డామిట్.. కిడ్నాప్ అడ్డం తిరిగింది

డామిట్.. కిడ్నాప్ అడ్డం తిరిగింది


విజయవాడ సిటీ: ‘ఓ జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడికి ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. పరిచయాన్ని కాస్తా స్నేహంగా మార్చుకున్నాడు. ఆమె ఆస్తి అమ్ముతుందని తెలుసుకొని డబ్బు గుంజేందుకు..ఆమె కొడుకును కిడ్నాపునకు తెరలేపాడు. తన వద్ద పని చేసే యువకుని ద్వారా ఇద్దరు యువకులను ఏర్పాటు చేసుకొని ఆమె కొడుకును కిడ్నాపు చేసి ఓ ఇంట్లో బంధించాడు.  కిడ్నాపు చేసినట్టు ఫోన్ చేయడంతో పోలీసుల సాయంతో ఆమె తన కొడుకును రక్షించుకుంది.



పెనమలూరు మండలంలో కలకలం రేపిన బాలుని కిడ్నాపు వివరాలను శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు వివరించారు. మండలంలోని గంగూరు గ్రామానికి చెందిన భాష్యం రాధిక భర్తకు దూరంగా ఉంటూ ఎనిమిదేళ్ల తన కుమారుడు శ్రీ నిఖిల్‌ను ఇదే ప్రాంతంలోని పాఠశాలలో చదివిస్తోంది.



ఈ నెల 22న పాఠశాలకు వెళ్లిన బాబు రాత్రి 7.30 గంటల వరకు కూడా రాకపోవడంతో పాఠశాల నిర్వహకులను ఆరా తీసింది. బాబు పాఠశాల నుంచి బయటకు వచ్చినట్టు తెలుసుకొని చుట్టుపక్కల విచారించగా ఫలితం లేదు. రాత్రి 9.30గంటల సమయంలో బాబు తమ వద్ద ఉన్నట్టు చెప్పిన ఆగంతకులు డబ్బు ఎంతనేది మళ్లీ చెపుతామంటూ ఫోన్ పెట్టేశారు. ఆందోళనకు లోనైన ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈస్ట్‌జోన్ ఎసీపీ కె.మహేశ్వరరాజు నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి కృష్ణలంకలోని ఓ ఇంట్లో ఉంచిన బాబును క్షేమంగా విడిపించి తల్లికి అప్పగించారు.

 

పరిచయస్తులే..



నిందితులు నలుగురూ రాధికకు పరిచయస్తులే. గుంటూ రు జిల్లా ఉండవల్లికి చెందిన జాబ్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు రాయి రత్నసతీష్‌తో ఆమె సోదరి ఉద్యోగ విషయమై సంప్రదించగా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది.

 

ఇటీవల ఆమె ఆస్తి అమ్ముతుందని తెలిసి తన వద్ద పని చేసే అబ్దుల్ రషీద్‌తో కలిసి డబ్బు గుంజాలని పథకం పన్నాడు. గతంలో ఆమె వద్ద కూడా పని చేసిన రషీద్ సరేననడంతో బాలుడి కిడ్నాపుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు గంగూరుకు చెందిన బండారి నాగేంద్రబాబు, కృష్ణలంకకు చెందిన గాజా జగదీష్ సాయం తీసుకున్నారు. వీరు నలుగురూ ఆమెకు ఎప్పటి నుంచో పరిచయస్తులే.

 

పట్టుబడిందిలా..



ఆగంతకుల ఫోన్ కోసం అర్థరాత్రి వరకు వేచి చూసిన పోలీసులు..ఆమెను విచారించి పరిచయస్తుల వివరాలు సేకరించి ఆరా తీశారు. ఈ క్రమంలో  యనమలకుదురులో ఉన్న నాగేంద్ర, జగదీష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన ఇద్దరు కిడ్నాపర్లు పట్టుబడ్డారు.

 

నేటి నుంచి శోధన ప్రారంభం



రాజధాని నగర పోలీసింగ్‌ను దృష్టిలో ఉంచుకొని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నట్టు పోలీసు కమిషనర్ చెప్పారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన శోధన(ఇంటి వద్దకే ఎఫ్‌ఐఆర్) పని శనివారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. 24గంటల పాటు అందుబాటులో ఉండేలా మూడు డివిజన్లకు మూడు శోధన వాహనాలు కేటాయించామన్నారు. ఇందుకు అవసరమైన సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చి నియమించామన్నారు. కేసు తీవ్రతను బట్టి ఈ వాహనాలు పంపుతామని తెలిపారు. దోపిడీలు, మహిళలు, వృద్ధులు, పిల్లల సంబంధిత నేరాలతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయాల్లో ఈ వాహనాలు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా వాహనాల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.

