లిఫ్ట్ ఇచ్చిన పాపానికి..


 కొత్తవలస: తెలిసిన వ్యక్తే కదా అని కారు ఆపి లిఫ్ట్ ఇచ్చిన పాపానికి కారులో ఎక్కిన వ్యక్తే  పౌల్ట్రీవ్యాపారి గొంతుకోసి రూ.రెండు లక్షల 50వేలతో పరారయ్యాడు.  ఇందుకు సంబంధించి కొత్తవలస ఎస్సై ఎస్.ధనుంజయరావు బుధవారం విలేకరులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖజిల్లా సబ్బవరం మండలం గుల్లిపల్లి గ్రామానికి చెందిన దాసరి వెంకటసత్యనారాయణ (47)అలియాస్ గుల్లిపల్లి వెంకటరావు, కొత్తవలస మండలం లోని నిమ్మలపాలెం గ్రామంలో కోళ్లఫారంతోపాటు స్టాక్‌పాయింట్ నిర్వహిస్తున్నారు. ఈ స్టాక్‌పాయింట్‌నుంచి కొత్తవలస ప్రాంతంలో చికెన్ సెంటర్లకు కోళ్లు పంపిణీచేసి వారంలో మూడుపర్యాయాలు వసూళ్లకు వచ్చి తిరిగి గుల్లిపల్లి వెళ్తుంటారు. మంగళవారం యథావిధిగా తన డస్టర్ వాహనంలో వసూళ్లకు వచ్చి రాత్రి పదిగంటల సమయంలో ఇంటికి వెళ్తుండగా  నిమ్మలపాలెం గ్రామానికి చెందిన నాయుడు రైల్వేగేట్ సమీపంలో సబ్బవరంరోడ్డులో ఉండి లిఫ్ట్ అడిగాడు.

 

 పాతపరిచయం ఉన్న వ్యక్తి అడగడంతో అతనిని కారులో ఎక్కించుకున్నారు. మండలంలోని సంతపాలెం పంచాయతీ శివారు రెల్లి కాలనీ దాటగానే కానావద్ద కారు స్లోచేసే సమయంలో నాయుడు వెనుకనుంచి ఒక్కసారిగా పదునైన ఆయుధంతో వ్యాపారి గొంతుకోశాడు. దీంతో  రక్తం కారడంతో అయోమయానికి గురైన యజమాని తనను చంపవద్దని అవసరమైతే డబ్బులు తీసుకుని వదిలిపెట్టాలని ప్రాథేయపడినా డ్రైవర్ వినకుండా చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆ మార్గంలో ఫస్ట్‌షో సినిమాకు వెళ్లివచ్చే వాహనాలు తిరుగుతుండడంతో డ్రైవర్ కాస్త ఆలోచనలో పడ్డాడు. ఇదే అదునుగా వ్యాపారి మెల్లగా కారుడోరుతీసుకుని సమీపంలో ఉన్న తుప్పల్లోకి పరుగు తీసి  దాగున్నాడని  ఎస్సై తెలిపారు. దీంతో కారులోఉన్న డబ్బుతో సహా కారుతో నాయుడు ఉడాయించాడు.

 

 బాధిత వ్యాపారి సమీపంలో ఉన్న ఇళ్లకు వెళ్లి విషయం చెప్పడంతో వెంటనే 108 వాహనంలో విశాఖ కేర్‌ఆస్పత్రికి పంపించారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో బాధిత వ్యాపారి మేనల్లుడు శేఖర్ ఫిర్యాదుమేరకు కొత్తవలస ఎస్సై ఎస్.ధనుంజయరావు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యాయత్నానికి పాల్పడిన నాయుడు కారుతోసహా విశాఖజిల్లా కె.కోటపాడు మండలం పిండ్రంగి గ్రామంలో ఉన్న అత్తవారింటికి వెళ్లి  అక్కడ కారు వదిలి పరారవడంతో విషయం తెలిసిన కె.కోటపాడు పోలీసులు కారును స్వాధీనం చేసుకుని కొత్తవలస పోలీసులకు తెలియపరిచారు.  ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్ బుధవారం మధ్యాహ్నం  పిండ్రంగివెళ్లి నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తికి లిఫ్టు ఇచ్చిన పాపానికి ప్రాణాలమీదకు వచ్చిందని వ్యాపారి బంధువులు రోదించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top