కురవని జల్లులకు లక్షలు చెల్లు


- కోటిలింగాలఘాట్లో శివుని విగ్రహంతో జల్లుస్నానఘట్టం

- టెండర్లు పిలవకుండా నామినే షన్ పద్ధతిన పనులు

- రూ.10 లక్షలతో అయ్యే పని రూ.18 లక్షలకు అప్పగింత

- బడా కాంట్రాక్టర్‌కు వత్తాసునిచ్చిన టీడీపీ ప్రజాప్రతినిధి

- పుష్కరాల్లో ఒక్కరోజూ ఉపయోగపడని నిర్మాణం

- వృద్ధులు, వికలాంగులకు తప్పని అవస్థలు

రాజమండ్రి సిటీ :
పుష్కరాల సందర్భంగా చేపట్టిన పనుల్లో అవినీతి వెల్లువెత్తిందని, పనుల్లో నాణ్యత లోపించిందని అటు అధికార పక్షమైన తెలుగుదేశం, ఇటు మిత్రపక్షమైన బీజేపీ నేతలు కొందరు చేస్తున్న ఆరోపణలకు విస్తరించిన కోటిలింగాలఘాట్లో నిర్మించిన శివుని విగ్రహంతతో కూడిన జల్లు స్నానఘట్టం సాక్ష్యంగా నిలుస్తోంది. ఘాట్‌కు వచ్చే వృద్ధులు, వికలాంగులు రేవు మెట్లు దిగి, నదిలో స్నానమాచరించడానికి కష్టపడనక్కర లేకుండా ఈ నిర్మాణం చేపట్టారు. ఇదే విషయమై ప్రజాప్రతినిధులు పదేపదే ప్రకటనలు చేశారు. అరుతే పుష్కరాల 12 రోజుల్లో ఈ జల్లుస్నాన ఘట్టం వర్షించిన పాపాన పోలేదు. అంతేకాదు.. ఈ ఒక్క పనిలోనే రూ.8 లక్షల మేర అవినీతి జరిగిందన్న ఆరోపణలు ఉన్నారు.



ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ పనికి సంబంధించి టెండర్ విధానానికి నీళ్లు వదిలి, నగరంలో పేరొందిన కాంట్రాక్టర్‌కు నామినేషన్ పద్ధతిపై కట్టబెట్టారని విశ్వసనీయ సమాచారం. కేవలం రూ.10 లక్షలతో పనులు పూర్తి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ సుమారు రూ.18  లక్షలు ఇచ్చేలా పనులు అప్పగించినట్లు చెపుతున్నారు. అంటే ఈ ఒక్క నిర్మాణంలోనే రూ.8 లక్షల మేర అవినీతి జరిగిందన్న మాట. కేవలం అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వత్తాసుతోనే సదరు బడా కాంట్రాక్టరుకు ఎక్కువ సొమ్ముకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారంటున్నారు. ఇంతా చేసి.. ఈ జల్లుస్నానఘట్టం వృద్ధులకు, వికలాంగులకు ఒక్కరోజు కూడా ఉపయోపడలేదు.



పుష్కరాలు జరిగిన 12 రోజుల్లో ఒకసారి మాత్రమే ట్రయల్ రన్ వేసిన అధికారులు తర్వాత ఈ జల్లు స్నానఘట్టం వైపు కన్నెత్తి చూడలేదు. దీనితో పుష్కరస్నానం ఆచరించేందుకు కోటిలింగాల ఘాట్‌కు వచ్చిన వృద్ధులు, వికలాంగులు విధి లేక ప్రయూస పడుతూనే మెట్లు దిగి గోదావరిలో స్నానం చేయవలసి వచ్చింది. నామినేషన్ విధానం ద్వారా కేటాయించిన ఈ పనిపై ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహిస్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top