సీపీఎం నేతలపై హత్యాయత్నం

సీపీఎం నేతలపై హత్యాయత్నం - Sakshi


గుంటూరు రూరల్ : అసైన్డ్ భూముల అక్రమ విక్రయాలను అడ్డుకున్నందుకు సీపీఎం నాయకులపై అధికార పార్టీకి చెందిన మంత్రి అనుచరులు గొడ్డళ్లు, వేట కొడవళ్లతో దాడిచేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన నగరంలో తీవ్ర కలకలం సృష్టించింది. గుంటూరు రూరల్ మండలంలోని అడవితక్కెళ్ళపాడు గ్రామం పరిధిలోని సుందరయ్యనగర్‌లో మంగళవారం జరిగిన ఈ సంఘటన సంచలనం కలిగించింది. స్వర్ణభారతినగర్ నాలుగో లైనుకు చెందిన కామిశెట్టి ఆంజనేయులు (32) తాపీ పనిచేస్తూ సీపీఎమ్ లో సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తుంటాడు.



సుందరయ్య కాలనీ, స్వర్ణభారతినగర్‌లకు చెందిన పాలక పార్టీ నాయకులు సుందరయ్య కాలనీలోని అసైన్డ్ భూములను అక్రమంగా అమాయక ప్రజలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆంజనేయులు రెండుమూడుసార్లు స్థానికుల సహాయంతో వారిని అడ్డుకున్నాడు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు ఫిర్యాదు చేశాడు. అవతలి వ్యక్తులు మంత్రి అనుచరులు కావడంతో సీఐ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.



దీంతో కాలనీ వాసులు, సీపీఎం నాయకులు గత నెల 20న అర్బన్ ఎస్పీకి  గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్పీ కేసును నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావుకు అప్పగించి పరిస్థితిని విచారించి వారికి న్యాయం చేయాలని ఆదేశించారు. అయితే రౌడీషీటర్‌లు స్థానిక మంత్రితో పోలీసులకు చెప్పించుకుని ఫిర్యాదు చేసిన వారిపైనే బైండోవర్ కేసును పెట్టించారని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక రౌడీషీటర్ షేక్ బాజీ తన స్నేహితులైన గూడవల్లి కోటేశ్వరరావు, ఖాజావలి, అబ్దుల్ రహమాన్, ఎమ్ మణికంఠలతో కలిసి మంగళవారం ఆంజనేయులు వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నారు.



ఆంజనేయులు అతని పక్కనే ఉన్న కనపాల సతీష్‌లపై గొడ్డళ్లు, వేట కొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. స్థానికులు అక్కడికి చేరుకోవటంతో నిందితులు పారిపోయారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆంజనేయులుకు భార్య ముగ్గురు చిన్నారులున్నారని తండ్రి సాంబయ్య తెలిపాడు. రౌడీల ఆకృత్యాలకు అడ్డువస్తున్నాడని తన కొడుకును చంపేందుకు ప్రయత్నించారని వాపోయాడు.

 

జీజీహెచ్ ఎదుట రోడ్డుపై బైఠాయించిన బాధితులు

 అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టం వచ్చినట్లు అక్రమంగా స్థలాలను విక్రయిస్తూ అడ్డువచ్చినవారిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం నాయకులు గుంటూరు ప్రభుత్వాసుపత్రివద్ద ధర్నాకు దిగారు. నల్లపాడు సీఐ పూర్ణచంద్రరావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలిసిన అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుని నాయకులకు సర్దిచెప్పి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.



గంటకుపైగా జరిగిన ఆందోళనతో ఆసుపత్రి వద్ద ఉధ్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు తూర్పు, పశ్ఛిమ డీఎస్పీలు సంతోష్, సరిత ఆధ్వర్యంలో పోలీసు బలగాలు పెద్దఎత్తున జీజీహెచ్ వద్దకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top