వాటర్‌షెడ్‌లో అవినీతి ఊట


 గిద్దలూరు: వాటర్‌షెడ్ పనులు అధికారుల జేబులు నింపుతున్నాయి. మండలంలోని ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో నాశిరకపు పనులకు తోడు, బోగస్ మస్టర్లతో నిధులు స్వాహా చేశారు. వారం రోజులుగా జరుగుతున్న సామాజిక తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.30 లక్షలకుపైగా అవినీతి బయటపడింది.



జయరాంపురంలో సోమవారం జరిగిన సామాజిక తనిఖీ గ్రామసభలో ఆ గ్రామస్తులు వాటర్‌షెడ్ పనుల్లో అవకతవకలను అధికారులకు వివరించారు. మెగావాటర్ షెడ్ పరిధిలో 7 మైక్రో వాటర్‌షెడ్‌లున్నాయి. వీటికింద 2011 నుంచి దాదాపు రూ.1.60 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో సగం పనులు నీటి నిల్వ కార్యక్రమాలకు, మిగిలినవి పేదల జీవనోపాధులు పెంపొందించేందుకు రుణాలివ్వడం, శిక్షణ కార్యక్రమాలు, ఉద్యానవన మొక్కల పెంపకానికి ఖర్చు చేశారు. అయితే సిబ్బంది చేతివాటం ప్రదర్శించి సగానికిపైగా నిధులు దోచేసినట్లు తెలుస్తోంది.  



 నీటినిల్వ కార్యక్రమాల తీరు ఇదీ...

 ముండ్లపాడు మెగావాటర్‌షెడ్ పరిధిలో రూ.61.70 లక్షలతో నీటినిల్వ కార్యక్రమాలు చేపట్టారు. నీటినిల్వ కుంటలు, రాతికత్తువలు, చెక్‌డ్యాంలు, రాక్‌ఫిల్‌డ్యాంలు నిర్మించారు. ఇందుకు రూ.87.45 లక్షలు ఖర్చు చేశారు. కూలీలకు రూ.17.68 లక్షలు, మెటీరియల్‌కు రూ.69.77 లక్షలు, ప్రాజెక్టును పరిచయం చేసేందుకు ప్రాథమిక పని కింద క్రిష్ణంశెట్టిపల్లెలో వాటర్‌ప్లాంటు ఏర్పాటుకు రూ.4.25 లక్షలు వెచ్చించారు. ఇందులో నాణ్యతలేని పరికరాలు ఇచ్చి నిధులు స్వాహా చేశారు.



 నీటినిల్వ పనుల్లో కూలీల చేత చేయించాల్సిన వాటిని జేసీబీలతో చేసి కూలీల పేర్లతో మస్టర్లు వేసి తపాలాశాఖ సిబ్బంది సహకారంతో వాటర్‌షెడ్ అధికారులు నిధులు దోచేశారు. ఇలా రూ.17.68 లక్షలను సిబ్బంది నొక్కేసినట్లు విచారణలో తేలింది.

 

మెటీరియల్ పేమెంట్ కింద ఖర్చు చేసిన నిధుల్లో భారీగా అవినీతి జరిగినట్లు బయటపడింది. రాతి కత్తువల నిర్మాణానికి తరలించిన రాళ్లను నాలుగు కిలోమీటర్లకు బదులు 8 కిలోమీటర్లుగా నమోదు చేసి అధిక మొత్తంలో నిధులు డ్రాచేశారు. అంబవరంలో నిర్మించిన కుంటలకు కట్టిన రాతి కత్తువలు తక్కువ సైజు కుంటలకు ఎక్కువ కొలతలు చూపించి నిధులు నొక్కేశారు. ఇలా నిర్మించిన కుంటలు అధిక శాతం కొట్టుకుపోయాయని తేలింది.

 

ప్రాజెక్టు పరిధిలోని పనులను వాటర్‌షెడ్ సిబ్బందే కాంట్రాక్టరు అవతారం ఎత్తి నాశిరకంగా చేసి నిధులు స్వాహా చేశారని రైతులు ఆరోపించారు. జయరాంపురంలో నిర్మించిన మూడు చెక్‌డ్యాంలు నాశిరకంగా ఉండటంతో వర్షపు నీరు నిల్వ ఉండటం లేదని గ్రామస్తులు తెలిపారు. చాలా చోట్ల చెక్‌డ్యాంల నిర్మాణాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. మెటీరియల్ పేమెంట్‌లో సిబ్బంది వారికి అనుకూలంగా ఉండే వారి ఖాతాల్లో నిధులు జమచేసి అనంతరం వారి నుంచి నిధులు తీసేసుకున్నారని తేలింది.

 

జీవనోపాధుల నిధుల్లోనూ మాయాజాలం: మెగా వాటర్‌షెడ్ కింద పేద మహిళలకు జీవనోపాధులు పెంపొందించేందుకు కేటాయించిన నిధుల్లోనూ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. వాటర్‌షెడ్ కమిటీలకు తెలియకుండానే తమకు నచ్చిన వారికి రుణాలిచ్చారు. వ్యవసాయం కోసం రుణాలు ఇవ్వకూడదని ఉన్నా ఐకేపీ సిబ్బందికి తగిన అవగాహన కల్పించకపోవడంతో ఎక్కువ రుణాలను వ్యవసాయం కోసం ఇచ్చారు. విత్తనపు పొట్టేళ్ల యూనిట్లు 26 మంజూరు చేయగా అందులో ఎక్కువ మందికి గొర్రెలు లేనివారికి ఇచ్చి సిబ్బంది సొమ్ము చేసుకున్నారు.

 

మొక్కలు నాటకుండానే బిల్లులు: వాటర్‌షెడ్ పరిధిలో ఉద్యానవన మొక్కల పెంపకానికి కేటాయించిన నిధులను మొక్కలు నాటకుండానే స్వాహా చేశారు.  ఇలా ఒక్క జయరాంపురం మైక్రో వాటర్‌షెడ్ పరిధిలోనే దాదాపు రూ.2 లక్షల వరకు డ్రా చేసుకున్నారు.  



వాటర్‌షెడ్ అధికారులు గ్రామ స్థాయిలో తన అనుయాయులను పెట్టుకుని నిధులను స్వాహా చేశారని జయరాంపురం గ్రామస్తులు సామాజిక తనిఖీ సిబ్బందికి వివరించారు.  సామాజిక తనిఖీ గ్రామసభలో కంభం వ్యవసాయాధికారి అర్జున్‌నాయక్, వెల్లుపల్లె పశువైద్యాధికారి శ్రావణ్‌కుమార్, మెగా వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి శ్రీనివాసరెడ్డి సామాజిక తనిఖీ స్టేట్ రిసోర్సుపర్సన్ నాగార్జున, డీఆర్‌పీలు, ఐకేపి సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top