డీఎస్సీ పోస్టుల్లో కోత


సాక్షి, చిత్తూరు: ఊరించి, ఉడికించిన డీఎస్సీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదలైందనే సంతోషం ఎక్కువ రోజులు నిలవకుండా పోయింది. సీఎం చంద్రబాబునాయుడు తన సహజసిద్ధ ధోరణిలోనే డీఎస్సీ పోస్టుల్లో కోత విధించారు. ప్రభుత్వం నుంచి అందిన ఆదేశాల నేపథ్యంలో పోస్టులు తగ్గిస్తూ డీఈవో తయారు చేసిన నివేదికను పంపించారు. ఆర్థికభారం సాకుగా చూపించి ఆ చర్యకు పాల్పడినట్లు అధికారుల నుంచి సమాధానం లభించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన తరువాత పోస్టులు తగ్గించడం ఏమిటో అర్థంకాక విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులను సంప్రదించారు.



ప్రభుత్వ ఆర్థిక స్థితి బాగాలేదని,  ఒక్కసారిగా అంత భారం భరించే స్థితిలో లేనందున, ఆర్థికశాఖ సూచనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఉన్నతాధికారులు తేల్చి చెప్పినట్లు సమాచారం. బుధవారం సాయంత్రంలోగా తగ్గంపు ప్రక్రియ ను పూర్తిచేసి ప్రభుత్వానికి నివేదించాలని ఉన్నతాధికారులు  ఆదేశించినట్లు సమాచారం.  దీంతో  ఆయా జిల్లాల డీఈవోలు నోటిఫికేషన్‌లో చూపించిన ఉపాధ్యాయ పోస్టులను  తగ్గించే కార్యక్రమాన్ని  ఇప్పటికే ముగిం చినట్లు సమాచారం.

 

ప్రతిజిల్లాలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ ఖాళీలు ఉండగా ప్రభుత్వం కేవలం వందల పోస్టుల భర్తీకి మాత్రమే  నోటిఫికేషన్ విడుదల చేసింది.  అసలే తక్కువ పోస్టులతో నోటిపికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం  దరఖాస్తులకు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు ఉన్న సమయంలో మళ్లీ ఉన్న  పోస్టులు తగ్గించే ప్రయత్నానికి దిగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలతో పోలిస్తే చిత్తూరులోనే అత్యధికంగా 1,606 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నారు. తరువాత అనంతపురం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రమే వెయ్యి పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి.



రాష్ట్రంలోనే వైఎస్సార్ కడప జిల్లాలో అతి తక్కువ పోస్టులు (356) మాత్రమే భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో చూపారు. ఆ తరువాత వరుసక్రమంలో  విజయనగరం జిల్లాలో 362, కృష్ణాలో 379,  నెల్లూరు 416, పశ్చిమ గోదావరి 601, శ్రీకాకుళం 719, కర్నూలు 731 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌లో చూపింది. అయితే 20 శాతం కుదించాలన్న  తాజా ఆదేశాలతో  ఈ పోస్టులు  మరింతగా తగ్గనున్నాయి. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోనే  మొత్తం 1,606కు గాను 320 పోస్టులు  తగ్గనున్నాయి.



ఈ లెక్కన తక్కువ పోస్టులు  కేటాయించిన జిల్లాలో నామమాత్రంగా కూడా పోస్టులు మిగిలే పరిస్థితి లేదు. ఉదాహరణకు వైఎస్సార్ కడప, విజయనగరం, కృష్ణా, నెల్లూరు జిల్లాల పరిధిలో మొత్తం 400 లోపు మాత్రమే పోస్టులు చూపించారు. వీటిలో 20 శాతం తగ్గిస్తే 80 పోస్టులు తగ్గనున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో కొత్త జాబితాతో వివరాలను ప్రభుత్వం అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.

 

చిత్తశుద్ధిలేని ప్రభుత్వం

డీఎస్సీ నోటిఫికేషన్ విషయంలో ఆది నుంచి చంద్రబాబు ప్రభుత్వం  దోబూచులాడింది. ఎన్నికల ప్రచారంలో డీఎస్సీపై ప్రకటన చేసి హామీలు ఇచ్చిన బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల హామీని పక్కన బెట్టింది. డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ  మంత్రి గంటా శ్రీనివాసరావు ఐదుమార్లు ప్రకటించినా అది అమలుకు నోచుకోలేదు, తాజాగా 19న మంత్రి ప్రకటన చేయగా 20న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే  ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీపై బీఈడీ  చేసినవారు అర్హులు కాదనడం, టెట్, డీఎస్సీని అనుసంధానించడం, బీఈడీలను, డీఈడీలను విభజించడం తదితర నిర్ణయాలతో ప్రభుత్వం  నిరుద్యోగులను గందరగోళానికి గురిచేసింది.



తాజాగా దరఖాస్తులకు  నాలుగు రోజులు మాత్రమే గడువున్న సమయంలో  పోస్టులను కుదించి అర్హులకు ఉద్యోగావకాశాలను ఎండగడుతోంది.  మరోవైపు  ఒక్కో జిల్లాలో  20 నుంచి 40 వేలమంది వరకూ బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం ఉన్న ఖాళీలను భర్తీ చేయకుండా  మొక్కుబడిగా  డీఎస్సీ నిర్వహణకు పూనుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు  డీఎస్సీని కూడా రుణమాఫీ మాదిరే మార్చారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top