గందరగోళం


2013-14 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీలకు నామమాత్రంగా అందిన రుణాలు

 కడప రూరల్ : జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత వర్గాలకు అందాల్సిన రుణాల పరిస్థితి దారుణంగా తయారైంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన లక్ష్యాలు నామమాత్రంగానైనా పూర్తికాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 2014-15 ఆర్థిక సంవత్సరానికి తాత్కాలిక రుణ ప్రణాళిక లక్ష్యాలను కేటాయించి గందరగోళంలో పడేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి నాటి రాష్ట్ర ప్రభుత్వం 1284 యూనిట్లను 2437 మంది అర్హులకు అందజేయాలని, అందుకోసం మొత్తం రూ.11.23కోట్లు సబ్సిడీని కేటాయించాలనే లక్ష్యాలను విధించింది.



అయితే ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి రూ.3.96కోట్ల సబ్సిడీ రావడంతో కేవలం 565 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో నాటి ప్రభుత్వం లక్ష్యాలు, సబ్సిడీలను ఆర్భాటంగా కేటాయించింది. అంతలోనే ఎన్నికలు రావడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ రుణాల పరిస్థితి అలాగే ఉండిపోయింది. అయితే ఇంతవరకు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన లబ్ధిదారుల సబ్సిడీ కేటాయింపుల గురించి ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోలేదు.

 

2014-15కు కొత్త లక్ష్యాలు

ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 2014-15 ఆర్థిక సంవత్సరానికి ఎస్సీ కార్పొరేషన్‌కు కొత్తగా తాత్కాలిక రుణ ప్రణాళికలను నిర్దేశించింది. ఆ మేరకు 2303 యూనిట్లను 2545 మంది లబ్ధిదారుల రుణాలకు రూ.12.73 కోట్ల సబ్సిడీ లక్ష్యాలను నిర్దేశించింది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలను వెలువరించలేదు. కేవలం యూనిట్లు, లబ్ధిదారుల సంఖ్యను మాత్రమే ప్రభుత్వం తెలిపింది. ఆ ప్రకారం అర్హులకు ఏ యూనిట్లను అందజేస్తే బాగుంటుందో ప్రణాళికలు రూపొందించాలని ఆ శాఖను ఆదేశించింది.



ఆ మేరకు అధికారులు పథకాలను సిద్ధం చేశారు. 2013-14కు సంబంధించిన రుణ లక్ష్యాలు పూర్తికాకపోవడం, అంతలోనే 2014-15 సంవత్సరానికి ప్రభుత్వం తాత్కాలిక రుణ ప్రణాళికను కేటాయించడం అయోమయానికి గురిచేసింది. 2013-14లో నాటి ప్రభుత్వం రుణాల మంజూరు కోసం డిసెంబర్ 31వ తేదీన 101 జీఓను తెచ్చింది. ఆ జీఓ ప్రకారం అర్హత సాధించడానికి లబ్ధిదారులు నానా అవస్థలు పడ్డారు. ఎలాగోలా బ్యాంకుల నుంచి రుణ మంజూరు పత్రాలను తెప్పించుకొని రుణాలకు అన్ని అర్హతలను సాధించారు. అయితే సబ్సిడీ నిధులు మంజూరుకాకపోవడంతో నామమాత్రంగా అర్హులు లబ్ధి పొందారు.



ఇక 2014-15కు ప్రభుత్వం తాత్కాలిక రుణ ప్రణాళికను నిర్దేశించింది. అదే తరుణంలో ప్రభుత్వం గడిచిన ఆర్థిక సంవత్సరంలో మిగిలిన లబ్ధిదారుల రుణాల గురించి ఎలాంటి సమాచారం ఇంతవరకు తెలుపలేదు. తాజాగా నిర్దేశించిన తాత్కాలిక రుణ ప్రణాళిక గురించి కూడా ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ఏవిధంగా స్పందించి అర్హులైన దళిత వర్గాలను ఆదుకుంటుందోనని అందరూ ఎదురుచూస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top