ఏసీబీ వలలో తహశీల్దార్

ఏసీబీ వలలో తహశీల్దార్ - Sakshi


దగదర్తి(బిట్రగుంట) : అవినీతికి మారుపేరుగా నిలిచిన దగదర్తి తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం వల విసిరారు. భూవివాదంలో బాధితుల నుంచి లంచం తీసుకుంటున్న తహశీల్దార్ కె.లీలమ్మను పక్కా వ్యూహంతో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నగదుతో సహా ఆమెను, ఉలవపాళ్ల వీఆర్వో సాయిప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తహశీల్దార్ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడి అధికార వర్గాల్లో కలకలం సృష్టించింది. దాడి విషయం తెలిసిన వెంటనే స్థానికంగా ఉన్న వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది కార్యాలయాల నుంచి మాయమయ్యారు. ఫోన్లు సైతం స్విచ్‌ఆఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు.



ఏసీబీ అధికారులు, బాధితుల కథనం మేరకు..దగదర్తి మండలం ఉలవపాళ్లకు చెందిన గోచిపాతల చిన్నమ్మ, పోతిపోగు మాల్యాద్రి, పోతిపోగు వెంకయ్యల పూర్వీకులకు సుమారు 20 ఏళ్ల కిందట అదే గ్రామంలోని సర్వే నంబర్లు 46-3, 46-4, 46-5లో ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. పలుమార్లు క్రయవిక్రయాలు జరగడంతో ప్రస్తుతం ఈభూమి అనంతవరానికి చెందిన ఇద్దరు రైతుల ఆధీనంలో ఉంది. అన్యాక్రాంతమైన తమ పూర్వీకుల భూమిని తిరిగి అప్పగించాలంటూ చిన్నమ్మ, మాల్యాద్రి, వెంకయ్య ఇటీవల జేసీకి వినతిపత్రాలు అందచేశారు.



జేసీ విచారణకు ఆదేశించడంతో తహశీల్దార్ లీల బాధితులతో బేరం పెట్టారు. బాధితులకు అనుకూలంగా నివేదిక పంపించేందుకు ఎకరాకు రూ.5వేలు వంతున రూ.30వేలు డిమాండ్ చేశారు. బాధితులు బతిమలాడటంతో చివరకు రూ.15 వేలకు అంగీకరించారు. వీఆర్వో సాయిప్రసాద్‌కు అదనంగా రూ.2వేలు ఇవ్వాలని సూచించారు. ఈమేరకు బాధితులు ఈనెల 16న తహశీల్దార్‌కు రూ.10వేలు అందచేశారు. మిగిలిన రూ.5వేలు, వీఆర్వోకు ఇవ్వాల్సిన రూ.2వేలు ఇస్తే నివేదిక పంపుతానని తహశీల్దార్ స్పష్టం చేయడంతో బాధితులు విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.



ఏసీబీ నెల్లూరు ఇన్‌చార్జి డీఎస్పీ మూర్తి సూచన మేరకు బాధితులు మొత్తం రూ.7వేల నగదును కవర్లో పెట్టి తహశీల్దార్ కార్యాలయంలో లీలకు అందజేశారు. అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే తహశీల్దార్‌ను అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నారు. తహశీల్దార్‌కు రసాయనిక పరీక్షలు నిర్వహించి నగదు స్వీకరించినట్లు నిర్ధారించుకున్నారు. వీఆర్వో సాయిప్రసాద్‌ను కూడా అదుపులోకి తీసుకుని రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎసీబీ అధికారులు తెలిపారు.

 

ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు : కె.లీల, తహశీల్దార్

నేను ఎవరి దగ్గర నగదు డిమాండ్ చేయలేదు. నన్ను ఉద్దేశపూర్వకంగానే ఇరికించారు. కవర్లో పెట్టి ఇచ్చేసరికి అర్జీ అనుకుని స్వీకరించాను. అంతకు మించి నాకేమీ తెలియదు.

 

ఏడాదిన్నర నుంచి తిరుగుతున్నాం : చిన్నమ్మ, కొండయ్య, బాధితులు

అన్యాక్రాంతమైన మా భూములను తిరిగి ఇప్పించాలని ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేసి చివరకు రూ.30 వేలు డిమాండ్ చేశారు. కాళ్లావేళా పడటంతో తహశీల్దార్ రూ.15 వేలకు అంగీకరించారు. రూ.10 వేలు చెల్లించినా అంగీకరించలేదు. చివరకు విధిలేని పరిస్థితుల్లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top