ఒకే చోట సమాధి చేయండి..

ఒకే చోట సమాధి చేయండి.. - Sakshi


పట్నంబజారు (గుంటూరు జిల్లా) : వారి స్నేహం ప్రేమగా మారింది.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు.. కులాంతర వివాహం కావటంతో ఇంటి పెద్దలు చేరదీయలేదు.. సర్దుకుపోయి బతుకుదామని బయటకు వస్తే.. వేధింపులు మొదలయ్యాయి.. ఇవన్నీ తట్టుకోలేక ఆ జంట.. కలిసి బతకలేకపోయినా.. ఒక్కటిగా మరణించాలని నిర్ణయించుకున్నారు.. అనుకున్నదే తడవుగా ఆత్మహత్యకు యత్నించారు.. భార్య మృతి చెందగా, భర్త ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన గుంటూరులో మంగళవారం జరిగింది. అరండల్‌పేట పోలీసులు, ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి తెలిపిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.



కృష్ణనగర్‌కు చెందిన కట్టా మహిమ (20), కోబాల్డుపేటకు చెందిన బొడ్డు వసుంధర బాబు 8వ తరగతి నుంచే స్నేహితులు. పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో 2015 సెప్టెంబర్‌లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోని ఓ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. పెద్దలు సమ్మతించకపోవటంతో గుంటూరులో పోలీసు అధికారులను కలిసి ఒక్కటయ్యారు. అనంతరం కోబాల్డుపేటలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవితాన్ని మొదలెట్టారు. ఈ క్రమంలో తన వాటా కింద వచ్చే ఆస్తిని ఇవ్వాలంటూ వసుంధరబాబు తల్లితండ్రులను కోరటంతో వారు రూ.3 లక్షలు ఇచ్చారు. మిగిలిన మొత్తానికి సంబంధించి బాండ్లు ఇచ్చారు. అనంతరం వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. ఈ క్రమంలో మహిమను వదిలి వచ్చేయాలని వసుంధరబాబు తల్లితండ్రులు ఒత్తిడి చేస్తుండగా, అదే సమయంలో తమ బిడ్డను ఎలాగైనా తీసుకెళ్లాలని మహిమ బంధువులు మరో పక్క వేధింపులకు గురి చేయటం ప్రారంభించారు.



కిడ్నాప్‌ కేసు..

మహిమ తండ్రి శ్రీనివాసరావు గతంలోనే మరణించారు. తల్లి లావణ్య డెంటల్‌ డాక్టర్‌. తన బిడ్డని కిడ్నాప్‌ చేశారంటూ ఆమె స్వగ్రామమైన దుగ్గిరాలలో కేసు పెట్టించింది. వీటన్నిటిని భరించలేక వసుంధబాబు, మహిమ చనిపోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 14న బ్రాడీపేటలోని ఓ హోటల్‌లో రూమును అద్దెకు తీసుకున్నారు. ముందస్తుగానే పురుగుల మందు, ఉరి వేసుకునేందుకు తాడు, చేతులు కోసుకునేందుకు బ్లేడులను కొని తెచ్చుకున్నారు. సూసైడ్‌ నోట్‌ కూడా రాసి దగ్గర ఉంచుకున్నారు. మంగళవారం ఉదయం పురుగుల మందును బీరులో కలుపుకుని వసుంధరబాబు, కూల్‌డ్రింక్‌లో కలుపుకుని మహిమ తాగారు. పురుగుల మందు తాగితే చనిపోతామో లేదో అన్న అనుమానంతో మహిమ తాడుతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. అలాగే, పురుగుల మందు సేవించిన వసుంధరబాబు కూడా బ్లేడుతో తన రెండు చేతులను నరాలు తెగేలా కోసుకున్నాడు. అయితే, మహిమ మృతి చెందగా వసుంధరబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. పోలీసులు అతనిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.



ఘటనపై భిన్న వాదనలు...

అయితే, ఈ ఘటనపై పోలీసులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి తలుపులు తీయలేదని, అనుమానం వచ్చి ఒకటికి పలుమార్లు కొట్టినా తెరవలేదని, మంగళవారం ఉదయం కూడా అదే పరిస్థితి కావడంతో లాడ్జి రూము బాయ్‌ పోలీసులకు సమాచారాన్ని అందించాడు. దీంతో పోలీసులు వచ్చి మహిళ మృతదేహాన్ని కిందకు దింపి, వసుంధబాబును ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న వసుంధబాబు మాత్రం మంగళవారం ఉదయమే ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించామని చెబుతున్నాడు. గదిలో రక్తం పూర్తిగా ఎండిపోయి ఉంది. సినిమాలను చూసి చేతులు కోసుకుని చనిపోవాలని నిర్ణయించుకున్నానని వసుంధరబాబు చెపుతున్నాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం దర్యాప్తులో తేలాల్సి ఉంది.



ఇరువురి మధ్య వివాదం..?

వసుంధరబాబు ఆకతాయిగా తిరుగుతుంటాడని పోలీసులు చెబుతున్నారు. దీంతోపాటు రెండు నెలల క్రితం బ్రాడీపేటలో నిద్రిస్తున్న వ్యక్తి వద్ద సెల్‌ఫోన్‌ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా స్థానికులు వసుంధరబాబుకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. ఈ ఘటన జరిగాక దంపతులిద్దరి మధ్య ఏదైనా మనస్పర్ధలు ఏర్పడ్డాయా.. లేక ఏమైనా ఘర్షణలు జరిగాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


ఒకే చోట సమాధి చేయండి..

యువ దంపతులు సూసైడ్‌ నోట్‌ కూడా రాశారు. ‘ఇద్దరం కలిసి బతుకుదామని అనుకున్నాం..’ ‘కానీ కలిసి చచ్చిపోతున్నాం..’ ‘చనిపోయాక ఇద్దరిని ఒకే చోట సమాధి చేయండి..’ అని మహిమ తన చావు లేఖలో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు. సుమారు ఐదు పేజీల లేఖ రాసినట్లు సమాచారం. అయితే సూసైడ్‌ నోట్‌పై కూడా స్పష్టత లేదు. లేఖలో ఉన్న అన్ని అంశాలను ప్రస్తావించకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. కేవలం ఆమె రాసిన ఒక పేజీని మాత్రమే చూపెడుతున్నారు. వసుంధరబాబు కూడా సూసైడ్‌ నోట్‌ రాశాడు. అది చూపించడం లేదు. కాగా, వెస్ట్‌ డీఎస్పీ కేజీవీ సరిత, అరండల్‌పేట పోలీసు స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో ఏవీ శివప్రసాద్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌ టీం సభ్యులు వేలిముద్రలు, ఆధారాలను సేకరించారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top