ఏర్పేడు ప్రమాదంపై న్యాయ విచారణ

ఏర్పేడు ప్రమాదంపై న్యాయ విచారణ - Sakshi


సాక్షి, హైదరాబాద్‌ : ఏర్పేడు మండలం మునగాలపాలెం వద్ద జరిగిన లారీ ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు డా.కె.నారాయణ టీడీపీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీలో పెరిగిపోతున్న ఇసుక, మైనింగ్‌ ఆగడాలకు, ఏర్పేడు ఘటనకు సీఎం చంద్రబాబే కారణమని, అందువల్ల దీనిపై న్యాయ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఐఏఎస్‌ అధికారితో విచారణ జరిపిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం లేదన్నారు.



ఈ సంఘటనకు చంద్రబాబు, రూరల్‌ ఎస్పీ జయలక్ష్మీ నైతిక బాధ్యత వహించాలన్నారు. రూరల్‌ ఎస్పీ జయలక్ష్మీపై హత్యానేరం కేసును నమోదు చేయాలన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25లక్షలు, గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున ఆర్థికసహాయాన్ని ప్రటకించాలని, ఈ కుటుంబాలకు విద్యా,వైద్య,ఉపాధి పరంగా ఆదుకోవాలని కోరారు. బుధవారం మగ్దూంభవన్‌లో పార్టీ నాయకులు చాడ వెంకటరెడ్డి , అజీజ్‌పాషాలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇసుక,మైనిం‍గ్‌ మాఫియా చెలరేగిపోతోందని, ఎటు చూసినా అధికారపార్టీ పచ్చచొక్కాలు మాఫియాగా మారి రైతులు, ప్రజలపై విరుచుకుపడుతున్నారని ఆరోపించారు.



అందులో భాగంగానే స్వర్ణముఖి నది నుంచి ఉచితంగా తీస్తున్న ఇసుకను సమీపంలోని అటవీప్రాంతం, గ్రామాలలో నిల్వ చేసి కర్ణాటక, తమిళనాడులలో విక్రయిస్తున్నారన్నారు. దీనిని వ్యతిరేకిస్తున్న రైతులు, కూలీలపై ఎస్సీ,ఎస్టీలతో కేసులు పెట్టిస్తున్నారని ఆయన చెప్పారు. తమ గ్రామంలో ఇసుక నిల్వ చేయడాన్ని రైతులు వ్యతిరేకిస్తున్నారని నారాయణ తెలిపారు.ఒక పక్క భూగర్భజలాలను పెంచేందుకు చెక్‌డ్యాంలను ప్రభుత్వం నిర్మిస్తూనే మరోవైపు ఇసుకమాఫియా ద్వారా అక్రమంగా ఇసుకను విక్రయిస్తూ డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఇసుక, మైనింగ్‌ మాఫియా ఆగడాలను వ్యతిరేకిస్తే వందల సంఖ్యలో రైతులు ఎస్పీకి ఫిర్యాదు చేయడానికి వెళ్లగా వారు లోనికి వెళ్లకుండా రోడ్డుపై నిలబెట్టగా లారీ భీబత్సంతో అమాయక రైతులు, మహిళలు, పిల్లలు మృత్యువాత పడ్డారన్నారు.



చత్తీస్‌గఢ్‌లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను మావోయిస్ట్‌లు కాల్పిచంపడాన్ని నారాయణ ఖండించారు. తుపాకీ గొట్టం ద్వారా విప్లవం రాదన్న విషయాన్ని ఇప్పటికైనా మావోయిస్ట్‌లు గ్రహించి జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ప్రభుత్వం కూడా తుపాకీ ద్వారా రాజ్యహింసను ప్రోత్సహించడం సరైనది కాదన్నారు.



ఉద్యమాలను అణచేస్తే అగ్నిగొళంగా బద్ధలవుతాయి

సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల వల్ల ధర్నాచౌక్‌ పరిరక్షణకై జరుగుతున్న విశాల ఉద్యమం నాలుగు గోడల మధ్య జరపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని సీపీఐనేత నారాయణ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితిని చూస్తుంటే సీఎం కేసీఆర్‌ నిజాం నవాబుగా మారిపోయాడని అనిపిస్తోందని ఎద్దేవాచేశారు. తెలంగాణలో ప్రజాతంత్ర ఉద్యమాలను ఉక్కుపాదంతో అణచేస్తే అవి ఒక్కసారిగా అగ్నిగోళం మాదిరిగా బద్ధలై విరుచుకుపడతాయని హెచ్చరించారు.


కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ది చేసేందుకు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలన్నారు.ఓయూ శతాబ్దికి కేటాయించిన నిధులు చావుకు ఖర్చు చేసినట్లుగా ఉందని, ఈ వర్శిటీని బతికించి అభివృద్ధి చేసేందుకు కాదన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top