పంటల బీమాకు మాఫీ గండం!

పంటల బీమాకు మాఫీ గండం! - Sakshi


ప్రభుత్వ విధానాలతో అన్నదాతకు నష్టం

ఇంకా మాఫీ కాని పాత రుణాలు

కొత్త రుణాలివ్వని బ్యాంకులు

రైతులు ప్రీమియం చెల్లిస్తేనే బీమా వర్తింపు

నేటితో గడువు పూర్తి

 పిట్టలవానిపాలెం: టీడీపీ ప్రభుత్వ విధానాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. రుణ మాఫీపై అనుసరిస్తున్న కప్పదాటు వైఖరి పంటల బీమాపై ధీమా లేకుండా చేస్తోంది. రైతులు తీసుకున్న పంట రుణాలు ఇంకా మాఫీ కాకపోవటం, ఆ బకారుులను లబ్ధిదారులు చెల్లించకపోవటంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదు. దీంతో ఖరీఫ్ పంటలకు బీమా వర్తించే అవకాశం లేకుండా పోతోంది. పంట బీమా కావాలంటే రైతులే సొంతంగా ప్రీమియం చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి ఈ నెల 31 చివరి తేదీకావటంతో అంతా ఆందోళన చెందుతున్నారు.

 

ఇదీ సంగతి..

ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టపోయే రైతులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని ప్రవేశ పెట్టింది. బ్యాంకు రుణం తీసుకున్నవారికి ఈ పథకం దానంతటదే వర్తిస్తుంది. బ్యాంకు రుణం తీసుకోని పక్షంలో రైతు సొంతంగా ప్రీమియం చెల్లించాలి. పంట సాగుకు ముందే ప్రీమియం చెల్లించాల్సి ఉండటంతో చాలామంది రైతులు సొంతంగా చెల్లించటానికి ముందుకు రావటం లేదు.

     

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పంట రుణాలు మాఫీ చేస్తున్నట్టు టీడీ పీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రైతులు బ్యాంకులకు బకాయిలు చెల్లించలేదు. రుణ మాఫీపై ఎలాంటి ఉత్తర్వులు అందకపోవటంతో బకాయిలున్న రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వటం లేదు. దీంతో పంటల బీమా పథకం వర్తించే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం ఖరీఫ్ సాగు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పంట పెట్టుబడుల కోసం రైతులు నానాపాట్లూ పడుతున్నారు. ఈ పరిస్థితిలో సొంతంగా బీమా ప్రీమియం చెల్లించటం వారికి భారంగా పరిణమిస్తోంది.



అటు టీడీపీ ప్రభుత్వ విధానాలు, ఇటు తీవ్ర వర్షాభావం కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయే పరిస్థితి నెలకొంది. వాస్తవానికి పంటల బీమా పథకం ప్రీమియం చెల్లింపునకు జూలై 30 వరకే గడువు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించారు. తాజాగా మరోసారి పొడిగిస్తారని వార్తలు వస్తున్నప్పటికీ రైతులు జాగ్రత్త పడాలని వ్యవసాయశాఖ  అధికారులు స్పష్టం చేస్తున్నారు. వెంటనే ప్రీమియం చెల్లించాలని సూచిస్తున్నారు.

 

కౌలు రైతుల పరిస్థితి దయనీయం

బీమా పథకం వర్తింపు విషయంలో కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయూరైంది. రెవెన్యూ అధికారులు రుణ అర్హత కార్డులు ఇస్తేనే బీమా ప్రీమియం చెల్లించేందుకు వారికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇంతవరకు రుణ అర్హత కార్డులు మంజూరు చేయలేదు. ఫలితంగా కౌలు రైతులు సొంతంగా ప్రీమియం చెల్లించాలనుకున్నా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top