ప్రజా సమస్యలకు ఏదీ చోటు?

ప్రజా సమస్యలకు ఏదీ చోటు?


రాజమండ్రి కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల ఆగ్రహం

     అజెండాలోని అంశాలు అప్రధానమైనవని నిరసన

     నగర పాలక సంస్థ అవినీతిమయమైందని ఆరోపణ


 

 సాక్షి, రాజమండ్రి :నగర పాలక మండలి (కౌన్సిల్) సాధారణ సమావేశంలో ప్రజా సమస్యలకు పెద్దపీట దక్కలేదని అధికార, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజెండాలోని అంశాలు పాలక మండలి సమావేశంలో చర్చించదగ్గ స్థాయిలో లేవని నిరసించారు. అంతేకాక నగర పాలక సంస్థ పరిపాలన  అవినీతిమయంగా మారిందని ధ్వజమెత్తారు. సమూలంగా ప్రక్షాళన చేయాలని ఎలుగెత్తారు.మేయర్ పంతం రజనీ శేషసాయి అధ్యక్షతన శుక్రవారం రాజమండ్రి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం క్రొవ్విడి లింగరాజు కౌన్సిల్ హాలులో జరిగింది. అజెండాలో లేని అంశాలపై వాడిగా వేడిగా చర్చ సాగింది. వివిధ విభాగాల అధికారుల వైఖరిని అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో బారికేడ్ల ఏర్పాటులో అక్రమాలు జరిగాయని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.

 

 ఇతర మున్సిపాలిటీల్లో రూ.లక్ష వరకూ ఖర్చు చూపిస్తే రాజమండ్రిలో మాత్రం రూ.ఐదు లక్షలకు పైగా ఖర్చు చేసినట్టు చూపుతున్నారన్నారు. 2013 నవంబరు నుంచి ఈ ఏడాది జనవరి వరకూ మున్సిపాలిటీల్లో టెండర్ల ద్వారా జరిగిన రూ.ఐదు కోట్ల పనుల్లో నగరపాలక సంస్థకు భారీగా నష్టం వచ్చిందన్నారు. తక్కువ ధరకు టెండర్లు ఖరారు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కౌన్సిల్‌లో కమిషనర్, ఇతర అధికారులు సభ్యుల ప్రశ్నలకు చెబుతున్న సమాధానాలు హాస్యాస్పదంగా ఉంటున్నాయన్నారు. అధికారులు నిబంధనలకు నీళ్లు వదిలి మేయర్, డిప్యూటీ మేయర్ చాంబర్లు, కౌన్సిలు హాలు ఆధునికీకరణకు రూ.నాలుగు లక్షలకు పైగా ఖర్చు చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ రవీంద్రబాబును నిలదీశారు.

 

 ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిందే..

 రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ అధికారులు పనితీరు మార్చుకోవాలని హితవు పలికారు. ఓ మున్సిపాలిటీ ఉద్యోగిపై లోకాయుక్తలో కేసు నడుస్తుండగా పదోన్నతి ఇచ్చి రిటైరయ్యాక రావాల్సిన డబ్బును కూడా లక్షల్లో ముట్ట చెప్పారన్నారు. కార్పొరేషన్ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అజెండాలోని అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థలో తమ్మయ్యనాయుడు అనే కాంట్రాక్టరు అధికారులను బెదిరించి పనులు చేయించుకుంటున్నా, బిల్లులు రాయించుకుంటున్నా అతడికే అన్ని పనులు కట్టబెట్టడం విచారకరమన్నారు. ఆ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానం ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు పలికారు. తమ్మయ్యనాయుడు దౌర్జన్యానికి దిగుతున్నా అధికారులు అతడిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని గోరంట్ల ఇంజనీరింగ్ అధికారులను నిలదీశారు.

 

 అలసత్వంతో భూములు అన్యాక్రాంతం..

 అధికారుల అలసత్యం కారణంగా కార్పొరేషన్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ధ్వజమెత్తారు. మూడో డివిజన్‌లో ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్న విషయం కమిషనర్ దృష్టికి తెచ్చినా పట్టించుకోక పోవడం విచారకరమన్నారు. హోర్డింగుల ద్వారా వచ్చే రాబడి ఐదేళ్లుగా తగ్గుతున్న ప్రస్తావన సమావేశాన్ని వేడెక్కించింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డితోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్లు రాబడి తగ్గడాన్ని సమావేశం దృష్టికి తెచ్చారు. హోర్డింగులకు రుసుమును ఏటా పది శాతం పెంచి వసూలు చేయాలనే నిబంధన ఉన్నా లక్షల్లో ఆదాయం తగ్గడం ఆయా విభాగాల అధికారుల అవినీతికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. పట్టణ ప్రణాళిక, ఆరోగ్య విభాగాల్లో ఇద్దరేసి అధికారులు ఒకే స్థాయి పోస్టుల్లో కొనసాగుతూ అయోమయం సృష్టిస్తున్నారని సభ్యులు ఎత్తిచూపారు. పట్టణ ప్రణాళికా విభాగం అవినీతి ఊబిలో కూరుకు పోయిందని అధికార, ప్రతిపక్ష సభ్యులు మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. డిప్యూటీ మేయర్‌కు డఫేదార్‌ను కేటాయించడం, ఇటీవల మున్సిపల్ అధికారులు ఒక వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేటర్‌తో అనుచితంగా ప్రవర్తించడం తదితర అంశాలపై టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుల మద్య వాగ్వాదం జరిగింది.

 

 తూతూ మంత్రంగా తీర్మానాలు..

 అజెండాలోని ఉపాధ్యాయుల బదిలీలు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలు, కబేళా నిర్మాణం, శిథిలమైన పాఠశాల భవనాలు తదితర అంశాలపై తూతూ మంత్రంగా చర్చించి తీర్మానాలు చేశారు. మొత్తం 19 తీర్మానాలు ప్రవేశ పెట్టగా నాలుగింటిని టేబుల్ ఐటెంలుగా ఉంచారు. మూడింటిని తిరస్కరించారు. రెండింటిని సవరింపులతో, మిగిలిన వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, టీడీపీ ఫ్లోర్ లీడర్ వర్రే శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, అన్ని డివిజన్‌ల కార్పొరేటర్లు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులతో మేయర్ ప్రమాణం చేయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top