అధికారాలు కత్తిరించినా ఆర్థిక లావాదేవీలు


శ్రీకాకుళం: రాజీవ్ విద్యా మిషన్‌లో రాష్ట్రస్థాయి అధికారులు ఓ ఉద్యోగికి ఎఫ్‌ఏసీ అధికారాలను కత్తిరించినా అదే వ్యక్తితో ఇప్పటికీ ఆర్థిక లావాదేవీలు జరిపిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. రాజీవ్ విద్యా మిషన్‌లో ఎఫ్‌ఏఓగా మోహనరావును నియమించినప్పటికీ బాధ్యతలు అప్పగించకుండా కింది ఉద్యోగి సురేష్ ఎఫ్‌ఏఓ పోస్టులో కొనసాగుతున్న విషయం విదితమే. డిసెంబర్ 15న మోహనరావుకు ఎఫ్‌ఏఓగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అదేరోజున ఆయన రాష్ట్ర ఆర్‌వీఎం కార్యాలయంలో బాధ్యతలు తీసుకొని 23న శ్రీకాకుళం వచ్చారు. ఇప్పటివరకు ఆయనకు బాధ్యతలు అప్పగించకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు.

 

 రాష్ట్రస్థాయి అధికారులు ఆర్‌వీఎం అధికారులను ఎన్నిసార్లు ప్రశ్నించినా ఫైలు కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పుకొస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యవహారాన్ని కలెక్టర్‌కు నివేదించాల్సిన అవసరమే ఉండదు. డిసెంబర్ 27న జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఆర్‌వీఎం అధికారులకు ఓ లేఖ రాస్తూ సురేష్‌ను ఎఫ్‌ఏఓగా ఎఫ్‌ఏసీ బాధ్యతలతో కొనసాగించాలని కోరారు. దీనికి తిరస్కరిస్తూ జనవరి 19న ఆర్‌వీఎం రాష్ట్ర అధికారులు మరో ఉత్తర్వును వెలువరించారు. సురేష్‌కు ఎఫ్‌ఏఓ అధికారాలను తొలగిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మోహనరావుకు తక్షణం బాధ్యతలు అప్పగించి ఆ వివరాలను రాష్ట్ర కార్యాలయానికి తెలియజెప్పాలని ఆదేశించారు. తరువాత జనవరి 20, 21 తేదీల్లో విశాఖలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో కూడా ఇదే విషయమై రాష్ట్ర అధికారులు జిల్లా ఆర్‌వీఎం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

 

 తక్షణం బాధ్యతలు అప్పగించాలని కూడా చెప్పినట్లు భోగట్టా. ఇంత జరిగినా ఇప్పటికీ మోహనరావుకు బాధ్యతలు అప్పగించకపోగా ఎఫ్‌ఏసీ అధికారాల్లో కోత విధించిన సురేష్‌తోనే ఆర్థిక లావాదేవీలు జరిపిస్తున్నారు. దీని ద్వారా నిత్యం లక్షలాది రూపాయిలు విలువైన చెక్కులు రాయిస్తున్నారు. ఇందులో కేజీబీవీ ల బిల్లులు, ఉద్యోగుల జీతాలతోపాటు స్కూలు భవనాల బిల్లులు కూడా ఉంటున్నాయి. ఇంతగా ఎందుకు రాష్ట్ర అధికారుల ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారన్నది, ఆర్‌వీఎం అధికారులకు అంత అండగా ఉన్న నేతలెవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

 

  విషయాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీనరసింహం వద్ద సాక్షి ప్రస్తావించగా ఇటువంటి ఉత్తర్వులు వచ్చిన విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్‌వీఎం అకౌంట్స్ కంట్రోలర్ వద్ద ప్రస్తావించగా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. విషయం కలెక్టర్ వద్దే పెండింగ్‌లో ఉన్నట్టు జిల్లా ఆర్‌వీఎం అధికారులు చెబుతున్నారని, అది వాస్తవం కాకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top