భగ్గుమన్న దళితులు

భగ్గుమన్న  దళితులు


 పలుచోట్ల సీఎం దిష్టిబొమ్మల దహనం

 ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు

 చంద్రబాబుపై చర్యలు కోరుతూ

  కొవ్వూరు, ఆచంట పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు


 

 సాక్షి ప్రతినిధి, ఏలూరు :  ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో జిల్లాలోని దళిత వర్గాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు జాత్యాంహకారానికి ఆ వ్యాఖ్యలు నిదర్శనమని దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు. అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాలను ఏలవచ్చనుకుంటారు’ అని సోమవారం విజయవాడలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర దుమారం  లేపాయి. పార్టీలు, రాజకీయాలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. దళిత నేతలైతే చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. మంగళవారం పాలకొల్లులో గాంధీబొమ్మల సెంటర్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చెల్లెం ఆనంద్‌ప్రకాష్ ఆధ్వర్యంలో, టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్), నరసాపురంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 

 ధర్నాలతో దద్దరిల్లిన జిల్లా

 దళిత నేతలు సీఎం వైఖరిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఎక్కడికక్కడ ధర్నాలు చేపట్టారు. దళితలను కించపరిచేవిధంగా, వారి మనోభావాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడిన సీఎం తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ గోపుల పురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో నల్లజర్ల మం డ లం పోతవరంలో ధర్నా చేపట్టారు. అంబేద్కర్ విగ్రహం వద్ద భారీస్థాయిలో దళిత యువకులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు మిన్నంటించారు. చంద్రబాబు వెంటనే బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పాలని తలారి డిమాం డ్ చేశారు. మాల మహానాడు రాష్ర్ట సమన్వయకర్త నల్లి రాజేష్ ఆధ్వర్యంలో పాలకొల్లులో ధర్నా చేపట్టారు.

 

 చంద్రబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ దారా లక్ష్మీగణేష్ అనే యువకుడు శిరోముండనం చేయించుకున్నారు. నిడదవోలులో తహసిల్దార్ కార్యాలయం ఎదుట దళిత మహాసభ రాష్ట్ర కన్వీనర్ పిల్లి డేవిడ్‌కుమార్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. చంద్రబాబు వెంటనే సీఎం పదవి నుంచి వైదొలగాలని, దళితులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్‌కు లేఖ అందజేశారు.  ఆ లేఖ కాపీలను గవర్నర్ నరసింహన్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపారు. చంద్రబాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని  వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి విజయ్‌రావు, ఎమ్మార్పీఎస్ నేత ఆరుగొల్లు చినబాబు కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దళితులను కించపరిచే విధంగా, దళితుల మనోభావాలు గాయపరిచే విధంగా అహంకారపూరితంగా మాట్లాడిన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చే యాలని వారు డిమాండ్ చేశారు. బాబుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి, అంబేద్కర్ యువసేన అధ్యక్షుడు సుంకర సీతారామ్ ఆచంట పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు.

 

 మొదటి నుంచీ దళిత వ్యతిరేకే : మోషేన్‌రాజు

 సీఎం చంద్రబాబు మొదటి నుంచీ దళిత వ్యతిరేకేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొయ్యే మోషేన్‌రాజు విమర్శించారు. కులాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయంగా వాడుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ధ్వజమెత్తారు. గతంలో కారంచేడు, చుండూరు ఘటనలు బాబు ప్రోద్బలంతో జరిగినవేనని గుర్తు చేశారు. అన్నదమ్ముల్లా కలిసుండే మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిన బాబు ఇప్పుడు కాపులు, బీసీల మధ్య రగడ సృష్టించారని నిందించారు. తాజాగా ఎస్సీల మనోభావాలను కూడా దెబ్బతీసే విధంగా మాట్లాడి అందరి మధ్య అంతరం సృష్టించాలని బాబు పెద్ద కుట్ర పన్నుతున్నారని నిందించారు. రాజ్యాంగపరమైన సీఎం పదవిలో ఉన్న ఆయన  కులాల ప్రస్తావన తీసుకురావడం దారుణమని, అలా మాట్లాడటం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. వెంటనే ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ 1989, 3 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

 

 ఎస్సీగా పుట్టినందుకు గర్విస్తున్నాం : ముప్పిడి

 ఎస్సీగా పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ముఖ్యమంత్రి  జాత్యాంహకారంతో మాట్లాడుతున్నారని, కానీ.. తాను ఎస్సీగా పుట్టినందుకు గర్విస్తున్నానని వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి ముప్పిడి సంపత్‌కుమార్ అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక వర్గంలో పుట్టడం కంటే అదృష్టం ఏముంటుందని అన్నారు. వివక్షాపూరిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు వెంటనే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

 

 బాబుకు మతిభ్రమించింది : వనిత

 చంద్రబాబుకు మతిభ్రమించి అటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత ధ్వజమెత్తారు. కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవడం బాబుకు మొదటి నుంచీ అలవాటేనని ఆమె విమర్శించారు. బాబు వెంటనే తన వ్యాఖ్యలకు బేషరతుగా దళిత జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top