నేతల కనుసన్నల్లో... తమ్ముళ్ల దందా

నేతల కనుసన్నల్లో... తమ్ముళ్ల దందా - Sakshi


ఇసుక దందా నుంచి భూ కబ్జా వరకు..

అన్నీ వారి కనుసన్నల్లోనే.. ప్రతి పనికీ ఓ రేటు

మాట వినని అధికారులపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం


 

జిల్లాలో తెలుగు తమ్ముళ్లు చెలరేగుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు, కొందరు ముఖ్య   నేతలు పైరవీలు సాగిస్తున్నారు. ఇసుక దందా నుంచి స్థలాల కబ్జా వరకు అన్నీ తమ కనుసన్నల్లోనే జరిగేలా చూస్తున్నారు. అలా జరిగేలా సహకరించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రజాప్రతినిధులతో సమీక్ష  సమావేశాలు పెట్టించి మరీ మాటవినని అధికారులను బెదిరిస్తున్నారు.     

 

విజయవాడ : మైలవరం నియోజకవర్గంలోని పొందుగల, మైలవరానికి చెందిన ఇద్దరు నాయకులు జిల్లాకు చెందిన ఓ కీలక మంత్రి అండ చూసుకుని చెలరేగుతున్నారు. పొందుగల చెరువు పూడిక పనుల్లో రూ.40 లక్షలు, చంద్రాల చెరువు పనుల్లో రూ.70 లక్షల విలువైన మట్టిని ఇటుక బట్టీలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. నీరు చెట్టు కింద రూ.80 లక్షల విలువైన మట్టిని విక్రయించారు. అధికారులు ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తే తాము చెప్పినట్టే మంత్రి చేస్తారంటూ బెదిరిస్తున్నారు.

 

పెడన మండలం మడక గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు పెడన తోటమూలలో కోటి రూపాయల విలువ చేసే ప్రయివేట్ స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా వేసి విక్రయించాడు. తన వెనుక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఉన్నారంటూ సదరు తమ్ముడు బాధితులను బెదిరిస్తున్నారు.



మండల నిధులు దోపిడీ

 పెనమలూరు మండలంలో నియోజకవర్గ ముఖ్య నేత అనుచరులు మండలపరిషత్ నిధులు కోటి రూపాయల పనులు పంచుకున్నారు. నామినేషన్ పద్ధతిలో గ్రావెల్ రోడ్ల పనులు తీసుకొని మట్టిపోసి డబ్బులు పోగేసుకున్నారు.



పెత్తనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే

తిరువూరు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ మాజీ ఎమ్మెల్యేకు మంత్రి అండగా ఉన్నారు. అధికారుల బదిలీలు, విద్యుత్ సబ్ స్టేషన్లలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని కొందరు అధికార పార్టీకి చెందిన వారు రూ.లక్షలు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  



కాకిరాయి కోసం...

 జగ్గయ్యపేట నియోజకవర్గంలో కీలక ఇద్దరు ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రి అండతో వారి అనుచరులు దోపిడీకి తెరతీశారు. కాకిరాయి అనుమతులకోసం కొందరు తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు.  



 సెంట్రల్‌లో పెరిగిన దౌర్జన్యాలు

 సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పేరు చెప్పి కొందరు తెలుగుతమ్ముళ్లు చెలరేగి పోతున్నారు. సత్యనారాయణపురానికి చెందిన అధికార పార్టీ నాయకుడొకరు పోలీసుల అండతో కొన్నేళ్లుగా వివాదాస్పదంగా ఉన్న ఓ టైలరింగ్ షాపును తన అనుచరులతో దౌర్జన్యంగా ఇటీవల ఖాళీ చేయించారు. సత్యనారాయణపురం శివాలయం వీధిలోని కల్యాణమండపాన్ని కీలక నేతే ఆక్రమించే ప్రయత్నం చేశారనే ఆరోపణలు వచ్చాయి. భువనేశ్వరి పీఠానికి చెందిన ఈ కల్యాణ మండపాన్ని దేవాదాయశాఖకు అప్పగించారు. దీనిని వ్యతిరేకిస్తూ బ్రాహ్మణసంఘం నాయకులు ఎమ్మెల్యే బొండా ఉమాను కలిశారు. పీఠానికి ఉంచేందుకు అర్హతలు ఏమున్నాయో వివరిస్తే మంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా సమస్యకు పరిష్కారం లభించలేదు. బందరు రోడ్డులోని బ్రిటీష్ కాలంనాటి శ్మశాన వాటిక స్థలాన్ని కబ్జాచేసేందుకు కార్పొరేటర్లు కొందరు యత్నించారు. పాయకాపురంలోని వైఎస్సార్ స్మృతి వనం ఉన్న చెరువును ఆక్రమించి ప్లాట్లుగా వేయాలని కొందరు కార్పొరేటర్లు ప్రయత్నించారు. కోర్టు కేసుల్లో ఉన్న బిల్డింగ్‌లు, షాపులు ఖాళీ చేయించడం వంటి సెటిల్‌మెంట్లు బాగా పెరిగాయి. ఎమ్మెల్యే తనయుడు తన పుట్టిన రోజు సందర్భంగా అత్యంత రద్దీగా ఉండే బందరు రోడ్డులో నిబంధనలను బేఖాతరుచేసి ర్యాలీ నిర్వహించడం వివాదాస్పదమైంది. మరో కుమారుడు జాతీయ రహదారిపై కారు రేసు నిర్వహించి అమాయకుడి ప్రాణాలు బలితీసుకున్నాడు.

 

 అక్రమ మైనింగ్

 కైకలూరు నియోజకవర్గంలోని వేమవరప్పాడు గ్రామంలో మండవల్లి మండలానికి చెందిన ఒక నాయకుడు అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నాడు. అతనికి పార్లమెంటరీ నియోజకవర్గ నేత అండగా ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి, పొరుగు జిల్లా ఎంపీ అండతో కొందరు తమ్ముళ్ల ఆటపాక పక్షుల చెరువులో చేపలను పట్టి విక్రయించారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top