భీమవరంలో విస్తరిస్తున్న నేర సామ్రాజ్యం

భీమవరంలో విస్తరిస్తున్న నేర సామ్రాజ్యం - Sakshi


భీమవరం అర్బన్ :పోలీసుల వైపే తుపాకీ గురిపెట్టే స్థాయికి భీమవరంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. ఆర్థిక, సాంస్కృతిక రాజధానిగా వెలుగొందుతూ.. ‘అతిథి దేవోభవ’ అన్నట్టుగా అందరినీ ఆదరిస్తూ అక్కున చేర్చుకునే భీమవరం ప్రాంతంపై అంతర్ రాష్ట్ర ముఠాలు పడగ విప్పారుు. ముందెన్నడూ లేనివిధంగా నేరస్తులు తుపాకులు ఉపయోగించే స్థాయికి చేరుకున్నారు. ఉపాధి పేరిట రాజస్థాన్‌లోని ధోల్పూర్ జిల్లా నుంచి వలస వచ్చిన కొందరు దుండగులు ఇటీవల వృద్ధురాలి మెడలో బంగారు ఆభరణాలను తెంచుకుని పరారయ్యే యత్నంలో పోలీసులపైనే కాల్పులకు తెగబడ్డారు. కొద్ది గంట ల్లోనే స్థానికుల సాయంతో ముగ్గురు దుండగులను, ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రెండు తుపాకులు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

 మార్బుల్స్ ప్రసిద్ధి గాంచిన ధోల్‌పూర్ జిలా వాసులు ఆ రాళ్లను అతికించే పనిలో నైపుణ్యం సంపాదించారు. సంపన్నులకు నిలయమైన భీమవరం ప్రాంతంలో భారీ వ్యయంతో బహు ళ అంతస్తుల భవనాల నిర్మాణం పెద్దఎత్తున సాగుతోంది. వీరంతా లక్షలాది రూపాయలను వెచ్చించి మార్బుల్స్ కొనుగోలు చేస్తున్నారు. వాటిని అతికించే పనిని ధోల్‌పూర్ జిల్లా వారితో చేయిస్తుంటారు. ఇదే భీమవరంలో మార్బుల్ వ్యాపారం విస్తరణకు, ధోల్‌పూర్ వాసుల ఉపాధికి మార్గం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రానికి చెందిన కొందరు ఇక్కడ మేస్త్రీలుగా ఉంటూ ఆ ప్రాంత కార్మికులను తీసుకొచ్చి కాంట్రాక్ట్ పద్ధతిలో భవనాలకు మార్బుల్స్ అతికించే పనులు చేయిస్తున్నారు.

 

 ఇదే పని చేరుుస్తున్న ధర్మేం ద్ర అనే రాజస్థానీయుడి వద్దకు పనుల నిమిత్తం వచ్చిన రమాకాంత్, రామ్‌భరణ్, రవీంద్రన్ అనే వారు తమ వెంట తుపాకులు తెచ్చుకుని నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ దుండగులు భీమవరం పరిసర మండలాల్లోనూ నేరాలకు పాల్పడినట్టు గుర్తించారు. పోలీసులకు తుపాకులు, బుల్లెట్లతోపాటు దుండగుల ఇంట్లో కొంత బంగారం, మిరమిట్లు గొలిపే కొన్నిరాళ్లు కూడా లభ్యమైనట్టు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమేనా, వట్టి ప్రచారమా అన్నది నిర్ధారణ కాలే దు. దుండగులు ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు, ఇక్కడకు ఉపాధి నిమిత్తమే వచ్చారా, నేరాలకు పాల్పడాలన్న ఉద్దేంతో వచ్చారా.. ఇలాంటి ముఠా లు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నారుు.. తుపాకులు ఎప్పటినుంచి వినియోగిస్తున్నారు, ఎక్కడ కొనుగోలు చేస్తున్నారనే కోణాల్లో విచారణ జరుగుతోంది.

 

 వీడని నకిలీ కరెన్సీ అసలు మిస్టరీ

 మరోవైపు విచ్చలవిడిగా చలామణి అవుతున్న నకిలీ కరెన్సీ పోలీస్ యంత్రాంగానికి చిక్కు ప్రశ్నగా మారింది. పాకిస్థాన్ నుంచి బంగ్లాదేశ్ మీదుగా ఇక్కడకు నకిలీ కరెన్సీ పెద్దఎత్తున వస్తోందనే విషయూన్ని పోలీసులు ఎప్పుడో నిర్ధారిం చారు. దీన్ని అరికట్టేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఏదో మార్గంలో ప్రవాహం కొనసాగుతూనే ఉంది. డెల్టాలో దీని జోరు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో కొందరు నేరగాళ్లు ఒకటికి రెండింతలు నకిలీ కరెన్సీ ఇస్తామంటూ ప్రలోభపెట్టి చివరకు దొంగనోట్లు చేతిలో పెట్టి మాయ చేసేవారు. ఇటువంటి వ్యవహారాలు ముదిరి భీమవరం రూరల్ సర్కిల్ పరిధిలో హత్యలు జరిగిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి.

 

 ఒక అధ్యాపకుడు ఈ తరహాలోనే హత్యకు గురయ్యాడు. డబ్లింగ్ కరెన్సీ నుంచి కలర్ ప్రింటర్ల ద్వారా నోట్లు ముద్రించే స్థాయికి కొందరు చేరారు. ఆ తర్వాత అసలు, నకిలీ గుర్తించలేని విధంగా పాకిస్థాన్‌లో ముద్రించిన కరెన్సీ విస్తారంగా చెలామణిలోకి వచ్చింది. ఈ క్రమంలో భీమవరం పట్టణం పాత బస్టాండ్ వద్ద ఈ నెల 17న ఒక విద్యార్థిని అరెస్ట్ చేసిన పోలీసులు రూ.42 వేల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆ విద్యార్థి అన్న రూ.90 వేల నకిలీ కరెన్సీతో మొగల్తూరు పోలీసులకు పట్టుబడి నరసాపురం జైలులో ఉన్నాడు. తన అన్న వద్ద మిగిలిన కరెన్సీని తాను మార్చే ప్రయత్నంలో పోలీసులకు పట్టుబడినట్టు ఆ విద్యార్థి పోలీసులకు తెలిపాడు. నిందితులు పట్టుబడుతున్నా.. దీని వెనుక గల సూత్రధారుల గుట్టు మాత్రం వీడటం లేదు. ఇటీవల ఉపాధ్యాయ దంపతుల కిడ్నాప్ వ్యవహారం కూడా సంచలనమైంది. ఈ తరహా ఘటనలతో డెల్టా అట్టుడుకుతోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top