2019 నాటికి రాష్ట్రంలో బలమైన శక్తిగా బీజేపీ


కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి

 

 కడప రూరల్ : రాష్ట్రంలో 2019 నాటికి బీజేపీ బలమైన శక్తిగా అవతరిస్తుందని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరగదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా బుధవారం కడపలో ‘జన కళ్యాణ్ పర్వ్’ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కేంద్ర సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.



ఇప్పటి వరకు కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి రూ.8 వేల కోట్లకు పైగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ఇటీవల పోలవరానికి రూ.900 కోట్లు మంజూరు చేసిందన్నారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ఏర్పాటుకు చొరవ చూపడంతో పాటు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. కొంత మంది బీజేపీపై దుష్ర్పచారం చేస్తున్నారని, అలాంటి వారి ఆరోపణలకు అడ్డుకట్ట వేయాలన్నారు. మోదీ తీరు వల్ల దేశానికి అంతర్జాతీయంగా పేరు రావడంతో పాటు కొత్త పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు.



రానున్న నాలుగేళ్లలో రాష్ట్రంలో పార్టీ ప్రబల శక్తిగా మారేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.  ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య మాట్లాడుతూ పోలవరం పూర్తితో  సీమకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. మరో నాయకుడు అల్లపురెడ్డి హరినాథరెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు వ చ్చాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి నిలిచి పోయిందన్నారు.



ఏమని ప్రశ్నిస్తే తమకు సీట్లు రాలేదు కదా అనే సమాధానం వినిపిస్తోందన్నారు. జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ దే శ ప్రధాని నరేంద్రమోదీ నిరుపేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఆ పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పురంధేశ్వరిని ఘనంగా సన్మానించారు. అలాగే ఆ పార్టీ నాయకుడు సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రమేష్‌నాయుడు, గోసుల శ్రీనివాసులురెడ్డి, మాదినేని రామసుబ్బయ్య, ఒంటేరు శ్రీనివాసులురెడ్డి, సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, తాళ్లపొద్దుటూరు రామసుబ్బారెడ్డి, చలమారెడ్డి, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.



 రైల్వేకోడూరు అర్బన్: కడప నుంచి తిరుపతికి వెళ్తూ మార్గమధ్యంలో రైల్వేకోడూరులో బీజేపీ నాయకుడు గల్లా శ్రీనివాసులు నివాసంలో ఆమె విలేకరుతో మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top