సీఆర్‌డీఏకు ఓకే

సీఆర్‌డీఏకు ఓకే - Sakshi


* విపక్ష నిరసనల మధ్య బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం

* రాజధాని సంస్థ బిల్లుపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

* రైతులకు మేలు జరుగుతుందనే ల్యాండ్ పూలింగ్ తెచ్చాం

* రైతులకు లాటరీ పద్ధతిలో భూములిస్తాం

* మొత్తం 27 అంశాలతో నిబంధనలను రూపొందిస్తాం

* విపక్ష నేతల మాటలను రైతులెవరూ వినొద్దు: సీఎం చంద్రబాబు

* విపక్ష సభ్యుల నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటన

* రైతుల భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం

* టీడీపీ బినామీలు, దళారుల కోసమే ఈ బిల్లు..

* భూ సేకరణ చట్టం ద్వారా సాధ్యం కాదనే ‘ల్యాండ్ ఫూలింగ్’  

* రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల హక్కులు హరించారు

* రైతుల భూముల అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పజెప్పాలి

* ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం: జగన్




రైతుల భూములను బలవంతంగా తీసుకుని వాళ్ల భూములతోనే ప్రభుత్వం నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. సీఆర్‌డీఏ బిల్లును పూర్తిగా టీడీపీ బినామీలు, దళారుల కోసమే తెచ్చారు. రైతుల భూములను లాక్కుని, వాళ్లకు ముష్టి పడేసినట్టు కాకుండా అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పచెప్పాలి.     

-ప్రతిపక్ష నేత వైఎస్ జగన్



రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోంది. రాజధాని నిర్మాణం జరిగితే టీడీపీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో ప్రతిపక్షం రైతుల్లో అపోహలు సృష్టిస్తోంది. భూములిచ్చిన రైతులకు 9 నెలల్లోనే చట్టబద్ధత కలిగిన యాజమాన్య ధ్రువపత్రాలు ఇస్తాం. మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములిస్తాం.    

- ఏపీ సీఎం చంద్రబాబు



సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదం తెలిపింది. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల నిరసన మధ్య.. సీఆర్‌డీఏ బిల్లు మూజువాణి ఓటుతో ఆమోదం పొందినట్టు సభాపతి కోడెల శివప్రసాదరావు ప్రకటించారు. ఈ బిల్లుకు స్పీకర్ సభ ఆమోదం కోరినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు పలువురు ఈ బిల్లు రైతులకు ఏమాత్రం ప్రయోజనకరంగా లేదంటూ దాని ప్రతులను చించి సభలో నిరసన తెలిపారు. సోమవారం సాయంత్రం శాసనసభ సమావేశమైనప్పుడు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ సభలో సీఆర్‌డీఏ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు బిల్లుపై చర్చ అనంతరం మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.



అధికార తెలుగుదేశం పార్టీతో పాటు, భాగస్వామి పార్టీగా ఉన్న బీజేపీ ఈ బిల్లుకు మద్దతు ప్రకటించగా.. బిల్లులో పొందుపరిచిన అంశాలు రైతులకు నష్టం చేసేలా ఉన్నాయంటూ, బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. బిల్లు ప్రభుత్వం, భూ అభివృద్ధికి ఉద్దేశించిన వారి హక్కులను మాత్రమే కాపాడేలా ఉందని, అందులో రైతుల ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని ఆ పార్టీ విమర్శించింది.



అంతకుముందు అధికార, ప్రతిపక్షాల మధ్య బిల్లుపై వాడివేడి చర్చ జరిగింది. సీఆర్‌డీఏ పేరుతో ప్రభుత్వం పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని వైఎస్సార్ సీపీ మండిపడింది. చర్చలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు బిల్లులో పేర్కొన్న అంశాలు అనుమానాస్పదంగా ఉన్నాయని, నయా పైసా పెట్టుబడి లేకుండా రైతుల నుంచి వేలాది ఎకరాలు కైంకర్యం చేస్తున్నారని విమర్శించింది. విపక్షం మాటలు వినొద్దని అధికార పక్షం కోరింది. సుదీర్ఘ చర్చపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చివరగా సమాధానమిచ్చారు. విపక్ష నేత జగన్ చేసిన పలు సూచనలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకుండానే బిల్లును ఆమోదించాలని సభను కోరింది.



