రాజకీయ భవిష్యత్తుపై ఫిరాయింపు నేతల ఆందోళన..

రాజకీయ భవిష్యత్తుపై ఫిరాయింపు నేతల ఆందోళన.. - Sakshi

► ఎమ్మెల్సీ పదవికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా

► శిల్పా వైఖరితో ఇరకాటంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

► టీడీపీ శ్రేణుల్లోనూ నైతికతపై జోరుగా చర్చ

► రాజీనామాలకు ఒత్తిడి పెంచనున్న వైఎస్సార్‌ సీపీ

► జిల్లాలో ఓటేసిన ప్రజల్ని వంచించిన ఐదుగురు ఎమ్మెల్యేలు

 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి తన పదవికి రాజీనామా చేయడం అధికార పార్టీని ఇరుకున పెట్టింది. శిల్పాతో రాజీనామా చేయించి రాజకీయాల్లో నైతికత ఎంత అవసరమో వైఎస్‌ జగన్‌ చెప్పకనే చెప్పారు. తమ పార్టీ నిబద్ధత గల రాజకీయాలు చేస్తోందని స్పష్టతనిచ్చారు. ఇది అధికార పార్టీని, ముఖ్యంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను మరింత సంకట స్థితిలోకి నెట్టింది.  

 

ఒంగోలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజులతో పాటు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌లు ఏడాదిన్నర క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. పలు రకాల ప్రలోభాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీరిని పార్టీలో చేర్చుకున్నారు. నమ్మి ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఎమ్మెల్యేలు వంచించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. 

 

ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరాలనుకుంటే ముందు పదవులకు రాజీనామాలు చేయాలి. కానీ, ఫిరాయింపు ఎమ్మెల్యేలు నైతికతకు తిలోదకాలిచ్చి రాజీనామాలు చేయలేదు. వీరిపై అనర్హత వేటు వేయాలని ప్రతిపక్ష వైఎస్సార్‌ సీపీ పలుమార్లు డిమాండ్‌ చేసింది.  అసెంబ్లీలోనూ స్పీకర్‌తోపాటు, ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తెచ్చింది. అయినా అధికార పార్టీ స్పందించలేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు సైతం నైతిక విలువలకు తిలోదకాలిచ్చి రాజీనామాల సంగతిని గాలికొదిలేశారు. 

 

శిల్పా వైఖరితో ఇరుకునపడ్డ టీడీపీ..

 

తాజాగా అధికార టీడీపీ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో టీడీపీతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శిల్పాతో రాజీనామా చేయించి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యత నిచ్చారు. ఇది రాజకీయాల్లో మరోమారు పెద్ద చర్చకు దారి తీసింది. తమ పార్టీ నైతిక విలువలకు కట్టుబడి ఉందంటూ జగన్‌ టీడీపీకి సవాల్‌ విసిరినట్లయింది. ఇది అధికార పార్టీని మరింతగా ఇరకాటంలోకి నెట్టింది. శిల్పా రాజీనామా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మరింత ఒత్తిడి పెంచింది. 

 

ఏ మాత్రం నైతిక విలువలున్నా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయాలన్న డిమాండ్‌ పెరగనుంది. విశ్లేషకుల నుంచే కాకుండా ప్రజల నుంచి సైతం ఈ ఒత్తిడి అధికమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాకు చెందిన నలుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఒత్తిడి మరింత పెరిగే పక్షంలో రాజీనామాలు చేయాల్సి వస్తుందేమోనన్న ఆందోళన వారిలో మొదలైంది. వైఎస్‌ జగన్‌ గట్టిగా సవాల్‌ విసిరే పక్షంలో టీడీపీ మరింత ఇరుకునపడాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యేలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఒక వేళ ముఖ్యమంత్రి ఒత్తిడితో రాజీనామాలు చేస్తే గెలిచే పరిస్థితి లేదని.. అదే జరిగితే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. శిల్పాతో రాజీనామా చేయించి జగన్‌ టీడీపీని మరింత ఇరకాటంలోకి నెట్టారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

   

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top