అనర్హతతోనే ఫిరాయింపులకు చెక్

అనర్హతతోనే ఫిరాయింపులకు చెక్ - Sakshi


- జనచైతన్య వేదిక సదస్సులో మేధావుల స్పష్టీకరణ

- చర్య తీసుకునేందుకు స్పీకర్‌కు నిర్దిష్ట గడువు విధించాలి

- వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్‌కు ఇవ్వాలి

- ప్రజలు ప్రశ్నించేలా చైతన్యం పెంపొందిస్తూ ఉద్యమం చేపట్టాలి

- పార్టీ ఫిరాయించిన వారిని సంఘ బహిష్కరణ చేయాలి

 

 సాక్షి, విశాఖపట్నం: ఒక పార్టీ నుంచి ఎన్నికై మరో పార్టీలోకి మారిన ఎమ్మెల్యేలు, ఎంపీలను అనర్హులుగా చేయడం ద్వారానే పార్టీ ఫిరాయింపులను నిరోధించవచ్చని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. ఫిరాయించిన వారిని ఎన్నికల్లో పోటీకి అవకాశం లేకుండా చేయాలన్నారు. ఫిరాయింపుదార్లపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల కమిషన్‌కు ఉండాలని స్పష్టం చేశారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి అధ్యక్షతన విశాఖ పౌర గ్రంథాలయంలో ‘పార్టీ ఫిరాయింపులు-ప్రమాదంలో ప్రజాస్వామ్యం’ అనే అంశంపై ఆదివారం సాయంత్రం జరిగిన సదస్సులో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యార్థి సంఘాల నేతలు, రిటైర్డు ఉద్యోగులు పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారు.



 ప్రజా ఉద్యమం చేపట్టాలి

 ఫిరాయింపుదార్లపై ప్రజా ఉద్యమం చే పట్టాలని ద్రవిడియన్ యూనివర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కేఎస్ చలం అన్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు స్పీకర్‌కు నిర్దిష్టమైన గడువు విధించేలా చట్టంలో మార్పు తేవాలని నాగార్జున వర్సిటీ మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ తెలిపారు.  ఫిరాయింపుదార్లను మూడు నెలల పాటు జైలులో పెడితే భవిష్యత్‌లో ఇలాంటి చర్యలకు పాల్పడరని సీనియర్ న్యాయవాది అప్పారావు పేర్కొన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని తక్షణమే అనర్హులను చేసి, మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం తేవాలని రిటైర్డ్ ఐఈఎస్ అధికారి సీఎస్ రావు సూచించారు. ప్రజా చైతన్యం ద్వారా వీటిని అరికట్టవచ్చని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్ అన్నారు. ప్రజలు ప్రశ్నించకపోతే  ఇవి కొనసాగుతూనే ఉంటాయని ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ రఫీ పేర్కొన్నారు.

 

 ప్రజాస్వామ్యం అపహాస్యం

 ఫిరాయింపుల వల్ల ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీల నుంచి తెలంగాణ పునర్నిర్మాణం పేరిట టీఆర్‌ఎస్‌లోకి, ఏపీలో అభివృద్ధి పేరిట టీడీపీలోకి ఎమ్మెల్యేలు మారుతున్నట్టు సమర్థించుకుంటున్నారు. ఈ కారణాలు చూస్తే వాటి వెనక ఏ ప్రభావం ఉందో అందరికీ అర్థమవుతుంది.     -ప్రొఫెసర్ జి.హరగోపాల్, పౌరహక్కుల సంఘం నేత

 

 సుప్రీంకోర్టుకు లేఖ రాశా

 డబ్బు, మద్యం, హామీలతో గెలిచిన ప్రజాప్రతినిధులు ఐదేళ్లూ తమనేమీ చేయలేరన్న భావనతో ఉంటున్నారు. పార్టీ ఫిరాయింపులపై జోక్యం చేసుకోవాలని, ఫిరాయింపులను నిలువరించాలని గత ఏప్రిల్‌లో సుప్రీంకోర్టుకు లేఖ రాశాను. కానీ అటు నుంచి స్పందన లేదు.

 - ఈఏఎస్ శర్మ, కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి

 

 పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలి

 పార్టీలు ఫిరాయించే వారిపై తదుపరిఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలి. ప్రభుత్వం నుంచి వారికి వచ్చే అన్ని ప్రయోజనాలు, నిధులూ నిలిపేయాలి. ప్రతి మూడు నెలలకోసారైనా తమ గ్రామాలకు ఏం చేశారని ప్రజలు ఎమ్మెల్యేలు, ఎంపీలను నిలదీయాలి.

 -ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, రాజనీతి శాస్త్ర విశ్రాంత ఆచార్యుడు

 

 స్పీకర్లు కీలు బొమ్మలుగా మారడం వల్లే ఈ దుస్థితి

 అధికార పార్టీ చేతిలో స్పీకర్లు కీలుబొమ్మలుగా మారడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. మేధావులు మౌనంగా ఉండకుండా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు నడుం బిగించాలి. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారకుండా చూడాలి.  బలమైన పౌర సమాజం ద్వారా ఫిరాయింపులను నిరోధించవచ్చు.

 -వి. లక్ష్మణరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, జనచైతన్య వేదిక

 

 ఎన్నికల కమిషన్‌కు అధికారం ఇవ్వాలి

 పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిపై చర్య తీసు కునే అధికారం స్పీకర్‌కు కాకుండా ఎన్నికల కమిషన్‌కు ఉండాలి. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుంది. ఫిరాయింపుదార్లను సంఘ బహిష్కరణ చేయాలి. అలాంటి వారికి పాలు, నీరు అందకుండా గృహ నిర్బంధం చేయాలి.

 -వి.వి.రమణమూర్తి, అధ్యక్షుడు, రైటర్స్ అకాడమీ

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top