రాజకీయాలు చేస్తున్నారు: బాబు

రాజధాని నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీ రాజకీయాలు చేస్తోందని, రాజధాని నిర్మాణం జరిగితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో ప్రతిపక్షం రైతుల్లో అపోహలు సృష్టిస్తోందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీకి రాజధానిపై స్పష్టత లేదన్నారు. ‘‘విభజన సమయానికి రూ. 16 వేల కోట్ల లోటులో రాష్ట్రం ఉంది, క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఈ పరిస్థితుల్లో అందరూ సహకరించాలి’’ అని పేర్కొన్నారు. ల్యాండ్ పూలిం గ్ విధానం ద్వారా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చినట్టు చెప్పారు. త్వరలోనే రైతులందరి భూములను నోటిఫై చేసి, ఆ వెంటనే ఏ రైతు భూమి ఎంతో ప్రకటించి, సమీకరణకు వెళతామన్నారు. రైతులకు, కౌలుదారులకు, రైతుకూలీలకు మేలు జరగాలనే ఉద్దేశంతోనే అందరికీ నచ్చే ప్యాకేజీని ఇచ్చామని సమర్థించుకున్నారు. మెట్ట ప్రాంతానికి ఎకరాకు వెయ్యి గజాలు నివాస స్థలం, 200 గజాలు వాణిజ్య స్థలం ఇచ్చామని, జరీబు భూమికి 1000 గజాలు నివాస స్థలం, 300 గజాలు వాణిజ్య స్థలంలో ఇచ్చామని, అసైన్డ్ భూములకు 800 గజాలు నివాస స్థలం, 300 గజాలు వాణిజ్య సముదాయంలో ఇస్తున్నామని పేర్కొన్నారు.



భూములిచ్చిన రైతులకు 9 నెలల్లోనే చట్టబద్ధత కలిగిన యాజమాన్య ధృవపత్రాలు ఇస్తామని, మూడేళ్లలో అభివృద్ధి చేసిన భూములు ఇస్తామని చెప్పారు. భూములిచ్చి న రైతులకు స్టాంపు, నాలా, రిజిస్ట్రేషన్ల విషయంలో వన్‌టైమ్ పద్ధతిన మినహాయింపు ఇస్తామన్నారు. భూమిలేని కుటుంబాలు 12 వేలకు పైగా ఉన్నాయని, వారికి కూడా నెలకు రూ. 2,500 చొప్పున పదేళ్ల పాటు వేతనం ఇస్తామని పేర్కొన్నారు. దేవాదాయ భూములకు చెందిన భూముల పరిహారం ఆయా దేవాలయాలకే ఇస్తామన్నారు.



అభివృద్ధి చేసిన భూముల్లో రైతులు గ్రూపులుగా వచ్చినా, విడివిడిగా ఇచ్చినా వారికి లాటరీ పద్ధతిలో పారదర్శకంగా భూములిస్తామన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూములను కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా రిజిస్ట్రేషన్లు యథావిధిగా కొనసాగిస్తామన్నారు. మొత్తం 27 అంశాలతో నిబంధనలను రూపొం దించనున్నామని, చట్టం చేశాక రూల్స్ అసెంబ్లీ ఆమోదానికి వస్తాయని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రూ. 5 లక్షల కోట్లు అవసరమవుతుందని, ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించనున్నామని చెప్పారు. ధైర్యముంటే ఇక్కడ రాజధాని ప్రాంతం వద్దని చెప్పాలని విపక్షాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీ నేతల మాటలు రైతులెవరూ వినవద్దని, రైతులందరికీ తాను అండగా ఉంటానని, సొంత ఇళ్లు నిర్మిస్తున్నట్టు భావించి రాజధాని నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన కోరారు.



