో పడి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.



  సంబేపల్లె మండలంలోని గుట్టపల్లె గ్రామం అంకిరెడ్డిగారిపల్లెకు చెందిన కలకడ సిద్దారెడ్డి(60) ఉపాధి పనులు చేస్తుండగా మృతి చెందాడు.



  కొండాపురం మండలంలోని తాళ్ళప్రొద్దుటూరులో ఎస్సీ కాలనీకి చెందిన వెరుమాల ఇసాక్ (55) వడదెబ్బకు గురై మృతి చెందాడు.

   తొండూరు మండలంలోని గోటూరుకు చెందిన సుబ్బమ్మ రోజుమాదిరి గానే ఇంటి పనులు చేస్తుండగా మధ్యాహ్నం స్పృహ తప్పి పడిపోయి మరణించింది.

 

 ఒకే మండలంలో నలుగురు మృత్యువాత

 కలసపాడు : మండలంలోని వివిధ గ్రామాల్లో నలుగురు వృద్ధులు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. ఎగువ రామాపురంలోని ఎనుముల సుబ్బమ్మ (75) ఎండలను తట్టుకోలేక మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సింగరాయిపల్లెలోని పయ్యావుల పుల్లమ్మను (70) మండే ఎండలు మింగేశాయి. కలసపాడు చెందిన తుమ్మల పెంట పిచ్చయ్య (80) వడదెబ్బకు గురై మృతి చెందాడు. పొలం పనులు చేసుకుంటూ ఆరోగ్యంగా ఉన్న మహానందిపల్లెకు చెందిన నాగదాసరి పోలయ్యను ఎండలు వదలలేదు. ఉదయం పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన సేద తీర్చుకునేందుకు మంచ ంలో పడుకొని ఉండగా మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు.

 డ్వాక్రా సంఘం సమావేశానికి వెళ్లి..

 బద్వేలు అర్బన్ : ఆంజనేయనగర్‌లో నివసిస్తున్న యాదాళ్ల రామలక్ష్మీదేవి (36) వడదెబ్బకు గురై మృతి చెందింది. ఆమె ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వీధిలోని గుడి వద్ద డ్వాక్రా సంఘం సమావేశంలో కూడా పాల్గొని ఇంటికి వచ్చింది. తరువాత నీరు తాగిన కొద్ది సేపటికి కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకుపోయారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు ఆమె భర్త సత్యనారాయణ పేర్కొన్నారు.



 రాజంపేట రూరల్: ఊటుకూరు దళితవాడకు చెందిన వృద్ధుడు జవ్వాజి గంగయ్య(73) వడదెబ్బకు గురై మృతి చెందారు. ఇంటి వద్ద ఎండవేడిమికి తట్టుకోలేక అపస్మారక స్థితిలోకి వెళ్లి మృతి చెందాడు.

  ఖాజీపేట మండల పరిధిలోని పుల్లూరు దళితవాడకు చెందిన మీసాల టేకులమ్మ(58) పొలం పనులకు వెళ్లి వడదెబ్బకు గురై మరణించింది.

 

 రోజూ పొలానికి వెళ్లే వాడు..

 చిట్వేలి : నేతివారిపల్లెకు చెందిన బల్లేపల్లె శివయ్య(45) ఆదివారం మృతి చెందాడు. ఈయన రెండు రోజుల క్రితం వడదెబ్బకు గురై తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందాడు. శనివారం ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకురాగా ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రతి రోజు పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగించే రైతు అని వారు తెలిపారు.



 బి.కోడూరు : సిద్దుగారిపల్లెకు చెందిన బిజివేములచెన్నారెడ్డి (80) వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఆయన ఇంటి వద్దే ఉండగా, ఆదివారం ఎండ అధికం కావడంతో వేడిమిని తట్టుకోలేక మరణించినట్లు కటుంబ సభ్యులు తెలిపారు.

  ప్రొద్దుటూరులోని బుర్రసాధు మఠం వీధిలో ఉన్న ఆకుల చిన్న నరసింహులు (54) అనే బేల్దారి రోజు వారి పనికి వెళ్లి అస్వస్థతకు గురై మృతి చెందాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top