వచ్చారు... వెళ్లారు

వచ్చారు... వెళ్లారు - Sakshi


 చీపురుపల్లి:  తుపాను బాధితులను పరామర్శించేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం ప్రకటిస్తారో అంటూ ఎదురు చూసిన బాధితులు, రైతులకు తీవ్ర నిరాశే ఎదురైంది. శుక్రవారం గుర్ల మండలంలో సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన పర్యటన వచ్చారు...వెళ్లారు అన్నట్టుగా మారింది.  తుపాను వల్ల ఏర్పడిన నష్టాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి జిల్లా ప్రజలకు మేలు చేయవలసిన టీడీపీకి చెందిన నేతలెవరకూ ఆ దిశ గా కనీస ప్రయత్నం కూడా చేయలేదు. సభలో జిల్లా మంత్రి కిమిడి మృణాళిని, ఇన్‌చార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి, నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఎవ్వరూ జిల్లాకు జరిగిన నష్టాన్ని వివరిస్తూ కావాల్సిన సాయాన్ని కోరకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాకుండా మంత్రి మృణాళిని ప్రసంగంలో రైతులు, బాధితులు కోసం మాట్లాడాల్సింది పోయి ఏకంగా పొగడ్తలకే సమయం మొత్తం కేటాయించడం సర్వత్రా చర్చంశనీయమయింది.

 

 గుజ్జంగివలసలో జరిగిన సభలో పలువురు వృద్ధులు, రైతులు పింఛన్లు, రుణమాఫీ, ఇసుక కోసం ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అయితే వీటిపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన సమాధానం లభించకపోవడంతో వారు కూడా నిరాశ చెందాల్సి వచ్చింది. అర్హత ఉన్నప్పటికీ పింఛన్ ఎందుకు ఇవ్వలేదంటూ వృద్ధుల ఆవేదన ఓ వైపు, రుణమాఫీ జరగలేదు, ఇసుక లేక పట్టణాల్లోను, గ్రామాల్లోను ఉపాధి లేదంటూ మరోవైపు రైతులు అరుపుల మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభ జరిగింది. హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలు పరిశీలించేందుకు, రైతులను పరామర్శించేందుకు గురువారం గుర్ల మండలంలోని గుజ్జంగివలస గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన అకస్మాత్తుగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలు ప్రాంతంలో గుజ్జంగివలస చేరుకున్న ముఖ్యమంత్రి పొలాల వైపు వె ళ్లలేదు, రైతులు పరామర్శించలేదు. గుజ్జంగివలసలో ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు.

 

 ఈ సందర్భంగా ఆయన ప్రసంగం ప్రారంభించే సమయంలోనే గుజ్జంగివలస గ్రామానికి చెందిన తలచుట్ల పైడమ్మ, లండ ఆదమ్మ అనే ఇద్దరు వృద్ధమహిళలు ఒకరి తరువాత మరొకరు లేచి తమకు పింఛను తొలగించారంటూ చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. వీరికి ఎలా పింఛను తొలగిపోయిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటతోనే సరిపెట్టారు తప్ప మీకు పింఛను ఇప్పిస్తానని చెప్పకపోవడంతో నిరాశ చెందారు. దీంతో పక్కనే ఉన్న కలెక్టర్ ఎం.ఎం.నాయక్ వారిని పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సభ జరుగుతుండగా కొంతమంది రైతులు వెనుక నుంచి రుణమాఫీ కోసం పెద్దగా అరుస్తూ ప్రశ్నిస్తున్నారు. వారిని ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో సమావేశం ఆఖరి సమయంలో మరోసారి పెద్దగా రుణమాఫీ జరగలేదని, గత కొద్ది రోజులుగా ఇసుక లభించకపోవడంతో ఊరిలో పనులు లేవని పెద్దగా పలువురు రైతులు అరవడంతో ఉపాధి పనులు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రుణమాఫీ కోసం మాట్లాడకపోవడంతో రైతులు నిరాశ చెందారు.

 

 అంతేకాకుండా తుపాను నష్టాలను అంచనా వేసేందుకు గ్రామాల్లోకి వస్తున్న అధికారులు తమ మాట వినడం లేదని, నష్టాలను సరైన పద్ధతిలో నమోదు చేయడం లేదని జెడ్పీటీసీ పద్మిని, ఎంపీపీ సత్యమమ్మలు నేరుగా మైక్‌లో ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించగా దానికి చంద్రబాబునాయుడు మాట్లాడుతూ అధికారులు సక్రమంగా నమోదు చేయకపోతే మళ్లీ ఫొటోలు తీసి తనకు పంపించాలని అనడంతో వారు కూడా కంగుతిన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రి కిమిడి మృణాళిని, రాష్ట్ర ఐటీశాఖా మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యేలు పతివాడ నారాయణస్వామినాయుడు, కె.ఎ.నాయుడు, బొబ్బిలి చిరంజీవులు, కోళ్ల లలితకుమారి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యేలు కిమిడి గణపతిరావు, గద్దే బాబూరావు, జెడ్‌పీటీసీ టి.పద్మిని, ఎంపీపీ జమ్ము సత్యమమ్మ, సర్పంచ్ గొర్లె జానకి, సీఈఓ మోహనరావు, డీఆర్‌డీఏ పీడీ గోవిందరాజులు, ఆర్‌డీఓ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top