ఆర్ట్స్ కళాశాలలో ఫీజు నిధులు గోల్‌మాల్!


- సంతకాలు ఫోర్జరీ చేసి రూ. 9 లక్షలు వాడుకున్న ఉద్యోగి




ఫోర్జరీ సంతకాలతో కోట్లాది రూపాయలు గోల్‌మాల్ చేసిన కుంభకోణం ఇటీవల ఎస్కేయూలో వెలుగులోకి వచ్చిన విషయాన్ని మరువకముందే అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో మరొకటి బయట పడింది. పీజీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంటు నిధులు రూ. 9 లక్షలు పక్కదారి పట్టాయి. ఈ అక్రమాలు బయట పడడంతో ఆ ఉద్యోగి ప్రిన్సిపాల్ వద్ద తన తప్పును అంగీకరించి, అంతటితో ఆగకుండా తాను తప్పు చేశానంటూ రాతపూర్వకంగా రాసిచ్చాడు.



వివరాల్లోకి వెళ్తే... ఆర్ట్స్ కళాశాలలో చదువుతున్న పీజీ విద్యార్థుల్లో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది.  రూ. 1200 నుంచి రూ. 20 వేలు దాకా వివిధ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లిస్తోంది. ఈ క్రమంలో జూనియర్ క్లర్క్ జే. ఆనంద్ విద్యార్థులకు అందజేయాల్సిన ఫీజు చెక్కులను వారిపేర్లు ఫోర్జరీ చేస్తూ సొంతానికి ఉపయోగించుకున్నారు. 2013 నుంచి ఈ విషయం నడుస్తోంది. రికార్డుల పరిశీలనలో ఈ అక్రమాలకు బయటపడగాయని భావించిన ఉద్యోగి ప్రిన్సిపాల్ రంగస్వామికి విషయం వివరించాడు. గత పది రోజులుగా ఈ తతంగం నడుస్తోంది. విచారణ జరిగితే అనవసరంగా ఇబ్బందులు తలెత్తుతాయని భావించిన యాజమాన్యం  క్లర్కుపై ఆర్జేడీ, కమిషనరుకు ఫిర్యాదు చేసింది. కమిషనరు ఆదేశాలతో విచారణకు కమిటీ వేయనున్నారు.



స్వాహా చేసిందిలా...

జూనియర్ క్లర్కు నెలలు తరబడి సదరు బ్యాంకుల్లో ఈ ఫీజు రీయింబర్స్‌మెంటు చెక్కులను డ్రా చేసుకున్నట్లు తెలిసింది. సాధారణంగా విద్యార్థులకు చెక్కులు అందజేసేటప్పుడు అకౌంట్ పే చెక్కులు ఇస్తారు. బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో తెరవాలంటే ఇబ్బందులు కలుగుతాయని విద్యార్థులు పేర్కొనడంతో బేవర్ చెక్కులు కూడా ఇస్తున్నారు. ఈ బేవర్‌చెక్ తీసుకుంటే నేరుగా ఎవరు బ్యాంకుకు వెళ్లినా...సదరు చెక్కులో ఉన్న పేరు చెబితే చాలు డబ్బు ఇచ్చేస్తారు. ఈ చెక్కుల్లో దాదాపు బేవర్‌చెక్‌లేనని తెలిసింది. తనకు అనుకూలమైన కొందరి విద్యార్థులతో ఈ తతంగం నడిపినట్లు సమాచారం. రోజూ విద్యార్థులు బ్యాంకుకు వెళ్లి చెక్కులు డ్రా చేసుకుని డబ్బులు సదరు ఉద్యోగికి ఇస్తే వారికి కొంత ఖర్చులకని ఇచ్చినట్లు తెలిసింది. ఈ రకంగా ఇప్పటిదాకా రూ. 9 లక్షలు డ్రా చేశాడని కళాశాల యాజమాన్యం చెబుతున్నా...విచారణ చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. ఈ విషయంపై ప్రిన్సిపాల్ రంగస్వామి మాట్లాడుతూ ఫీజు నిధుల్లో గోల్‌మాల్ జరిగింది వాస్తవేమనన్నారు. క్లర్కు కూడా తప్పును అంగీకరించాడని, ఉన్నతాధికారులకు నివేదించామన్నారు.



ఎన్‌ఎస్‌ఎఫ్ ఆందోళన

ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే సమాచారంతో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య నాయకులు బుధవారం కళాశాలకు చేరుకుని ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ చాంబర్‌లో బైఠాయించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల కడుపులు కొట్టిన సిబ్బందిని సస్పెండ్ చేయాలని కోరారు. మరింత లోతుగా విచారణ చేసి కారకులైన అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై ఇప్పటికే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, వారి సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని ప్రిన్సిపాల్ హామీ ఇచ్చారు.







 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top