 

రిసెప్షన్ కేంద్రాలకు స్పందన

 

పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రాలకు స్పందన బాగుందని సీపీ తెలిపారు. గతంలో కొన్ని కేసులు స్టేషన్ అధికారి దృష్టికే వచ్చేవి కావని, మంచి సిబ్బంది అధికారులు ఉంటే సాధారణ కేసుల పరిష్కారంపై దృష్టిసారించేవారన్నారు. ఈ విధానం వలన అలాంటివి చోటు చేసుకోవని, స్టేషన్ అధికారితో పాటు ఆపై అధికారులకు వెంటనే స్టేషన్‌కి వచ్చే ఫిర్యాదులు సంక్షిప్త సందేశం

(యస్‌యంయస్)  ద్వారా తెలుస్తాయని చెప్పారు. తద్వారా స్టేషన్ అధికారులకు సిబ్బందిపై పట్టు వస్తుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన హోంగార్డులు పని చేస్తున్నారని, వీరంతా నగర పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో పని చేస్తున్నందున ఎవరికీ భయపడాల్సిన పని లేదన్నారు. వచ్చిన పిర్యాదులు నమోదు కాకుంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా కమిషనర్ హెచ్చరించారు. పని విభజన వలన మంచి ఫలితాలు వస్తాయనేందుకు ఇదో నిదర్శనమని, సిసియస్(సెంట్రల్ క్రైం స్టేషన్) ఫలితాలను మరో రెండు నెలల్లో అద్భుతంగా ఉంటాయన్నారు.

 

పోలీసు మిత్ర ఏర్పాటు

 

తీరిక వేళల్లో పోలీసు విధుల్లో సాయం చేసేందుకు ముందుకు వచ్చే రిటైర్డు ఉద్యోగులు, ఇతర సామాజిక కార్యకర్తలతో పోలీసు మిత్ర ఏర్పాటు చేయనున్మాన్నారు. ఆసక్తి కలిగిన వారు తమను సంప్రదిస్తే రిసెప్షన్ కేంద్రాలు, ట్రాఫిక్ నియంత్రణ, రాత్రి గస్తీ, ఇతర కేసులు నమోదు చేయదగినవి కాని విధులు అప్పగిస్తామన్నారు. ముందుగా వారు తాము కేటాయించగలిగిన సమయాలను పేర్కొంటే

 పోలీసులకు విధుల కేటాయింపులో మార్పులు, చేర్పులు  చేస్తామన్నారు. వీరి పనితీరును కొద్ది రోజులు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తామన్నారు.  పోలీసు విధుల్లో ప్రజలను భాగస్వాములను చేయడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు.

 

రక్షణ చర్యలు తీసుకోకుంటే క్రిమినల్ కేసు



రోజువారీ కూలీలతో పని చేయించుకునేవారు పని చేయించుకునే ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టని యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పోలీసు కమిషనర్ హెచ్చరించారు. ఇటీవల కొన్ని ప్రమాదాలపై దృష్టి పెట్టగా యాజమాన్యాల నిర్లక్ష్యమే వారి మృతికి కారణంగా వెల్లడైందన్నారు. ఇలాంటి మరణాలపై ఇప్పటి వరకు 304ఎ(ప్రమాదవశాత్తు మృతి) కింద కేసు పెడుతున్నామని, ఇకపై 304(కల్పబుల్ హోమీసైడ్) కింద హత్య కేసు నమోదు చేస్తామన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని యాజమాన్యాలు వ్యవహరించాలని పోలీసు కమిషనర్ హితవు పలికారు.

