శేషాచలంలో డి-గ్యాంగ్!

శేషాచలంలో డి-గ్యాంగ్!


ఎర్రచందనం స్మగ్లింగ్‌లో దావూద్ ముఠా హవా 

కీలక ఆధారాన్నిచ్చిన  సీసీఎస్ పోలీసులు


 

 రైల్వేకోడూరు సహా తొమ్మిది గ్రామాల్లో నెట్‌వర్క్

 ఈశాన్య సరిహద్దుల గుండా అక్రమ రవాణా

 ముఠా కోసం ఆంధ్రప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వేట


 

హైదరాబాద్: దుబాయ్‌లో తలదాచుకున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కన్ను శేషాచలం అడవుల్లో లభించే అతి విలువైన ఎర్రచందనంపై పడింది. శేషాచలం అడవుల్లోని తొమ్మిది గ్రామాలతో పాటు కడప జిల్లా రైల్వేకోడూరు, పొరుగున ఉన్న కర్ణాటక సహా వివిధ ప్రాంతాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తన అనుచరుల సహకారంతో సముద్ర మార్గంలో గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనాన్ని దుబాయ్‌కి తరలించేస్తున్నాడు. ఈ నెట్‌వర్క్‌లో భాగమైన ముఠాను హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అందించారు. దీంతో మిగిలిన నిందితుల్ని పట్టుకోవడం కోసం ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ వేట ప్రారంభించింది.



గ్రామీణ యువతకు చోటా భాయ్ గాలం...



దావూద్ ఇబ్రహీం ముఠాలో కీలకమైన వ్యక్తిగా ఉన్న కర్ణాటక వాసి చోటా భాయ్ ఇక్కడి ఎర్రచందనం స్మగ్లింగ్ నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తున్నాడు. శేషాచలం అడవులు విస్తరించి ఉన్న కడప, చిత్తూరు జిల్లాల్లో యువతను ఆకర్షించడం ద్వారా అనేక మందిని ఎంపిక చేసుకున్నాడు. ఈ సభ్యులెవరికీ తాము పని చేస్తున్నది దావూద్ గ్యాంగ్‌లో అనే విషయం తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు.



విహారయాత్రల ముసుగులో...



శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని తమిళనాడుకు చెందిన కూలీలతో నరికిస్తున్న ముఠా సభ్యులు వాటిని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల వద్ద నిర్ణీత కాలం భద్రపరుస్తున్నారు. ఆపై వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలకు లోనైన వాహనాలను మారు పేర్లతో కొనుగోలు చేయడంతో పాటు చోరీ వాహనాలను సేకరించి అక్రమ రవాణాకు వినియోగిస్తున్నారు. ఈ వాహనాల్లో ఎక్కువగా తమ వల్లో పడిన విద్యాధికులు, విద్యార్థులను ఉంచి, విహారయాత్రకు వెళ్తున్న ముసుగులో రోడ్డు మార్గంలో అనంతపురం మీదుగా కర్ణాటకలోకి కోలార్, చిత్తూరు మీదుగా తమిళనాడులోని మధురై ప్రాంతాలకు తరలిస్తున్నారు. మార్గమధ్యంలో పోలీసు తని ఖీలు ఎదురైతే వాహనాల్లోని వారు వాటిని వదిలి పారిపోయినా ద ర్యాప్తులో ఎలాంటి ఆధారాలు చిక్కకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటిలోని విద్యార్థులు పట్టుబడినా లింకు అక్కడితో తెగిపోవడంతో దర్యాప్తు ముందుకు సాగకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.



స్క్రాప్‌తో పాటు ఎర్రచందనం రవాణా...



రోడ్డు మార్గంలో ఎర్రచందనం లోడుతో వెళ్తున్న వాహనాలకు కాస్త ముందో, వెనుకో ముఠాకు చెందిన వ్యక్తులు ద్విచక్రవాహనాలు, కార్లలో వెళ్తుంటారు. వివిధ విభాగాలకు చెందిన చెక్‌పోస్టులతో పాటు హైవే పెట్రోలింగ్ సిబ్బందినీ లోబరుచుకుని, వారికి భారీ మొత్తం చెల్లిస్తూ ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎర్రచందనాన్ని కర్ణాటకలోని మంగుళూరు, తమిళనాడులోని వీఓసీ పోర్టులకు తరలిస్తున్నారు. ఓడల్లో ఎర్రచందనాన్ని దుబాయ్‌కు పంపిచేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం దుబాయ్ కేంద్రంగా పని చేస్తున్న దావూద్ ప్రధాన అనుచరుడు బడా భాయ్ ఈ పోర్టుతో పాటు నేపాల్, బర్మా, ఈశాన్య రాష్ట్రాల మీదుగానూ ఎర్రచందనాన్ని అక్కడకు రప్పిస్తున్నాడు. కాగా, చోటా భాయ్, అతని అనుచరులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని కర్ణాటక పంపాలని పోలీసుఅధికారులు నిర్ణయించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top