డీసీసీబీలో ముసలం

డీసీసీబీలో ముసలం - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో ముసలం పుట్టింది. కొన్నాళ్లుగా ఇక్కడ పనిచేస్తున్న ముఖ్య కార్యనిర్వాహకాధికారి (సీఈవో)ని అర్ధాంతరంగా మాతృశాఖకు పంపించేసి ఏ అర్హతా లేని వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారన్న ఆరోపణలు బ్యాంకు చైర్మన్, పాలకవర్గం మధ్య చిచ్చు రగిల్చాయి. బ్యాంకు చైర్మన్ అడ్డగోలుగా వ్యవహరించి ఇన్‌చార్జి సీఈవో నియామక ఉత్తర్వులు తెప్పించారని సహచర డెరైక్టర్లు మండిపడుతున్నారు. బోర్డ్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అంగీకారం లేకుండా, తీర్మానాలు చేయకుండా ఇలా వ్యవహరించడం నిబంధనలు ఉల్లంఘించడమేనని, దీనిపై త్వరలోనే ఓ సమీక్ష ఏర్పాటు చేసి ఇన్‌చార్జి సీఈవో నియామకాన్ని పునఃసమీక్షించాలని అధికారులను కోరుతామని  హెచ్చరిస్తున్నారు. ఇదీ నేపథ్యం

 

 డీసీసీబీ సీఈవోగా మొన్నటి వరకూ కె.జనార్ధనరావు పనిచేసేవారు. ఆప్కాబ్ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చిన ఆయన కాలపరిమితి ముగిసిపోవడంతో మరో టెర్మ్ ఆయన్నే కొనసాగించాలని బోర్డు సభ్యులు తీర్మానం చేశారు. సంస్థ కొన్నాళ్లుగా లాభాలబాటలో పయనించడం, భారీస్థాయిలో డిపాజిట్ల సేకరించడం, బహుళ సేవల ద్వారా రైతులకు మేలు చేకూర్చడంలో సఫలీకృతుడైనందున జనార్థనరావునే కొన్నాళ్లపాటు కొనసాగించాలని కోరుతూ ఆప్కో ముఖ్య అధికారిని కోరుతూ బోర్డు సభ్యులు గత జూలైలో తీర్మానించారు. ఇందుకు బ్యాంకు చైర్మన్ కూడా అంగీకరించారని సభ్యులు చెబుతున్నారు. ఇప్పుడు ఆయన్ను వెనక్కి పంపించేయాలని ఆదేశిస్తూ ఐదు రోజుల క్రితం లేఖ రావడం, ఆయన స్థానంలో ఎస్.వి.సత్యనారాయణ అనే అధికారిని ఇన్‌చార్జిగా నియమించడం కూడా జరిగిపోయాయి. ఆయన కంటే ముందు వరుసలో ఇద్దరు డీజీఎంలు, ముగ్గురు ఏజీఎంలూ ఉన్నా వారిని కాదని సత్యనారాయణను నియమించడమేమిటని బ్యాంకుకు చెందిన 21మంది డెరైక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

 

 ఏకపక్ష నిర్ణయం

 చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరించి ఇన్‌చార్జి సీఈవోను నియమింపజేశారని ైడె రెక్టర్లు ఆరోపిస్తున్నారు. సభ్యుల అంగీకారం లేకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని చైర్మన్‌ను ప్రశ్నించేందుకు డెరైక్టర్లు సిద్ధమయ్యారు. సూమోటోగా నిర్ణయం తీసుకునే అధికారం చైర్మన్‌కు లేదని, పాత సీఈవో స్థానంలో ఇక్కడే ఉద్యోగం చేస్తున్న దిగువస్థాయి అధికారిని ఎలా నియమిస్తారని, ‘కో ఆపరేటివ్ మేనేజ్‌మెంట్ కమిటీ’కి సంబంధించి ఆయన్ను ప్రశ్నించనున్నామని ‘సాక్షి’తో మాట్లాడుతూ ఓ డెరైక్టర్ చెప్పారు. నాబార్డు నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం వల్ల ఆ సంస్థ నుంచి నిధులొచ్చే అవకాశం లేకుండాపోతుందని వాపోయారు. సర్వీస్ రూల్స్, హెచ్‌ఆర్‌డీ సూచనలే లేకుండా ఇలా చేయడంతో బ్యాంకు కూడా కుదేలైపోయే పరిస్థితి కనిపిస్తుందన్నారు.

 

 సత్సంబంధాల కోసమే..

 ఈ విషయమై డీసీసీబీ చైర్మన్ డోల జగన్‌ను వివరణ కోరగా నాబార్డ్, ఆప్కాబ్ సంస్థలతో సత్సంబంధాల కోసమే అలా చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. నిధుల కోసం తాము ఆయా సంస్థల వెంట పడుతుంటామని, అలాంటప్పుడు ఆప్కాబ్ అధికారుల ఆదేశాల మేరకే సీఈవో జనార్ధన్‌ను మాతృశాఖకు పంపిస్తే తప్పేంటన్నారు. ఆప్కాబ్‌లో బాధ్యతగా పనిచేసే అధికారుల సంఖ్య తక్కువగా ఉందని అందుకే మేనేజర్ స్థాయి ఉన్న జనార్దన్‌ను వెనక్కు పిలిపించుకున్నారన్నారు. బ్యాంకు, ఉద్యోగులు, రైతులు బాగుండాలనే ఉద్దేశంతోనే తాత్కాలికంగా సీఈవోను నియమించామని జగన్ వివరించారు. సీఈవోను తాను రిలీవ్ చేయకపోయినా జనార్థన్ ఆయన అంతట ఆయనే వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారన్నారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top