 

పగటి దొంగల అరెస్టు




పట్టపగలు తాళం వేసి ఉన్న ఇళ్లను గొల్లగొట్టే ముగ్గురు సభ్యుల ముఠాను సెంట్రల్ క్రైం స్టేషన్(సిసియస్) పోలీసులు అరెస్టు చేశారు. చోరీలకు సూత్రధారి బాలుడు కావడంతో బాలల పరిశీలనా ఆవాస గృహానికి తరలించారు. సీపీ తెలిపిన వివరాల ప్రకారం..పాయకాపురంలోని ప్రకాష్‌నగర్‌కి చెందిన బాలుడు వ్యసనాలకు లోనై అవసరమైన డబ్బు కోసం పగటి చోరీలను ఎంచుకున్నాడు. ఇందుకు పరిచయస్తులు డాకుపాటి వెంకటేష్(20), కుమ్మా దుర్గారావు(19)తో కలిసి ముఠా కట్టాడు. అజిత్‌సింగ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో మూడు చోరీలకు పాల్పడిన వీరిని నగర పోలీసు కమిషనర్ సూచనల మేరకు క్లూస్ టీమ్ ఇన్‌స్పెక్టర్ ఎ.ప్రసాదరావు సహకారంతో సిసియస్ ఎస్‌ఐ యం.వి.శ్యామలరావు అరెస్టు చేశారు.  నిందితుల నుంచి 6.53గ్రాముల బంగారం, 12.5 తులాల వెండి, కెమెరా, టీవీతో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో పోయిన సొత్తుకంటే ఎక్కువ మొత్తం చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారని, ఇలా చేయడం మంచిది కాదని సీపీ హితవు పలికారు.

 

పోలీసు వెబ్‌సైట్ ఆధునీకరణ



ఆధునీకరించిన పోలీసు వెబ్‌సైట్ వారం రోజుల్లో అందుబాటులోకి వస్తుందని పోలీసు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు నగరానికి చెందిన స్వయం ఐటీసొల్యూషన్స్ సహకారం తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజధాని పరిసర గ్రామాలకు చెందిన అనేకమంది విదేశాల్లో ఉంటున్నారని చెప్పారు. వీరు ఇక్కడి తమ వారి క్షేమం, ఆస్తుల పరిరక్షణ వంటి అంశాల్లో ఆందోళనకు గురవుతుంటారని, ఇక్కడి విషయాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పెట్టడం వలన వారిలో ఆందోళన తొలగించవచ్చని కమిషనర్ తెలిపారు. సామాజిక కార్యక్రమాలపై ఆసక్తి కలిగిన ఎన్‌ఆర్‌ఐలను గుర్తించి ఇక్కడ మంచి ప్రాజెక్టుల్లో భాగస్వాములను చేసేందుకు వెబ్‌సైట్ ఉపయోగపడుతుందన్నారు. ఒలింపిక్ పతకం సాధించేందుకు ఓల్గా ఆర్చరీ నిర్వాహకులు రూ.కోటి అడిగారని, ఎన్‌ఆర్‌ఐలను సంప్రదించి సమకూర్చితే పతకం సాధించవచ్చన్నారు. విలేకరుల సమావేశంలో డీసీపీ (పరిపాలన) జి.వి.జి.అశోక్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

ముగ్గురు మృతికి కారకుడైన డ్రైవర్ లొంగుబాటు



రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతికి కారకుడైన డ్రైవర్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు ఛేదనలో పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైన స్థితిలో..నిజాయితీగా లొంగిపోయి నేరం అంగీకరించిన డ్రైవర్‌ను శుక్రవారం విలేకరుల సమావేశంలో పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావు అభినందించారు. గత నెల 14వ తేదీన గుణదలకు చెందిన శీలం సువర్ణరాజు భార్య జ్యోతి, కుమార్తె భవ్యశ్రీ(14)తో కలిసి శుభలేఖలు పంచేందుకు మోటారు సైకిల్‌పై గుడివాడ వెళుతూ ఉదయం 5.30గంటల సమయంలో మానికొండ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కేసు దర్యాప్తులో పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన టాటా ఏసీ డ్రైవర్ చింతా శ్రీనివాసరావు ప్రమాదానికి తానే కారణమంటూ లొంగిపోయాడు. బస్సును క్రాస్ చేసే క్రమంలో వారు ముందుకు రాగా చేపల లోడ్‌తో ఉన్న ఆటో అదుపు తప్పి వారిని ఢీకొందని డ్రైవర్ చెప్పాడు. భయంతో పరారైన తాను ముగ్గురు మృతి చెందారని తెలుసుకొని కలత చెంది పోలీసులకు లొంగిపోయానన్నారు. నిజాయితీకి పేద, ధనిక వ్యత్యాసం లేదనడానికి శ్రీనివాసరావు లొంగుబాటే కారణమని పోలీసు కమిషనర్ వ్యాఖ్యానించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top