దళారుల కోసమే పూలింగ్ విధానం: జగన్

రైతుల భూములను బలవంతంగా తీసుకుని వాళ్ల భూములతోనే ప్రభుత్వం నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. సీఆర్‌డీఏ బిల్లును పూర్తిగా తెలుగుదేశం పార్టీ బినామీలు, దళారుల కోసమే ఏర్పాటు చేశారని ఘాటుగా విమర్శించారు. ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అనుసరించడంలో చంద్రబాబుకు రైతులపై ప్రేమతో కాదని, భూసేకరణ చట్టం ద్వారా అయితే, రైతులకు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుందని, అందులోనూ ఆ భూములన్నీ ఏడాదికి మూడు పైర్లు పండే సారవంతమైన భూములు కాబట్టి ఈ పరిస్థితుల్లో భూములు తీసుకోలేకనే ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చారని ఆయన ఎండగట్టారు. ల్యాండ్ పూలింగ్ విధానమంటూ బాబు రైతులపై కథ బ్రహ్మాండంగా చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు. ఇందులో రైతులకు, కౌలు రైతులకు, రైతు కూలీలకు ఎలాంటి హక్కులు లేకుండా చేసి, సర్వాధికారాలు ప్రభుత్వం చేతుల్లో ఉండేలా చేశారంటే రైతుల పరిస్థితి ఏమిటనేది ఊహించుకోవచ్చునన్నారు.



రైతులకు 12,500 ఎకరాలేనా?

రాజధాని ప్రాంతంలో రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇంతకన్నా ఉదాహరణ మరొకటి ఉండదని జగన్ ధ్వజమెత్తారు. 50 వేల ఎకరాల భూములు సేకరిస్తుంటే అందులో 25 వేల ఎకరాలు రోడ్లు, పార్కులు, స్కూలు, బలహీన వర్గాలకు తదితర వాటికి కేటాయిస్తుంటే మిగిలిన 25 వేల ఎకరాల్లో రైతులకు ఇస్తున్నది 12,500 ఎకరాలేనన్నారు. అంటే మిగతా 12,500 ఎకరాలను ప్రభుత్వం లాక్కుని వ్యాపారం చేస్తున్నట్టు కాదా అని ప్రశ్నించారు. రైతులు తమ భూములను ఏ డెవలపర్‌కు ఇచ్చినా అభివృద్ధికి మినహాయించి 70 శాతం భూముని ఇస్తారని, కానీ ప్రభుత్వం చేస్తున్నదేమిటని నిలదీశారు. ‘‘రైతులకు రావాల్సిన భూమిని తక్కువగా ఇచ్చి.. మీరు, మీ బినామీలు తీసుకునేందుకే ఇదంతా చేస్తున్నారు. ఇది ల్యాండ్ పూలింగ్ కాదు.. ‘ల్యాండ్ ఫూలింగ్’’ అని ధ్వజమెత్తారు.



అభివృద్ధి బాధ్యత రైతులకే అప్పజెప్పండి

రైతుల భూములు ప్రభుత్వం లాక్కుని, వాళ్లకు ముష్టి పడేసినట్టు కాకుండా అభివృద్ధి బాధ్యతను రైతులకు అప్పజెప్పాలని జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. రోడ్లు తదితర అభివృద్ధి మేరకు ప్రభుత్వం చేపట్టి, మిగతా భూములను రైతులకిస్తే ఆ అభివృద్ధి వారే చేసి చూపించగలరనిఆయన పేర్కొన్నారు.



రాజధానిని ఎప్పుడూ వ్యతిరేకించలేదు

విజయవాడ పరిసరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడాన్ని తానెప్పుడూ వ్యతిరేకించలేదని, కానీ ప్రభుత్వం చేపట్టిన విధానాలనే తప్పు పడుతున్నామని జగన్ పునరుద్ఘాటించారు. మంగళగిరిలో 10 వేల ఎకరాలు, వినుకొండలో 11 వేల ఎకరాలు ప్రభుత్వ భూములున్నట్టు తమ శాసనసభ్యులు చెప్పారని, అలాంటి ప్రభుత్వ భూములను వినియోగించుకుని రాజధాని నిర్మాణం చెయ్యకుండా.. మూడు పైర్లు పండే భూములను తీసుకుని ఎందుకు వ్యాపారం చేయదల్చుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ బిల్లును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top