'బాబు, వెంకయ్య బుడబుక్కల వేషగాళ్లు'


తడ (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): తెల్లారి లేసింది మొదలు రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం.. జపాన్ చేస్తాం.. ప్రత్యేక హోదా సాధిస్తాం.. అంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు చెప్పే మాటలు పండగపూట బుడబుక్కల వాళ్లు చెప్పేవిలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ ఎద్దేవాచేశారు. మంగళవారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో నారాయణ ప్రసంగించారు.





"అన్నపూర్ణగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రాను అన్నమో రామచంద్రా" అని అలమటించేలా చేసే భూసేకరణ చట్టానికి మద్దతుగా చంద్రబాబు తలూపడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసి మరోమారు రైతు శత్రువుగా మిగిలారని నారాయణ విమర్శించారు. హైదరాబాద్‌లో సగంలేని సింగపూర్‌ను నెత్తిన పెట్టుకుని తన చీకటి ఒప్పందాలకు అనువుగా పథకాలు రచించుకుంటున్నారని విమర్శించారు. ఏ హోదాతో లోకేష్ అమెరికా పర్యటన చేశారని ఆయన ప్రశ్నించారు.





ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముందు నిలిచి రాష్ట్ర సమస్యలను పరిష్కరించే శక్తి బాబుకు లేదని నారాయణ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా సాధించలేనప్పుడు వెంకయ్య మంత్రి పదవిని పట్టుకుని వేలాడటం దేనికని నిలదీశారు. రైతులకు, కార్మికులకు, సామాన్య ప్రజానీకానికి అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రజలను సంఘటితపరిచి పోరాటం సాగిస్తామని నారాయణ హెచ్చరించారు. అంతకు మునుపు బోడిలింగాలపాడు గ్రామం నుంచి తడ వరకు జరిగిన ర్యాలీలో నారాయణ మోటార్ బైక్ నడిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top